కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి.. స్టార్‌హీరోగా దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్ మరణంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రియులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పునీత్ జ్ఞాపకాలను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దీంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విశేషాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో పునీత్ చేసిన ఆఖరి ట్వీట్.. ఆయన సోషల్‌మీడియా ఖాతాల గురించి తెలుసుకుందాం.!
ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం..!
పునీత్‌కు కుటుంబమంటే అమితమైన ఇష్టం. షూటింగ్స్ నుంచి ఏ కాస్త విరామం దొరికినా సరే, కుటుంబసభ్యులతోనే ఎక్కువగా సమయాన్ని గడిపేవారు. వారితో సరదాగా గడిపిన క్షణాలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకునేవారు. తండ్రి రాజ్‌కుమార్, అన్నయ్య శివన్న అంటే పునీత్‌కు అమితమైన ప్రేమ, గౌరవం. తండ్రితో దిగిన పలు మధుర జ్ఞాపకాలను కూడా అప్పుడప్పుడూ నెట్టింట్లో షేర్ చేసుకునేవారు. సెప్టెంబర్ 24న ఆయన షేర్ చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. "అప్పాజీ (నాన్న)తో కలిసి నయాగరా జలపాతం వద్ద గడిపిన ఆ క్షణాలు ఇప్పటికీ మధుర జ్ఞాపకాలే" అని ఆయన రాసుకొచ్చారు. కాగా, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ అమ్మే తనకు స్ఫూర్తి అని పునీత్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.
సేవ చేయడంలో ముందు..!
తండ్రి రాజ్‌కుమార్ పేరుతో ఆయన ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారు. చదువుకోవాలని ఆశించే పేద విద్యార్థులకు, అనాథలకు, వృద్ధులకు అండగా నిలిచారు. 1800 మంది విద్యార్థుల చదువుకు సాయం చేశారు. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో గోశాలలను ఏర్పాటు చేయించారు. పాఠశాల విద్యార్థుల కోసం ఇటీవల రాజ్‌కుమార్ లెర్నింగ్ యాప్‌ని అందుబాటులోకి తీసుకువచ్చారు.