తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీకాంత్ పారిపోయాడు.. దేనికి పనికిరాడని అన్నారు' - శ్రీకాంత్ సినిమాలు

srikanth movies: ఎలాగైనా సినిమా హీరో అవ్వాలనే కోరికతో ఇంట్లో నుంచి పారిపోయినట్లు చెప్పారు నటుడు శ్రీకాంత్. సినిమా ఫీల్డ్​లో కష్టపడటం, మంచితనం, నిజాయతీ అనేవి చాలా కీలకమని చెప్పారు. 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'చెప్పాలని ఉంది' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

srikanth movies
నటుడు శ్రీకాంత్

By

Published : Dec 7, 2021, 4:53 PM IST

srikanth movies: సినీ వినీలాకాశంలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు 'శ్రీకాంత్‌'. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన 'పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌' సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో విలన్‌గా.. ఇంకొన్ని సినిమాల్లో హీరోగా.. మరికొన్ని సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో మనందరినీ వెండితెరపై అలరించారు. 125 సినిమాలకుపైగా నటించి ఇంకా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తున్న.. 'ఫ్యామిలీ హీరో', 'పబ్లిక్‌ స్టార్' శ్రీకాంత్‌ 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'చెప్పాలని ఉంది' కార్యక్రమంలో పలు విషయాలు పంచుకున్నారు.

శ్రీకాంత్

చిన్నప్పుడు సినిమా మీద ఆసక్తితో మద్రాసుకు పారిపోయారని విన్నాం. నిజమేనా?

శ్రీకాంత్‌: (నవ్వులు) అవునండీ. పదో తరగతి తరువాత సినిమాలంటే బాగా ఆసక్తి ఏర్పడింది. నేను హీరో అవ్వాలనే తపన ఎక్కువైంది. కర్ణాటకలో పుట్టి పెరిగాను. అక్కడే చదివాను.

మరి తెలుగు సినిమాలు బాగా చూసేవారా?

శ్రీకాంత్‌: బళ్లారిలో తెలుగు సినిమాలు ఎక్కువగా విడుదలయ్యేవి. చెప్పకుండా వెళ్లి సినిమాలు చూసేసి వచ్చేవాళ్లం. అలా సినిమా మీద ఆసక్తి, సినిమా గురించి మాట్లాడుకోవడం, ఆ వయస్సులో స్నేహితులంతా తమ అభిమానుల హీరోల గురించి చెప్పుకోవడం జరిగేది. నేను చిరంజీవి అభిమానిని. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక నాలో బలంగా ఏర్పడింది. ఇంటర్‌లో చేరినా చదివేది అర్థంకాక, ఇంటికొచ్చేశా. నాన్న రూ.4 వేలు ఇచ్చారు. అది తీసుకుని మద్రాస్‌ ట్రైన్‌ ఎక్కేశా. ఈ విషయం మా ఫ్రెండ్స్‌ ఇద్దరు ముగ్గురికి మాత్రమే తెలుసు. వాళ్లకి ఇంట్లో చెప్పొద్దన్నా. అలా మద్రాస్‌ పారిపోయా. నాలుగు రోజులు అక్కడే ఉన్నా. మద్రాస్‌ సెంట్రల్‌ దగ్గర హోటల్‌లో దిగా. అప్పట్లో సితార, జ్యోతి చిత్ర లాంటివి ఫేమస్‌. చిరంజీవి గారి షూటింగ్‌ ఎక్కడ జరుగుతుంది? మెరీనా బీచ్‌, ఏవీఎం స్టూడియోస్‌లో ఏం జరుగుతుంది? అలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాన్ని చుట్టేసేవాడిని. ఓరోజు ఏవీఏం స్టూడియోస్‌కి వెళ్తే లోపలికి పంపించలేదు. నేను హీరోని అని చెప్పినా పక్కన పెట్టేశారు. మూడు రోజులు కొంచెం బాధ పడ్డా. జరిగిన విషయమంతా విజయవాడలో ఉండే నా సోదరికి చెప్పా. 'హీరో ఏం వద్దు.. ఇంట్లో అమ్మవాళ్లు బాధపడుతున్నారు' అని చెప్పింది. అప్పటికే ఇంట్లో తెలిసిపోవడం వల్ల నా కోసం ధార్వాడ్‌లోని నా స్నేహితులతో మాట్లాడారు. ఊర్లో నా గురించి 'మీ వాడు పారిపోయాడంట.. దేనికీ పనికిరాడు' అన్నారు. అన్నీ తెలిశాక ఇది నాకు కర్టెక్‌ కాదనిపించి ఇంటికొచ్చేశా. అలా ఆ సంవత్సరం వృథా అయింది. ఇంట్లో ఒక్క మాట అనలేదు. ఏమైనా అంటే మళ్లీ నేను పారిపోతా అని (నవ్వులు). అలా మరో సంవత్సరం ధార్వాడ్‌ వెళ్లి డిగ్రీ పూర్తి చేశా.

