తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాత్రి ఉద్యోగం​.. పగలు సినిమా షూటింగ్​లు: సత్యదేవ్

టాలీవుడ్​ విలక్షణ నటుడు సత్యదేవ్​ నటింటిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆ విశేషాలను ముచ్చటించారు. తన సినీప్రయాణానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

actor satyadev special interview
'రాత్రి జాబ్​.. పగలు షూటింగ్​లకు వెళ్లేవాడ్ని'

By

Published : Aug 9, 2020, 9:06 AM IST

కొవిడ్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇదే సమయంలో ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. అవ్వడమే కాకుండా మంచి ప్రేక్షకాదరణనూ పొందుతున్నాయి. సత్యదేవ్‌ కంచరాన నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' ఆ కోవలోకే వస్తుంది. చిన్న పాత్రలతో మొదలైన సత్య సినీ ప్రయాణం... స్వల్ప వ్యవధిలోనే కథానాయకుడి స్థాయికి చేరింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం ఇతడి ప్రత్యేకత. ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన సినిమా ప్రయాణం గురించి చెబుతున్నాడిలా...

సినిమా ఆలోచన...
ఎప్పుడెలా వచ్చిందో స్పష్టంగా తెలియదు. చిన్నప్పుడు చిరంజీవిగారి పాటలు పెడితే కానీ తినేవాణ్ని కాదట. ఊహ తెలిసినప్పట్నుంచీ సినిమానే కెరీర్‌ అనుకునేవాణ్ని. బ్యాక్‌ బెంచ్‌లో కూర్చునేవాణ్ని. కానీ 80 శాతం మార్కులు వచ్చేవి. అది చాలు కదా, ఇంట్లో స్వేచ్ఛ ఇవ్వడానికి! నేను ఏ రంగంలో ఉన్నా రాణిస్తాననే నమ్మకం అమ్మానాన్నలకు ఉండేది. పుట్టి పెరిగింది వైజాగ్‌లోనే. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాక అక్కడే కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించా. నా లక్ష్యం సినిమా. ఐశ్వర్యారాయ్‌ను ప్రేమించాలంటే ముంబయి వెళ్లాలి, అమలాపురంలో ఉంటే అవ్వదు కదా! అందుకే హైదరాబాద్‌ వచ్చా.

సత్యదేవ్​

రాత్రి ఉద్యోగం పగలు సినిమా!
హైదరాబాద్‌లో ధైర్యంగా అడుగు పెట్టాలంటే ఒకటే మార్గం ఉద్యోగం. అందుకోసమే ఐబీఎమ్‌లో జాబ్‌ సంపాదించా. రాత్రి ఉద్యోగం, పగలు సినిమా ప్రయత్నాలు. మధ్యలో బెంగళూరుకు బదిలీ అయ్యాను. అప్పుడు వీకెండ్స్‌ ఆడిషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చేవాణ్ని. అలా 'బ్లఫ్‌ మాస్టర్‌' వరకూ దాదాపు ఆరేళ్లు ఉద్యోగం చేస్తూనే సినిమాల్లోనూ నటించాను. 2017లో ఇంట్లోవాళ్లకు చెప్పి ఉద్యోగం మానేశా. నిజానికి వాళ్లెప్పుడూ ఉద్యోగం చేయాల్సిందేనని చెప్పలేదు. సినిమా రంగంలో పరిస్థితులు మనం ఊహించినట్టుగా ఉండవు. అందుకే ఉద్యోగం చేస్తూనే సినిమా ప్రయత్నాలు చేశా. నిద్ర మానుకుని నాకు ఇష్టమైన రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించేవాణ్ని. సినిమా కష్టాలను ప్రత్యేకంగా అంటుంటారు కానీ కష్టాలు ఎందులో ఉండవు. చదువులోనూ, ఉద్యోగంలోనూ ఉంటాయి. నేను మాత్రం దేన్నీ కష్టంగా చూడలేదు. సినిమాలకు, రాజకీయాలకు విద్యార్హతలు ఏమీ ఉండవు. లక్షల మంది ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశాలు దొరక్క వెనుదిరిగేవాళ్లూ అదే స్థాయిలోనే ఉంటారు. సినిమాల్లోకి వెళ్తున్నామంటే... 'నువ్వేమైనా చిరంజీవి అవుతావా, వర్కవుట్‌ అవ్వదు' అని ఉచిత సలహాలిస్తారు. చాలామంది ప్రయత్నం చేసి వచ్చేశారని చెబుతారు. వాళ్లు ఐదు కిలోమీటర్లు మట్టి దారిలో ప్రయాణం చేసొచ్చిన అనుభవం గురించే చెబుతారు. కానీ మరో ఐదు కిలోమీటర్లు వెళితే 'హై వే' వస్తుందేమో, ఆ దారీ చూడాలి కదా. చిన్నప్పట్నుంచీ నేను నమ్మింది ఇదే. అప్పుడు అలా ఎందుకు అనిపించేదో ఈ ప్రయాణం తర్వాత ఇంకా బాగా అర్థమైంది. 'ఇందుకే కదా నేను ఎవరి మాటా వినంది' అనుకుంటుంటా.

మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌తో మొదలు...

సినిమా రంగంలో ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేకపోవడం వల్ల ఆఫీసుల చుట్టూ ఫొటోలు పట్టుకుని తిరిగేవాణ్ని. పిలుపొస్తే ఆడిషన్లు ఇచ్చేవాణ్ని. ఆ టైమ్‌లోనే రిషీ ప్రసాద్‌ పరిచయమయ్యాడు. తను డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' ఆడిషన్స్‌ జరుగుతున్నాయని అతడి ద్వారా తెలుసుకుని వెళ్లాను. అందులో ప్రభాస్‌కు స్నేహితుడిగా చేసే ఛాన్స్‌ వచ్చింది. పద్దెనిమిది రోజులు సిడ్నీలో ఉన్నాం. తొలిసారి తెరపై నన్ను నేను చూసుకున్న చిత్రమది. తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో మహేశ్​బాబుకు స్నేహితుడిగా కనిపించా. 'అత్తారింటికి దారేది'లో ఓ ఫైట్‌లో కొన్ని సెకన్లు కనిపిస్తా. 'ముకుంద', 'అసుర' సినిమాల్లో నెగెటివ్‌ పాత్రలు చేశా. నటుడిగా రాణించాలనుకునేవాణ్ని తప్ప హీరో అవ్వాలనుకోలేదు.

నసీరుద్దీన్‌ షా, ప్రకాశ్​రాజ్‌... తమ పాత్రల్ని ఎలా పండించగలుగుతున్నారో అనుకునేవాణ్ని. 'అసుర' సమయంలో నటుడు రవివర్మ నా జీవితాన్ని మలుపుతిప్పే ఓ సూచన ఇచ్చారు. 'నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు' అని అడిగారు. 'నసీరుద్దీన్‌షా, ప్రకాష్‌రాజ్‌లాగా' అని చెప్పినప్పుడు... 'అలా కావాలంటే ఇంకో పదేళ్లు టైమ్‌ పడుతుంది. అప్పుడు పరిణతి వస్తుంది. ఈలోపు భిన్నమైన పాత్రలు చేయాలి. హీరో పాత్రలు ఎందుకు ప్రయత్నించకూడదు?' అన్నారు. 'లీడ్‌ రోల్స్‌ చేస్తే నిన్ను ప్రేక్షకులు చూసే విధానం కూడా మారుతుంద'ని చెప్పారు. ఆయన సలహాతోనే లీడ్‌ యాక్టర్‌ అవ్వాలనుకున్నాను.

