మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన సిద్ధార్థ్.. ఆ తర్వాత కథానాయకుడుగా మారాడు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఫలితంగా సిద్ధార్థ్‌కు పాన్ ఇండియా నటుడిగానూ గుర్తింపు లభించింది. ఆ తర్వాత నిర్మాతగా, గాయకుడుగా, రచయితగానూ తన సత్తా నిరూపించుకున్నాడు.
సహాయ దర్శకుడిగా..
చెన్నైలో 1979, ఏప్రిల్ 17న జన్మించాడు సిద్ధార్థ్. ప్రాథమిక విద్యని చెన్నైలోనే పూర్తి చేసి.. దిల్లీ, ముంబయిల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. చిన్నప్పట్నుంచి రచనలపైనా, దర్శకత్వంపైనా మక్కువ కనబరిచేవాడట. ప్రముఖ దర్శకుడు జయేంద్ర.. సిద్ధార్థ్ తండ్రికి స్నేహితుడు కావడం వల్ల ఆయన సహాయంతో మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా చేరే అవకాశం వచ్చింది. మణిరత్నం తీసిన 'కన్నథిల్ ముథమిట్టల్' చిత్రానికి తొలిసారి సిద్ధార్థ్ సహాయ దర్శకుడిగా పనిచేశాడు.
'బాయ్స్'తో హీరోగా పరిచయం..
'కన్నథిల్ ముథమిట్టల్' చిత్ర రచయిత సుజాత సలహా మేరకు.. దర్శకుడు శంకర్ తీసిన 'బాయ్స్' చిత్రం కోసం నటుడిగా ఆడిషన్స్‌కు హాజరయ్యాడు. అందులో ప్రధాన పాత్రధారిగా ఎంపికయ్యాడు. ఆ చిత్రం తర్వాత సిద్ధార్థ్ వెనుదిరిగి చూడలేదు. నటుడిగా బిజీ అయిపోయాడు. తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో తొలి అవకాశం అందుకొని.. ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. అప్పట్నుంచి తెలుగులోనే అతడు ఎక్కువ సినిమాలు చేశాడు.