మరి డిగ్రీ చేసి వచ్చాక..

శ్రీకాంత్‌: సినిమాల మీద ఇష్టం తగ్గలేదు. దీంతో అడయార్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ మద్రాస్‌లో ప్రయత్నించా. నేను కర్ణాటక నుంచి సీట్‌ కోసం అప్లై చేసి ఇంటర్య్వూకి వెళ్లా. అక్కడ తమిళ్‌లో మాట్లాడమంటే నాకు ఆ భాష రాదు. యాక్టింగ్‌ కూడా రాదు. నాటకాలు వేసిన అనుభవమూ లేదు. సో సీట్‌ రాలేదు. దీంతో విజయవాడు వెళ్లి మా అక్క దగ్గర ఉండిపోయా. అలా నాలుగైదు నెలలు వృథా అయ్యాయి. అక్కడ మా బావగారు.. లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌ లింగమూర్తి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ నా గురించి చెప్పారు. సినీ పరిశ్రమలోకి వెళ్లమని ప్రోత్సహించారు. అలా రోజూ ఆయన దగ్గరికి వెళ్లి కూర్చుని సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఓ అవగాహనకు వచ్చాక హైదరాబాద్‌లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌ మధుసూదన్‌గారి దగ్గరికి వచ్చా. అప్పటికి ఐదారు నెలలు అయిపోయాయి. 'సర్‌.. ఈ ఆరు నెలలు అబ్జర్వ్‌ చేస్తూ ఉంటాను. వచ్చే ఏడాది జాయిన్‌ అవుతాను' అన్నాను. దానికి ఆయన సరే అనడం. అప్పుడే పూరీ జగన్నాథ్‌ వాళ్ల బ్యాచ్‌ నడుస్తోంది. వాళ్లది పూర్తయిన తర్వాత నేను ఎంటర్ అయ్యా. అలా వాళ్లతో మూడు నెలల్లో డ్యాన్స్‌, షూట్‌ చేయడం అయిపోయాయి. 'వచ్చే ఏడాది వరకూ అక్కర్లేదు. మేమేమీ ఇవ్వం కదా. ఇక నువ్వు బయట ప్రయత్నించు' అన్నారు. అప్పుడు వెంటనే ఉషాకిరణ్‌ మూవీస్‌ వారు 'పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌'లో నటించేందుకు 10-15 మంది కావాలని పిలుపు వచ్చింది. నా ఆల్బమ్‌ తయారు చేసి వెళ్లి ట్రై చేశా. నేను మధు ఇనిస్టిట్యూట్‌ బ్యాచ్‌-7 నాకన్నా ముందు 50 మంది ఉన్నారు. చూసి షాక్‌ అయ్యా!