జ్యోతిలక్ష్మి టర్నింగ్‌ పాయింట్‌
నా కెరీర్‌ను 'జ్యోతిలక్ష్మి'కి ముందు-తర్వాత అని విభజించుకోవాలి. ఆ సినిమాతో నా ప్రయాణం మరో మలుపు తీసుకుంది. రవివర్మ, నేను మాట్లాడుకున్న తర్వాత పది రోజుల్లోనే దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గారి ఆఫీస్‌ నుంచి ఆడిషన్‌ కాల్‌ వచ్చింది. 500 మందిని పరీక్షించి నన్ను సెలెక్ట్‌ చేశారు. ఏ పాత్రకు అన్నది తెలీదు. అప్పటికి నా బరువు 90 కేజీలు. బరువు తగ్గాలన్నారు. రెండు నెలల్లో 16 కేజీలు తగ్గాను. అప్పుడు ఆఫీసుకు వెళితే 'నా సినిమాలో హీరో నువ్వే' అని చెప్పారు పూరీ సర్‌. ఏదైనా మనం బలంగా అనుకుంటే ఈ విశ్వం కూడా మనకు సహకరిస్తుందంటారు కదా... అదే జరిగింది. పూరీ సర్‌తో కలిసి చేసిన 'జ్యోతిలక్ష్మి' ప్రయాణమే కాదు, ఆయనతో పరిచయమే ఓ అద్భుతం. నేను ఉద్యోగం చేస్తున్నట్టు పూరీ సర్‌కు అస్సలు తెలియదు. 37 రోజులు నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరిగింది. రాత్రంతా ఉద్యోగం, పగలంతా షూటింగ్‌. శని, ఆదివారాలు మినహా రోజుకు రెండు గంటలు మాత్రమే పడుకునేవాణ్ని. ఇప్పుడు తలచుకుంటే అలా ఎలా చేశానా అనిపిస్తోంది. ఆ సినిమా తర్వాత పరిశ్రమ నన్ను చూసే విధానమే మారిపోయింది. ఆ సినిమా చూసి ప్రకాశ్​రాజ్‌గారు 'మన ఊరి రామాయణం'లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా రీ రికార్డింగ్ జరుగుతుండగా ప్రకాశ్​రాజ్‌ ఓ రోజు ఫోన్‌ చేసి నా నటనను ఇళయరాజా మెచ్చుకున్నారని చెప్పారు. 'వామ్మో' అనుకున్నా. పూరీగారు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎలాంటి సందేహం ఉన్నా ఆయన్ని అడుగుతాను. నా సినిమా రిలీజ్‌ అవుతుందంటే 'ఆల్‌ ది బెస్ట్‌' అంటూ మెసేజ్‌లు పెడతారు. రివ్యూలు బాగా వస్తే వాటిని నాకు పంపిస్తారు. ఆయన చేతిమీద ఒక టాటూ ఉంటుంది. 'నాట్‌ పర్మినెంట్‌' అని. ఏదీ శాశ్వతం కాదు అని దానర్థం. అలాంటివి ఆయన్నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. ఆయనోసారి మాటల్లో... 'మా అమ్మగారికి నీ నటనంటే ఇష్టం. సత్యతో సినిమా చెయ్యి అంటుంటారు. నిర్మాత సిద్ధంగా ఉంటే నేనెప్పుడూ రెడీ సత్య' అన్నారు. అలా 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో నాకు అవకాశం ఇచ్చారు.

అప్పుడు అనుకున్నాం కానీ...
జ్యోతిలక్ష్మి తర్వాత... క్షణం, అంతరిక్షం, ఘాజీ, బ్లఫ్‌మాస్టర్‌, బ్రోచేవారెవరురా, రాగల 24 గంటల్లో, సరిలేరు నీకెవ్వరు... ఇలా చాలా సినిమాలు చేశాను. వాటిలో కొన్ని లీడ్‌ రోల్సూ ఉన్నాయి. నేను నటించిన '47 డేస్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' ఓటీటీలో విడుదలయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'ఉమామహేశ్వర...' నాకెంతో గుర్తింపు తెచ్చింది. ఇందులో నాది ఫొటోగ్రాఫర్‌ పాత్ర. నన్ను కొత్త ప్రేక్షకులకు పరిచయం చేసింది. 2016లో మలయాళంలో వచ్చిన 'మహేషింతే ప్రతీకారమ్‌' చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో తనకు ఎదురైన అవమానానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నది కథ. మలయాళంలో విడుదలైనపుడే దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం ఈ సినిమా చూడమంటే చూశా. అద్భుత మనిపించింది. ఆ కథను తెలుగులో తీద్దామని నిర్మాతకోసం తిరిగాం. కానీ ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ప్రయత్నాన్ని విరమించుకున్నాం. ఆ సమయంలో వెంకటేష్‌ మహా నాకో కథ వినిపించాడు. ఆ ప్రాజెక్టూ పట్టాలెక్కలేదు. తర్వాత తను 'కేరాఫ్‌ కంచరపాలెం' తీశాడు. దాంతో మహాకు మంచి పేరొచ్చింది. తర్వాత ఒకరోజు 'మహేషింతే ప్రతీకారమ్‌'ను రీమేక్‌ చేద్దామని మెసేజ్‌ పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. కథను మహా తెలుగు వాతావరణంలోకి మార్చి అరకు నేపథ్యంలో తీసిన తీరు అద్భుతం.

