"యాక్షన్ సినిమా కాబట్టి దీన్ని థియేటర్లో విడుదల చేయాలనే ప్రణాళిక వేసుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ మంచి ఎంపిక. దానికి అనువుగా ఉండేలా సినిమాలో కొన్ని మార్పులూ చేశాం. ఈ వేదిక ద్వారా థియేటర్లో కంటే ఎక్కువ మంది సినిమా చూసే వీలు కలుగుతుంది. సుమారుగా 200 దేశాలకు తెలుగు సినిమా పరిశ్రమ విస్తరిస్తుంది" అని కథానాయకుడు సుధీర్‌బాబు అంటున్నారు. త్వరలో 'వి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
కథాబలం ఉన్న యాక్షన్ సినిమా. ఇందులో ఓ రక్షకుడు, ఓ రాక్షసుడు ఉంటారు. ఈ రెండు ప్రధాన పాత్రలు వాళ్లు నమ్మినదాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. రెండింటికీ ప్రత్యేకత ఉంటుంది. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన ఓ పోలీసు అధికారికి ఓ కిల్లర్ సవాల్ విసురుతాడు. అతన్ని ఆ అధికారి ఆపగలడా.. లేదా అనేదే కథాంశం. సినిమాలో నేను, నాని పోటీ పడటం లేదు. మా పాత్రలే పోటీ పడతాయి.
అప్పుడే ప్రారంభం
నేను బ్యాడ్మింటన్ ఆటగాడిని. సినిమాల్లో విజయం సాధిస్తానా? విఫలమవుతానా? అని నేనెప్పుడూ ఆలోచించలేదు. సినిమాలంటే ఇష్టం. చేస్తున్నాం! అని అనుకుంటా. చిత్రపరిశ్రమకు నేను ఓ అంచనా వేసుకుని రాలేదు. పుల్లెల గోపీచంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమా కొన్ని కారణాలతో వెనక్కి వెళ్తోంది. చిత్రీకరణ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుందని అనుకుంటున్నా. ఇది పాన్ ఇండియా చిత్రం.
ఆ సన్నివేశాలు బాగా పండాయి
నాకు, హీరోయిన్ నివేదా థామస్‌కు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అంతేకాదు.. హీరోహీరోయిన్ల మధ్య ఉండే సీన్ల కంటే... హీరో, విలన్ మధ్య ఉండే సన్నివేశాలే బాగా పండాయి. ఇక అదితీరావ్ ఇందులో బాగా నటించింది. ఆమె ప్రతికూల పాత్రలో నటిస్తుందో... సానుకూల పాత్రలో మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.