'ఆర్ఎక్స్ 100'తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యువకథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సంపాదించుకోవడం సహా తన నటనతో విమర్శకుల ప్రశంసలనూ అందుకున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు 'ప్రేమతో మీ కార్తిక్' అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా.. 'ఆర్ఎక్స్ 100' సినిమా హీరోగా కార్తికేయకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నేడు (సెప్టెంబరు 21) కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వ్యక్తిగతం
కార్తికేయ తండ్రి గుమ్మకొండ విఠల్ రెడ్డి నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత. అతని తల్లి గుమ్మకొండ రజనీ ఓ విద్యావేత్త. హైదరాబాద్‌లోని వనస్థలిపురం నాగార్జున పాఠశాలలో కార్తికేయ ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్‌ను విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. నటుడు కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు.
సినీ పరిశ్రమలో అరంగేట్రం
లఘు చిత్రాలతో ప్రయాణాన్ని మొదలుపెట్టి తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌లో నిర్మించిన 'ప్రేమతో మీ కార్తీక్' చిత్రంలో నటించాడు కార్తికేయ. ఆ తర్వాత అదే బ్యానర్‌పై అజయ్ భూపతి దర్శకత్వంలో నటించిన 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ చిత్రంతోనే కార్తికేయలోని నటనా ప్రతిభ అందరికీ తెలిసింది. ఆ తర్వాత హీరోగా 'హిప్పీ', 'గుణ 369', '90 ఎమ్ఎల్' చిత్రాలతో మెప్పించాడు. నటుడిగా తన ప్రతిభకు గుర్తింపు రావాలని నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు కార్తికేయ. విలన్‌గా తెరపై కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
కొత్త ప్రాజెక్టులు
ప్రస్తుతం గీతా ఆర్ట్స్2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు కార్తికేయ. ఇందులో లావణ్య త్రిపాఠి నాయిక. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు కౌశిక్ పెగళ్లపాటి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా రూపొందుతున్న 'వాలిమై' చిత్రంలోనూ కీలకపాత్ర కోసం ఎంపికయ్యాడు కార్తికేయ. ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
'చావు కబురు చల్లగా' ఫస్ట్‌లుక్