పాత్రల్ని ఎంపిక చేసుకునేటప్పుడు- స్క్రిప్టు విన్నాక ఆ పాత్రలో ఇమడగలనో లేదో చూస్తాను. ఫిట్‌ అవుతాననిపిస్తే ఓకే చెబుతాను. ఇదివరకెప్పుడూ అలాంటి పాత్ర చేయకపోతే నాలోని నటుడిని సంతృప్తి పర్చడానికి చేస్తాను. కొత్తగా ఉంటే తక్కువ నిడివి పాత్ర చేయడానికీ రెడీ. ఏ పాత్రనైనా అంగీకరించాక అందుకు అవసరమైన స్కెలెటిన్‌ను మానసికంగా సిద్ధం చేస్తాను. దానికి దర్శకుడు జీవం పోస్తారు. వ్యతిరేక ఛాయలున్న పాత్రలూ, ముఖ్యమైన క్యారెక్టర్లూ, లీడ్‌ పాత్రలూ... ఇలా భిన్న రకాలుగా ప్రయాణం చేస్తున్నాను.

బీచ్‌ గాలి పట్టాల్సిందే!
నా వ్యక్తిగత జీవితంపై వైజాగ్‌ ప్రభావం బలంగా ఉంటుంది. ఆ సముద్రం, బీచ్‌... అక్కడ కాసేపు ఒంటరిగా సేదతీరేటపుడు ఓ నిశ్శబ్దమైన గాలి మనసును తాకుతుంది. అందుకే వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్తా. అక్కడ పుట్టి పెరిగినోళ్లలో కొంచెం వెటకారం ఉంటుంది. తెలిసినవాళ్లతో మాట్లాడేటపుడు నాలోనూ అది కనిపిస్తుంటుంది. మా ఉమామహేశ్వరుడిలాగా అప్పుడప్పుడూ ఉగ్రరూపం బయటికొస్తుంటుంది. కామన్‌ సెన్స్‌ లేకుండా ప్రవర్తించేవాళ్లను చూస్తే కోపం వస్తుంది. ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తుంటారు కొంతమంది. కారు పార్కింగ్‌ చేసే చోట, నీళ్లు వాడేచోట... ఇలా ప్రతిచోటా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లకు గట్టిగా చెప్పాలనిపిస్తుంటుంది.
ఐబీఎమ్‌లో ఉద్యోగం మానేసేనాటికి నా నెల జీతం రూ.1.75 లక్షలు. అమెరికా పంపించడానికి వీసా కూడా సిద్ధం చేశారు. వర్చువల్‌ డిజైన్‌ ఆర్కిటెక్ట్‌ విభాగంలో టీమ్‌లీడర్‌గా ఉన్నాను. ఆ ఉద్యోగంలోనే కొనసాగుంటే అమెరికాలో స్థిరపడేవాణ్నేమో. కానీ నా జీవితాశయం అది కాదు. ఆర్థికంగా ఏ ఇబ్బందీ రాకూడదనే ఉద్యోగం చేశా తప్ప నా మనసంతా సినిమాపైనే. ఏ పనిచేసినా వంద శాతం న్యాయం చేయాలి అనుకుంటా. ఉద్యోగం విషయంలో అదే చేశాను. నచ్చింది చేసినపుడు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలన్నది నా పాలసీ. సినిమా విషయంలో ఇదే చేస్తున్నా!

ఇంకొంత...

  • నాన్న కేవీఎన్‌ ప్రసాదరావు. ఈనాడు పత్రిక అడ్వర్టైజింగ్‌ విభాగంలో మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తున్నారు. అమ్మ లక్ష్మి గృహిణి. నా భార్య దీపిక. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. తను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసేది. ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో ఉంది.
  • పాటలు పాడటం ఇష్టం. ఓ మాదిరిగా పాడగలను.
  • ఎంత పెద్ద హోటల్‌లో తిన్నా కూడా, కృష్ణానగర్‌లోని నారాయణ టిఫిన్‌ సెంటర్‌లో తినడం ఇష్టం.
  • ఖాళీ దొరికినపుడు సినిమా కథలు రాసి పెట్టుకుంటా.
  • చాలామంది నా వాయిస్‌ను మెచ్చుకుంటారు. ప్రభాస్‌మీద అభిమానంతో 'సాహో'లో నీల్‌ నితిన్‌ ముకేష్‌కు డబ్బింగ్‌ చెప్పా. పూరీగారు నా కళ్లలోని నిజాయతీని చూసి 'జ్యోతిలక్ష్మి' సినిమాకు ఎంపికచేశారట.
  • 'గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి', 'లాక్డ్‌' వెబ్‌సిరీస్‌లలోనూ నటించాను. ప్రస్తుతం నాలుగు సినిమాలకు సంతకం చేశా!

ABOUT THE AUTHOR

...view details