'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'వావ్ 3' గేమ్ షో వ్యాఖ్యాత సాయికుమార్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనకు ఇప్పటికీ డ్రైవింగ్(బైకు కూడా) పూర్తిగా రాదని చెప్పారు. చిన్నప్పుడు వచ్చీ రానీ డ్రైవింగ్‌తో ఓసారి బస్సు కింద పడబోయి, ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రసారమైన ఈ ఎపిసోడ్లో మాధవీలత, ఎస్తర్, అపూర్వ, నందిని రాయ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా నందినితో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు సాయికుమార్.
"చిన్నప్పుడు మా నాన్న స్కూటర్ కొన్నారు. అప్పటికే నాకు సైకిలే వచ్చు. దీంతో స్కూటర్‌ను నడుపుకుంటూ రోడ్డు మీదకు తీసుకెళ్లాను. ఎదురుగా ఓ బస్సు వచ్చింది. చాలా భయపడ్డాను. అంతలోనే నా వాహనం బస్సు కిందకు, నేను పక్కకు పడిపోయాను. అప్పటి నుంచి డ్రైవింగ్ అంటే చాలా భయం. ట్రాఫిక్ లేకుండా రోడ్డంతా ఖాళీగా ఉంటేనే అవసరాన్ని బట్టి నడుపుతాను. మా ఆవిడను తీసుకుని ఒక్క సారి కూడా డ్రైవింగ్ చేస్తూ బయటకు తీసుకెళ్లలేదు. అప్పట్లో నాకు కారు ఉండేది కాదు. సినిమాకు వెళ్లాలంటే ఓ ఆటోను మాట్లాడుకుని వెళ్లేవాళ్లం" -సాయికుమార్, ప్రముఖ నటుడు