తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇకపై జీవితాలు మరోలా ఉంటాయి: గోపీచంద్​ - గోపీచంద్​ ఇంటర్వ్యూ

గోపీచంద్‌ యాక్షన్‌ హీరో. ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ మేన్‌ అయిపోయారు. తెరపైన ఆయన పోరాటాలు చేస్తుంటే అందరూ ఉత్సుకతతో చూసేవాళ్లు. ఇప్పుడు మాత్రం ఆయనే తన తనయులిద్దరూ కలిసి చేస్తున్న అల్లరినీ, సాహసాల్ని చూస్తూ ఆస్వాదిస్తున్నారు. కరోనా ప్రభావంతో దొరికిన ఈ విరామంలో ఆయన ఏం చేస్తున్నారో 'ఈనాడు సినిమా' ఆరా తీసింది. ఈ సందర్భంగా గోపీచంద్‌ చెప్పిన ముచ్చట్లివీ...

ACTOR GOPICHAND SPECIAL INTERVIEW IN LOCKDOWN PERIOD
ఇకపై జీవితాలు మరోలా ఉంటాయి: గోపీచంద్​

By

Published : Apr 19, 2020, 6:33 AM IST

షూటింగ్‌కి వెళ్లడం లేదే అని మీ పిల్లలు అడుగుతున్నారా?

మా పెద్దబ్బాయి విరాట్‌ అడిగాడు. కరోనా వైరస్‌ వచ్చిందనీ, బయటికి వెళ్లకూడదని, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పా. తనక్కూడా అర్థమైంది. ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకూడదు కదా అంటూ, శానిటైజర్‌తో చేతులు కడుగుతున్నాడు (నవ్వుతూ). ఆరేళ్లొచ్చాయి కాబట్టి ఏం చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటాడు.

పిల్లలతో గడిపేందుకు ఇదొక మంచి అవకాశం కదా?

మా పెద్దబ్బాయితో హోమ్‌ వర్క్‌ చేయిస్తున్నా, డ్రాయింగ్‌ వేయిస్తున్నా. తీరిక లేని జీవితంతో పిల్లలతో గడపలేకపోయిన వాళ్లకి ఈ విరామం గొప్ప అవకాశం. ఇది వరకు నేను పిల్లల్ని చూసుకోవడంలో కష్టం ఏముందిలే అనుకునేవాణ్ని. అసలు సంగతి ఇప్పుడు అర్థమవుతోంది. మా చిన్నబ్బాయి వియాన్‌ ఇప్పుడు పరిగెడుతున్నాడు. ఇద్దరూ ఏదో ