ఓ వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని... సినిమా పరిశ్రమలో ఆయనలా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడుతున్నాడు ఓ కుర్రాడు. దాని కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. అయితే ఓరోజు తన ఆదర్శాన్ని నేరుగా కలిసే అదృష్టం వచ్చింది. అలా వెళ్లి కలిసి వచ్చిన ఆ కుర్రాడి మనసులో భావాలకు అక్షర రూపమిచ్చాడు. ఆ కుర్రాడే యువ నటుడు సత్యదేవ్.. కలిసింది ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని. మరి సత్యదేవ్ ఏం రాశారో మీరే చదవండి.
"నా చిన్నప్పుడు మా క్లాస్ రూం గోడ మీద ఒక పెద్ద స్కేల్ బొమ్మ ఉండేది. ఆరడుగుల దాకా గీసి, ఆపేసారు. రెండు, మూడు నెలలకొకసారి ఎంత పొడవు పెరిగామో కొలవటానికి ఒక్కొక్కరినీ గోడకు అనుకుని నిలబడమనేవారు. ఒక రోజు మా టీచర్‌ని "మాలో ఎవరైనా ఆ సీలింగ్ కన్నా పొడవు పెరిగితే ఎలా టీచర్?" అని అడిగాను. అప్పుడు మా టీచర్ అడిగిన ప్రశ్న... "నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా?"
ఆ తరువాత చాలాసార్లు, చాలాచోట్ల అవే మాటలు విన్నాను. 'కష్టతరం', 'అసాధ్యం' అనిపించే పనులు చేయటానికి ఎవరు పూనుకున్నా చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు అనే మాటలు ఇవి.
నేను సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు నాకు మళ్లీ అదే ప్రశ్న ఎదురుపడింది. "నేను చిరంజీవిని" అనుకోలేదు. కొన్ని కోట్ల మందిలా చిరంజీవి అవ్వాలనుకున్నాను. నేను ఏం సాధించాను, ఎంత సాధించాలి అని కొలవటానికి నా 'లైఫ్' గోడ మీద నేను గీసుకున్న స్కేల్... చిరంజీవి.