ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ షష్టి పూర్తి వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు అగ్రనటులు చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్- జీవిత జంట సహా పలువురు హాజరయ్యారు.
ఈ నెల 27న 60ఏళ్ల పడిలోకి అడుగుపెడుతున్న సాయికుమార్‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. సాయికుమార్ తనయుడు ఆదితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఈ వేడుకలను అన్ని దగ్గరుండి చూసుకున్నారు.
తెలుగు సినీ అభిమానుల గుండెల్లో సాయికుమార్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. నటనతో పాటు తన డబ్బింగ్‌తో తెలుగు, కన్నడ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు సాయికుమార్.
అటు ఈటీవీ 'వావ్'తో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు సాయికుమార్. జులై 27న పుట్టిన రోజు సందర్బంగా 'వావ్' ఎపిసోడ్లో సాయికుమార్ కుటుంబసభ్యులు అలరించారు.
ఆ పాటంటే కోపం..
'అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వుండగా..' అనే పాటంటే చాలా కోపమని సాయికుమార్ సతీమణి సురేఖ నవ్వుతూ చెప్పారు. 'ఈ పాట వచ్చినప్పుడల్లా సాయికుమార్ డాన్స్ చేయమంటారు, అందుకే ఈ పాట నచ్చదు' అని జవాబిచ్చారు. దీంతో పాటు తన ఇద్దరు సోదరులతో కలిసి 'దేవుడంటే ఒక్కడేరా' అనే డైలాగ్ అద్భుతంగా చెప్పారు సాయికుమార్.
ఇదీ చదవండి:డ్రైవింగ్ రాదు.. కొద్దిలో ప్రమాదం తప్పింది: సాయికుమార్