  • అట్లూరి రామారావు, మోహన్‌ గాంధీ గారు ఇంటర్వ్యూ చేశారు. నడిచి రా, ఎమోషనల్‌గా చూడు, డైలాగ్స్‌ చెప్పు అని అడిగారు. అప్పటికీ నాకు వస్తుందని నమ్మకం లేదు. వెళ్లిన ఒక నెలకు 'నువ్వు సెలక్ట్‌ అయ్యావు' అని ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి నాకు కాల్‌ వచ్చింది. అప్పటికీ ఏ పాత్ర అన్నది తెలియదు. ఇక పేపరులో 'శ్రీకాంత్‌ పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌'లో.. అని నా పేరు వచ్చాక ఊరెళ్లి గోలగోల చేశా. ఫస్ట్‌ సినిమా నమ్మలేకపోయా. ఇక షూటింగ్‌కి వెళ్లా నా పాత్ర నక్సలైట్స్‌ లీడర్‌ అని చెప్పారు. బాబోయ్‌ నేను చేయలేనేమోనని భయపడ్డా. 1990 సెప్టెంబర్‌3న అరకులో షూటింగ్‌లో జరిగింది. చరణ్‌ రాజ్‌, నేను కలిసి చేశాం. "తూర్పు నుంచి పడమరకి.. పడమర నుంచి తూర్పుకి మార్చింగ్‌ చేస్తూ.. పహారా కాస్తున్న సూర్యుళ్లు మావాళ్లు. ఎదురెళ్లితే మాడిపోతావ్‌" ఇది నా తొలి డైలాగ్‌.

తొలినాళ్లలో మీకు ఎదురైన అనుభవాలు

శ్రీకాంత్‌: మొదటన్నుంచి నేను హీరో అవ్వాలనే వచ్చాను. 'పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌' తరువాత 'మధురానగర్‌లో' నలుగురు హీరోల్లో ఒకడిగా చేశా. ఆ తరువాత నాకు అవకాశాలు రాలేదు. అప్పుడు 'సీతారత్నం గారి అబ్బాయి'లో విలన్‌ పాత్ర వచ్చింది. 'హీరో అవుదామని వస్తే విలన్‌ పాత్రలు వస్తున్నాయి' అని అనుకున్నా. నాకేమీ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు, నన్ను పెట్టి హీరోగా తీసేవారు లేరు.. దీంతో వచ్చిన విలన్‌ పాత్రకు ఓకే చెప్పాను. అలా 13 సినిమాల్లో విలన్‌గా చేశా. (ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అబ్బాయి గారు, కొండపల్లి రాజా..). అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు పిలిచి 'విలన్‌గా వద్దు. హీరోగా చేయి' అని ఆపేయమన్నారు. 'వన్‌ బై టూ'లో నాకు హీరోగా అవకాశమిచ్చారు. అలా మళ్లీ నా కెరీర్‌ మొదలైంది. భగవంతుడి దయ వల్ల ఇబ్బంది పడలేదు. బాధపడటం, ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా? అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకున్నా. అదే నన్ను హీరోను చేసింది. అలా దొంగ రాస్కెల్‌, వన్‌ బైటూ, బ్రేక్‌నిచ్చాయి. 'ఆమె', 'తాజ్‌మహల్‌', 'పెళ్లిసందడి' ఇక అక్కడి నుంచి మీకు తెలిసిందే.. అలా 135 చిత్రాలు చేశా!

'ఆమె' తరువాత ఆమె కూడా అక్కడే దొరికారు కదా!

భార్య ఊహతో

శ్రీకాంత్‌: (నవ్వులు) ఆమె (ఊహ) కూడా అక్కడే దొరికింది. తన మొదటి చిత్రానికి నేనే హీరో. సహ నటిగానే చూశా. తన ప్రవర్తన, సరదాగా మాట్లాడటం.. అలా మొదలైంది. తరువాత మూడు నాలుగు సినిమాలు చేశాం. పాత బస్తీ, ఆయన గారు, కూతురు.. అలా మా ఫంక్షన్స్‌లో ఫ్యామిలీతో కలిసిపోవడం.. తను బాగా నచ్చింది. ఒకరకంగా లవ్‌ మ్యారేజీ అనడం కన్నా అరేంజ్డ్‌ మ్యారేజీ అనుకోవచ్చు. ఎందుకంటే మా ఇంట్లో , వాళ్లింట్లో ఏ ప్రాబ్లమ్‌ లేకుండా సాఫీగా సాగింది.

