సంపూర్ణ నటనకు అసలైన నిర్వచనం మోహన్‌లాల్. అందుకే సినీలోకమంతా ఆయనను ‘ది కంప్లీట్ మ్యాన్’ అని పిలుచుకుంటుంది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపంలోకి మారిపోయినట్లు.. సినిమాల్లో ఏ పాత్రనిచ్చినా అందులోకి ఒదిగిపోతారు. పాత్రలో జీవించి.. ప్రేక్షకులను తనలో లీనం చేసుకుంటారు. తన నటన చూసి చప్పట్లు కొట్టినవారు, కన్నీళ్లు పెట్టుకున్నవారే కాదు. ఆయన నటిస్తుంటే కట్ చెప్పడం మర్చిపోయి పారవశ్యం చెందిన దర్శకులూ ఉన్నారు. అంతలా ముగ్ధుల్ని చేస్తుంది ఆయన నటన. ఇవాళ ఆ సంపూర్ణ నటశిఖరం పుట్టినరోజు.. ఈ సందర్భంగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
మోహన్‌లాల్ అసలు పేరు మోహన్‌లాల్ విశ్వనాథ్ నాయర్. రెండు సార్లు కుస్తీ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన లాలెట్టన్. ఆరో తరగతిలోనే నటనలోకి అడుగుపెట్టారు. ఓ నాటకంలో 90 ఏళ్ల వృద్ధుడిగా నటించి అందరితోనూ ప్రశంసలు పొందారు. స్నేహితులు తీసిన 'తిరనోట్టమ్' సినిమాలో మొదటిసారి నటించారు. అయితే అది విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత స్నేహితుల బలవంతం మీద ఆడిషన్‌కి వెళ్లి 'మంజిల్ విరింజ పూక్కల్'లో విలన్ పాత్రకు ఎంపికయ్యారు. అది సూపర్ హిట్టయి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి బలమైన పునాది వేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా మలయాళ సినిమాను శాసించే స్థాయికి ఎదిగారు. 'చిత్రం', 'కిరీడం', 'చంద్రలేఖ', 'నరసింహం', 'దృశ్యం', 'పులిమురుగున్', 'లూసిఫర్' లాంటి ఎన్నో మరపురాని చిత్రాలను అందించి మలయాళ సినిమాను మరో మెట్టెక్కించారు.
వందకోట్ల క్లబ్ వీరుడు
'పులిమురుగన్'తో వందకోట్ల వసూళ్ల మార్క్‌ను అందుకొని ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా నిలిపారు. ఆ తర్వాత వచ్చిన 'లూసిఫర్' రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిపెట్టింది. ఈ వసూళ్లతో వందకోట్ల హీరో అయిపోయారు మోహన్‌లాల్. యంగ్ హీరోలకూ సాధ్యం కానీ ఈ ఘనత సాధిస్తూ.. తనకింకా వయసైపోలేదని నిరూపిస్తున్నారు.
మల్టీ స్టారర్లలోనూ ముందే..
ప్రతి చిత్ర పరిశ్రమలో ఉండే అగ్ర కథానాయకులు మల్టీస్టారర్ సినిమాలు తీసేందుకు వెనకాడతారు. కానీ విజయ్, విశాల్, ఎన్టీఆర్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి ఈతరం హీరోల సినిమాల్లో నటించేందుకు సంకోచించలేదు ఈ సూపర్‌స్టార్. జిల్లా, విలన్(2017), జనతా గ్యారేజ్ చిత్రాల్లో యువ హీరోలతో పోటీపడీ మరీ నటించారు.