కొత్త ఏడాది తొలి నెలలోనే జోరు చూపిస్తోంది హీరోయిన్ మెహరీన్. సంక్రాంతికి 'ఎంత మంచివాడవురా' అంటూ కల్యాణ్‌రామ్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు 'అశ్వథ్థామ' కోసం నాగశౌర్యతో జట్టు కట్టింది. రమణ తేజ దర్శకత్వంలో, ఉషా మల్పూరి నిర్మించిన ఈ చిత్రం.. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించిందీ భామ. సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకుంది.
'అశ్వథ్థామ'లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
హీరోకు ప్రియురాలిని. తన లక్ష్యాన్ని సాధించేందుకు సహాయం చేసే పాత్ర. పరుగులా సాగే కథలో నటించడం భిన్నమైన అనుభవం.
ఈ కథను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా?
ఓ కథ ఎంచుకొనేటప్పుడు మన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందనేది చూస్తాం. కానీ కొన్ని కథలు పాత్రల గురించి ఆలోచించే సమయం కూడా ఇవ్వవు. ఇదీ అలాంటి సినిమానే. మంచి భావోద్వేగాలతో థ్రిల్‌కు గురిచేస్తుంది. నాకే కాదు, నాగశౌర్యకూ ఇలాంటి కథలో నటించడం కొత్తే. తనే ఈ కథ రాశాడు. రమణ తేజ చాలా బాగా తీశారు.
మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ కథ విన్నప్పుడు మీకొచ్చిన ఆలోచనలు?
నాగశౌర్య స్నేహితుడి కుటుంబంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. మహిళల్లో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకూ ఎవరికీ రక్షణ లేదు. ఈ కథ విన్నప్పుడు మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నామో మరోసారి గుర్తుకొచ్చింది. మహిళలపై అకృత్యాలు జరిగాయనగానే అందరిలాగా మనమూ సామాజిక మాధ్యమాల్లో స్పందించి, ఆ తర్వాత మరిచిపోతే సరిపోదు. చెడుపై పోరాటం చేసే ఒక అశ్వథ్థామ మనందరిలోనూ ఉంటాడు. అతణ్ని బయటికి తీసుకురావాలి.
ఇలాంటి చిత్రాలతో మార్పు సాధ్యమవుతుందంటారా?
మార్పు అనేది మనలోనే ఉంటుంది. సినిమా బలమైన మాధ్యమం కాబట్టి అందులో ఒక సమస్యని స్పృశిస్తే, దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇలాంటి కథలు తెరకెక్కుతున్నాయంటేనే మార్పు మొదలైనట్టే.
'ఎంత మంచివాడవురా', 'అశ్వథ్థామ'... ఇదే నెలలో రెండు సినిమాలు. వెంట వెంటనే ఫలితాల గురించి ఎదురు చూడటంపై మీ అభిప్రాయం?
తమిళంలో నేను నటించిన 'పటాస్' కూడా ఈ సంక్రాంతికే విడుదలైంది. అది విజయం సాధించింది. 'ఎంత మంచివాడవురా' నాకు సంతృప్తినిచ్చింది. మంచి పాత్ర చేశాననే పేరొచ్చింది. ఇక ఫలితాలంటారా? అవి మన చేతుల్లో ఉండవు కదా. నా వరకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేయాలనుకుంటా. ఒక నటిగా ఆ విషయంలో నా ప్రయాణం సంతృప్తికరంగా సాగుతోంది.
ఇదీ చదవండి: పవర్‌స్టార్ కొత్త సినిమాకు కీరవాణి సంగీతం..!