సినిమా స్టైల్‌లో ప్రపోజ్‌ చేయలేదా?

శ్రీకాంత్‌:ప్రపోజ్‌ అంటే ఫస్ట్‌ నేనే చేశాను. మద్రాస్‌ వెళ్లి గొలుసు కొనుక్కొని వాళ్లింటికి డైరెక్ట్‌గా వెళ్లి.. పైన దేవుడి మందిరం ఉండేది. అక్కడికి తనను, వాళ్ల అమ్మానాన్నను పిలిచి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని గొలుసు మెడలో వేశా. అప్పటికే తనకి నేనంటే ఇష్టం ఉండటం వల్ల మా ప్రయాణం మొదలైంది.

ఆవిడ అసలు పేరు ఏంటి?

శ్రీకాంత్‌: ఉమామహేశ్వరి. తమిళ్‌ పేరు 'శివరంజని'. ఇక్కడ 'ఊహ' అని పెట్టారు. ఇప్పుడు మేమంతా ఉమామహేశ్వరి. ఉమా అని పిలుస్తుంటాం.

'పెళ్లిసందడి'

'పెళ్లిసందడి' ఓ ట్రెండ్‌ సృష్టించిన సినిమా. దీని తరువాత మీ హవా ఎలా నడిచింది?

శ్రీకాంత్‌: అంతకముందే 'తాజ్‌మహాల్' హిట్‌ అవ్వడం, 'పెళ్లి సందడి' హిట్‌ అవుతుందని నేను ఊహించలేదు. అరవింద్‌ గారు, దత్తు గారు పెద్ద నిర్మాతలు. వారు నాతో మాట్లాడుతూ.. 'రాఘవేంద్రరావు దర్శకత్వంలో నీతో సినిమా చేయాలనుకుంటున్నాం' అని అనడం వల్ల నేను ఓకే చెప్పేశా. అది ఎంత పెద్ద బ్లాక్‌ బాస్టర్‌ అనేది మీ అందరికీ తెలిసిందే. రాఘవేంద్రరావు గారు సెట్‌లో కానీ, బయట కానీ చాలా సరదాగా ఉంటారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరో, ప్రతీ ఆర్టిస్ట్‌తో ఒకే విధంగా ప్రవర్తిస్తారు. అందరితో బాగుంటారు. 'పెళ్లిసందడి' లాంటి ట్రెండ్‌సెట్టర్‌ తరువాత రాఘవేంద్రరావుతో 'మళ్లీ మీతో ఎప్పుడు చేస్తాను' అంటే 'ఇంత పెద్ద హిట్‌ అయింది కాబట్టి.. మన ఇద్దరి నుంచి ఇంకా పెద్ద హిట్‌ ఆలోచిస్తారు కాబట్టి.. ఆ టైప్‌ సబ్జెక్ట్‌ దొరకట్లేదు కాబట్టి.. మనం చేయట్లేదు' అన్నారు.(నవ్వులు)

'పెళ్లిసందడి' హిట్‌ అవ్వగానే ఇండియా టుడే మ్యాగజైన్‌లో మీ గురించి వచ్చింది. అప్పట్లో సౌతిండియా నుంచి మన తెలుగు వాళ్ల స్టోరీ రావడం అరుదైన విషయం.. దాని గురించి..

శ్రీకాంత్‌: 'పెళ్లిసందడి' హిట్‌ అవ్వగానే..ఇంగ్లిష్‌ ఛానెల్స్‌ నా ఇంటర్వ్యూ కోసం వచ్చాయి. కానీ అన్నింటికీ నో చెప్పా. ఎందుకంటే నాకు కొంచెం లోప్రొఫైల్‌ ఇష్టం. వీటన్నింటిని నేను నమ్మలేకపోయా. అప్పుడే కెరీర్‌ ప్రారంభంలో ఉన్నా. నిజమా కలా అని అనుకునేవాడిని. నేనెప్పుడూ ప్లానింగ్‌లో ఉండేవాడిని కాదు. ఇప్పుడున్న జనరేషన్స్‌ ప్లానింగ్‌ అప్పుడుంటే మాకు వేరేలా ఉండేది. నేషనల్‌ ఛానెల్స్‌ రావడం, హిందీలోనూ అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్‌లో హ్యాపీగానే ఉన్నానని వాటికి నో చెప్పా.

