తెలుగు చలన చిత్రరంగంలో పొట్టి వీరయ్యగా పేరు పొందిన వీరయ్య గట్టు ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆయన నివాముంటున్నారు. గతంలో కొంత అనారోగ్యంతో వున్న ఆయన ఆ తర్వాత కోలుకున్నారు. ఆదివారం ఉదయమే పుచ్చకాయ తిన్న వెంటనే గుండె నొప్పి రావడం వల్ల దగ్గరలోని షన్‌షైన్ ఆసుప్రతికి తరలించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 4.33 గంటలకు మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సాయంత్రం 5.30 గంటలకు ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. ఏప్రిల్ 26న ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో జరగనున్నాయి. ఆయన మృతి పట్లు పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పించారు.
పొట్టి వీరయ్యకు 74 సంవత్సరాలు. 2అడుగులు మాత్రమే వుండే ఆయన ఆహార్యం ఆయనకు ప్రత్యేకత. ఇదే ఆయన్ను సినిమాలలో వేషాలు రావడానికి కారణమైంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలనుంచి కలర్ సినిమాల జనరేషన్‌లో నటించి మెప్పించిన నటుడాయన. చాలాకాలంపాటు తన ఆహార్యానికి తగిన పాత్రలు వేస్తూ చెన్నై, హైదరాబాద్‌లో గడిపారు. హైదరాబాద్‌కు సినిమా రంగం తరలివచ్చాక పలు వేషాలు వేశారు. కానీ ఆయన కుటుంబ పోషనకు అది సరిపోయేదికాదు. అప్పడప్పుడు వేషాలు వస్తుండేవి. కనుక ఆయన వికలాంగుల కోటా కింద హైదరాబాద్ కృష్ణానగర్‌లో బడ్డీకొట్టు పెట్టుకుని జీవనం సాగించేవారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ప్రస్తుతం ఆయన తన కుమార్తె వనజ దగ్గర వుంటున్నారు.