ఉద్దేశపూర్వకంగానే సామాజిక మాధ్యమాల వేదికగా తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రముఖ నటుడు సిద్ధార్థ్(Siddharth Actor) ఇప్పటికే పలుమార్లు తన బాధని వెలిబుచ్చారు. తాజాగా ఆయనకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది.
బాలీవుడ్ నటుడు, ప్రముఖ రియాల్టీ షో 'బిగ్‌బాస్-13' సీజన్ విజేత సిద్ధార్థ్ శుక్లా(Sidharth Shukla news) గుండెపోటుతో గురువారం మరణించారు. సిద్ధార్థ్ శుక్లా(Siddharth Shukla Dead) ఫొటోకు బదులు సిద్ధార్థ్ ఫొటోని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'రిప్ సిద్ధార్థ్' అని జోడించారు. అది కాస్తా సిద్ధార్థ్ వద్దకు చేరింది. ట్విట్టర్ వేదికగా అదే ఫొటోను చూపిస్తూ 'కావాలనే నన్ను ఇలా వేధిస్తున్నారు. ద్వేషిస్తున్నారు' అని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు.
'బాయ్స్', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు సిద్ధార్థ్. అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించిన 'మహా సముద్రం' త్వరలోనే విడుదలకానుంది. ఈ సినిమాలో శర్వానంద్ మరో హీరో.