విలన్‌గా చేశాక.. హీరో పాత్రలకోసం ఎలా మారారు?

శ్రీకాంత్‌: 'పెళ్లిసందడి' తరువాత ఎక్కువ ఈవీవీ గారు, ఎస్వీ కృష్ణారెడ్డి గారితోనే. ఒక్కొక్కరి దర్శకత్వంలో వరుసగా 10, 12 సినిమాలు చేశా. ఆలోచించుకునే టైమ్‌ ఉండేది కాదు. అన్నీ ఫ్యామిలీ సబ్జెక్ట్స్‌. అన్ని సక్సెస్‌ కాబట్టి అలా వెళ్లిపోయేవి. ఆమె, తాజ్‌మహల్‌, పెళ్లిసందడి, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, తాళి.. అన్నీ సూపర్‌ హిట్స్‌. అలా చేసుకుంటా వెళ్లిపోయేవాళ్లం. అలా ఏడాదికి 9, 10 చిత్రాలు చేసేవాడిని.

చిరంజీవికి అభిమాని మీరు. అలాంటిది మీకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఎలా అనిపించింది?

శ్రీకాంత్‌:చాలా హ్యాపీ. అన్నయ్యతో కలిసి 'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌'లో చేశా. ఒకరోజు అన్నయ్యతో సర్య్కూట్‌ పాత్ర ఎవరు చేస్తున్నారంటే.. 'నువ్వు చేస్తావా' అని అడిగారు. 'సరే అన్నయ్య' అన్నాను. మూడు రోజుల తరువాత సర్య్కూట్‌ పాత్ర నీదే అని పిలుపొచ్చింది. ఎగిరి గంతేశా. ఆయనతో కలిసి పనిచేయడం ఒక కల. ఆయన స్ఫూర్తితో ఇక్కడికొచ్చా. ఆయన టైమింగ్‌.. పాత్రను ఇంప్రూవైజేషన్‌ చేయడం.. అలరించడం.. గొప్ప అనుభవం. ఆ పాత్ర కూడా ఒక శిష్యుడి పాత్ర. నిజజీవితంలో ఆ బంధం ఉండటం వల్లే ఇంకా ఆ పాత్ర పండింది.

'ఖడ్గం', 'ఆపరేషన్‌ దుర్యోధన' తదితర చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. వాటిపై మీ అభిప్రాయం!

శ్రీకాంత్‌: డిఫరెంట్‌ పాత్రలు చేయడం నాకిష్టం. ప్రారంభంలో ఫ్యామిలీ ముద్ర పడిపోయింది కానీ, డిఫరెంట్ పాత్రలు నా దగ్గరికి రాలేదు. కృష్ణవంశీ 'ఖడ్గం'లో నా పాత్ర గురించి చెప్పారు. బాగా నచ్చి చేస్తానని చెప్పా. అయితే నిర్మాత అడ్డుచెప్పారు. 'శ్రీకాంత్‌ ఫ్యామిలీ హీరో వద్దు' అన్నది ఆయన వాదన. 'లేదు శ్రీకాంత్‌ బాగా చేస్తాడు నాకు నమ్మకం ఉంద'ని కృష్ణవంశీ అన్నారు. మీకు వద్దు అంటే వేరే నిర్మాతతో 'ఖడ్గం' చేస్తా అని చెప్పాడు. చివరకు నిర్మాత ఒప్పుకొన్నారు. 'ఖడ్గం' తరువాత పాత్రల కోసం వెయిట్‌ చేయమన్నారు. ఈలోగా నాలుగు సినిమాలు ఒప్పేసుకున్నా. అందులో 'పెళ్లాం ఊరెళ్లితే'. నాకు మొహమాటం ఎక్కువ.

విశ్వనాథ్‌గారితో కలిసి పనిచేయడం..

'స్వరాభిషేకం'లో..

