విరాళాల రూపంలో వచ్చే ప్రతి రూపాయిని ప్రజాసేవకే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు ప్రముఖ నటుడు సోనూసూద్(Sonu Sood IT Raid). 20 కోట్ల రూపాయలకుపైగా పన్ను ఎగవేశారంటూ సోనూ ఇల్లు, కార్యాలయాలపై సోదాలు చేపట్టిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
పన్నులకు సంబంధించిన అన్ని పత్రాలనూ అధికారులకు సమర్పించినట్లు సోనూ(Sonusood IT survey) వివరించారు. ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నానన్న ఆయన ఒక విలువైన ప్రాణాన్ని కాపాడేందుకు తన సంస్థలోని ప్రతి రూపాయి ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తెలిపారు. విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా బ్రాండ్ అంబాసిడర్‌గా(sonu sood brand ambassador) వ్యవహరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
"నేను నటించే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా నా ఫౌండేషన్‌కు వస్తుంది. ఈ డబ్బును ఖర్చు చేయడానికి కొంత సమయం పడుతుంది. రాత్రికి రాత్రే ఆ డబ్బు ఖర్చు చేయడం సాధ్యం కాదు. అన్ని ఫౌండేషన్లలోనూ సమయం ఆధారంగా, అవసరాలు పెరుగుతున్న కొద్దీ నిధులు ఖర్చు చేస్తారు. ఒక్క పైసా కూడా నా ఖాతాకు రాలేదు. ఎవరైనా బాధితుడికి ఆపరేషన్ చేయించండి అని మేం ఎవరైనా మెయిల్ పంపితే..వారు నేరుగా బాధితుడి ఖాతాకు డబ్బు పంపుతారు. నా ఖాతాకుగానీ, నా ఫౌండేషన్ ఖాతాలకు గానీ ఆ డబ్బు రాదు. ఆ డబ్బును మేం తీసుకునే అవకాశమే లేదు. వాటికి సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాం. ఇదే ప్రక్రియ కొనసాగుతుంది."