తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఖాళీ చేతులతో వచ్చానని, ఇప్పుడు రూ.కోట్లకు మించిన ఆస్తిని సంపాదించానని నటుడు శ్రీవిష్ణు అన్నారు. 'అర్జున ఫల్గుణ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించిన చిత్రమిది. అమృత అయ్యర్ కథానాయిక. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 31న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.
"ఈ సినిమా ఇంత అద్భుతంగా తెరకెక్కడానికి కారణం నిర్మాతలు. వారు నటులకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. దర్శకుడు తేజ చాలా ప్రతిభావంతుడు. అతడిని సెట్‌లో చూసిన తొలిరోజు భయపడ్డా. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. దాదాపు చిత్రీకరణ మొత్తం గోదావరి జిల్లాలోనే సాగింది. 'ఇది మా గోదావరి జిల్లాల గొప్పతనం' అని సినిమా చూసిన గోదావరి జిల్లాల వారంతా కాలర్ ఎగరేసి చెప్పుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా కనిపిస్తా. 'మాస్ కథలు నీకు సెట్ కావురా. లవ్‌స్టోరీలు, కామెడీలాంటి వాటిల్లో నటించు' అని నా మిత్రులు సలహాలు ఇస్తుండేవారు. మాస్ చిత్రాలకు నేను పనికొస్తానో లేదో డిసెంబరు 31న చెప్పండి"