శ్రీకాంత్‌:అదొక మర్చిపోలేని అనుభవం. ఒకేసారి బాపుగారి 'రాధా గోపాళం', విశ్వనాథ్ గారి 'స్వరాభిషేకం'. వంశీ గారి 'దొంగరాముడు అండ్‌ పార్టీ' చేశా. విశ్వనాథ్‌ గారితో కలిసి పనిచేయడం ఒక అదృష్టం. ఈ జనరేషన్‌ అంతా వాళ్లతో కలిసి పనిచేయలేమని మిస్‌ అవుతుంటారు. ఒకే సారి డిఫరెంట్‌ స్టైల్‌ ఉన్న బాపు, విశ్వనాథ్‌ గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. వాళ్లొక లెజెండ్స్‌. బాపు గారు సరదాగా ఉంటారు. ఆయన దర్శకత్వంలో 'శ్రీరామరాజ్యం'లో లక్ష్మణుడి పాత్ర చేశా.

సహ నటుల నుంచి ఎలాంటి అనుభవాలు వచ్చాయి!

శ్రీకాంత్‌:మొదటనుంచి నేను మల్టీస్టారర్‌ మూవీస్‌ చేశా. హీరోగా ఉన్నప్పుడే నేను డూప్‌గా చేశా. మీకో విషయం తెలుసా? నాగార్జున 'హలో బ్రదర్‌' చిత్రంలో ఓ బాత్‌ టబ్‌సీన్‌కి డూప్‌గా చేశా. వెంకటేశ్‌, చిరంజీవి, బన్నీ, రామ్‌ చరణ్, జగపతిబాబు, నవీన్‌లతో కలిసి పనిచేశా. ఇలా చేస్తే నా కెరీర్‌ ఏమవుతుందోననే భయం లేకుండా చేసుకుంటూ వెళ్లిపోయా.

వివాదాలు, సెన్సేషనల్‌ న్యూస్‌లోకి రారు. కారణమేమిటి?

శ్రీకాంత్‌: నేను వాటికి దూరంగా ఉంటా. తెలియకుండా కొన్ని కొన్ని వివాదాలు 'మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్స్‌'లో వచ్చాయంతే. అది కూడా సపోర్ట్‌ చేశాను. నాపని చేసుకుని వెళ్లే పోయే స్వభావం నాది. వేరే వాళ్లని విమర్శించను.

శ్రీకాంత్‌ అంటే సినిమా సెట్‌లో ఉంటారు.. లేదంటే క్రికెట్‌ స్టేడియం, ఇంట్లో ఉంటారని విన్నాం. నిజమేనా!

శ్రీకాంత్‌: షూటింగ్‌ గ్యాప్‌లో క్రికెట్‌ ఆడతాం. కారు డిక్కీలో బ్యాట్‌, బాల్‌ ఎప్పుడూ ఉంటాయి.

రోషన్‌ తెరంగ్రేటం గురించి..

శ్రీకాంత్‌: తనకు అసలు ఏమీ తెలియదు. 10వ తరగతి తరువాత నాగార్జున ప్రొడక్షన్‌గా వచ్చిన 'నిర్మలా కాన్వెంట్‌'లో చేశాడు. దానికన్నా ముందు 'రుద్రమదేవి'లో రానా చిన్నప్పటి పాత్ర చేశాడు. నిర్మలా కాన్వెంట్‌ గురించి రోషన్‌కి చెబితే మీ ఇష్టం నాన్న అన్నాడు. ఆ తరువాత సినిమా అవకాశాలు వచ్చినా ఆపేశాం. ఇంకా మెచ్యురిటీ రావాలని ఆగాం. ఈలోపు లాస్‌ ఏంజెల్స్‌లో లీ స్టార్స్‌బర్గ్‌ థియేటర్‌ అండ్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో డిప్లొమో చేసి మళ్లీ ప్రభుదేవా దగ్గర దబాంగ్‌-3 కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడు. అనుకోకుండా రాఘవేంద్రరావు రోషన్​ని చూడటం, పెళ్లిసందD చేయడం జరిగిపోయాయి.

'పెళ్లిసందD'

పెళ్లిసందD సినిమాని రోషన్‌ చేశాడు. మీ రియాక్షన్‌ ఏమిటి?

శ్రీకాంత్‌: పెళ్లిసందడి అనే బ్లాక్‌బాస్టర్ చిత్రాన్ని‌. మళ్లీ అదే పేరుతో తీయడమంటే సాహసం. అది కూడా మా అబ్బాయితో. కచ్చితంగా భయం అయితే నాలో ఉండేది. కానీ రాఘవేంద్రరావు గారి మీద ఉన్న నమ్మకంతో ముందుకెళ్లా. మొదటి సినిమా ఆయనతో చేస్తే ఫ్రీ అవుతాడు. ఆయన హ్యాండ్‌ మంచిది. ఓ పక్క సాంగ్స్‌, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్మెంట్ అని కలిపి ఉంటాయి.

శ్రీకాంత్ ఫ్యామిలీ

మీ అమ్మాయి క్రీడల్లో ఉన్నారని అని విన్నాం..

శ్రీకాంత్‌: అవునండీ. బాస్కెట్‌ బాల్‌ నేషనల్స్‌ ఆడింది. అలాగే బాగా చదువుతుంది కూడా. క్రీడలంటే బాగా ఇష్టం

ఓటీటీలోనూ మీరు చేస్తున్నారు.ఆ అనుభవాలు

శ్రీకాంత్‌:ఇప్పటికీ మూడు వెబ్‌సిరీస్‌లు చేశా. జీ5కి 'చదరంగం' చేశాను. దానికి మంచు విష్ణు నిర్మాత. అది బాగా హిట్‌. చిరంజీవిగారి అమ్మాయి సుస్మిత 'షూట్‌అవుట్ అట్‌ ఆలేరు' అని నేను, ప్రకాశ్‌రాజ్‌ చేశాం. సత్యదేవ్‌ నేను ఓ వెబ్‌సీరిస్‌ చేశాం. అది త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో ముందుకు రానుంది. నాకు వ్యక్తిగతంగా థియేటర్లో చూడటం ఇష్టం. అందులో వీక్షిస్తున్నప్పుడు వచ్చే మజానే వేరు.

మీరు సినిమాల్లో నటించాక.. మీ అమ్మానాన్నలతో కలిసి చూసిన సినిమా ఏది?

శ్రీకాంత్‌: 'పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌'కి అమ్మరాలేదు. నాన్న వచ్చారు. హైదరాబాద్‌కి వచ్చి చూశారు. ప్రతీ ఒక్కరికి కెరీర్‌ ప్రారంభం రోజులు ఒక 'హిస్టరీ'.

ఓ పాత్ర కోసం మీరు చేసే హోం వర్క్‌?

శ్రీకాంత్‌:నేను దర్శకుడిని నమ్ముకుని వెళ్లిపోతా. గెటప్స్‌ మీద హోం వర్క్‌ చేస్తాం. 'ఆపరేషన్‌ దుర్యోధన' కోసం అలా చేశాం. నాకు ఎమోషన్స్‌ బాగా ఇష్టం. అఖండలో బాలకృష్ణగారితో విలన్‌గా చేయాలంటే గెటప్‌ కుదరాలి, ఆడియన్స్‌ అంగీకరించాలి.. ఇలా గెటప్స్‌మీద దృష్టి పెట్టాం. అలా అఖండలో ఫైనల్‌ గెటప్‌ చూశాక నేనేనా అని షాకయ్యా!

రాఘవేంద్ర రావు, రోషన్

పెళ్లిసందDలో రోషన్‌కు సలహాలిచ్చారా?

శ్రీకాంత్‌: దాంట్లో నేను జోక్యం చేసుకోలేదు. షూటింగ్‌కు కూడా ఒక్కసారే వెళ్లా. సలహాలేవీ ఇవ్వలేదు. ఎలా చేస్తున్నాడని టీమ్‌ని అడిగేవాడిని. సినిమాలో రోషన్‌ నటించిన తీరు చూసి షాక్‌ అయ్యా! సాంగ్స్‌, డ్యాన్స్‌తో పాటు ఎమోషన్స్‌ని పండించిన తీరు బాగా చేశాడు. నాకన్నా యాక్టివ్‌గా చేశాడు. ఈ జనరేషన్‌లో పదాలు పలకడంలో పట్టు తక్కువ పెళ్లి అనమంటే పెల్లి అంటారు. అలాంటి చిన్నచిన్న విషయాలు చెప్పే వాడిని. కచ్చితంగా ఇద్దరం కలిసి చేస్తాం.

వేరే భాషల్లో అవకాశాలు వచ్చినా తెలుగుకే పరిమితం అయ్యారా?

శ్రీకాంత్‌:అవును. నేనెప్పుడూ తెలుగే. హిందీ వచ్చినా చేయలేదు. నేను పుట్టి పెరిగింది కర్ణాటక. అప్పుడప్పుడు కన్నడలో చేస్తుంటా. మొన్న పునీత్‌ రాసుకున్న 'జేమ్స్‌'లో ఓ పాత్ర కోసం పనిచేశా. ఆయన సడెన్‌గా చనిపోవడం ఒక షాకింగ్‌ న్యూస్‌. ఆయన చనిపోవడానికి 20 రోజులు ముందు కలిసి పనిచేశా. ఆయన మంచి వ్యక్తి. చాలా ఫిట్‌గా ఉంటారు. ఇంత త్వరగా వెళ్లిపోవడం బాధాకరం. జేమ్స్‌లో నాది స్టైలిష్‌ విలన్‌ పాత్ర.

పునీత్​తో

ఒక విజయవంతమైన నటుడిగా అవ్వాలంటే ఏ గుణాలు ఉండాలి

శ్రీకాంత్‌: కష్టపడటం, మంచితనం, నిజాయతీ. ఇక సక్సెస్‌ అనేది మన చేతుల్లో ఉండదు. సినిమా ఫీల్డ్‌లో ఈ మూడు చాలా కీలకం. సక్సెస్‌ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. దాన్ని నిలబెట్టుకొనే విధానం విధి కూడా మనకు తోడైతే అంతా బాగుంటుంది.

ఇలాంటి పాత్రలు రావాలని కోరుకున్నారా?

శ్రీకాంత్‌:మైథలాజికల్‌ పాత్రలు కొన్ని చేయాలనే ఫీలింగ్‌ నాలో ఇప్పటికీ ఉంటుంది.

మిమ్మల్ని నిర్మాతల హీరో అంటుంటారు. చాలా సందర్భాల్లో వాళ్లు వెనుకడుగు వేసినప్పుడు చేసేద్దాం, డబ్బులు గురించి ఆలోచించొద్దని మీరే ఆ పాత్ర కూడా పోషించిన సందర్భాలు ఉన్నాయట.
శ్రీకాంత్‌:అవునండీ. నిర్మాతే లేకపోతే ఎవరు ఇక్కడ ఉండరు. వాళ్లు ఆఖరి క్షణంలో ఇబ్బంది పడితే నేను డబ్బులు తీసుకోని సందర్భాలు, నేను డబ్బుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్లు బాగుంటేనే కదా! ఇండస్ట్రీ బాగుంటుందని నా అభిప్రాయం.

లాంగ్‌డ్రైవ్‌ అంటే ఇష్టమట!

శ్రీకాంత్‌: అవును. ఆరేళ్ల క్రితం లేహ్‌, లద్దాఖ్‌, దిల్లీ, కశ్మీర్‌, కార్గిల్‌ అన్ని కారులో చూసొచ్చా. షిర్డీ కూడా అంతే విమానంలో వెళ్లాంటే బోర్‌. కారులో వెళ్లొచ్చేస్తా. నేచర్‌ని బాగా ఎంజాయ్‌ చేయొచ్చు.

ఇదీ చూడండి:'అఖండ' నాకు ఆ ధైర్యాన్నిచ్చింది: శ్రీకాంత్

ABOUT THE AUTHOR

...view details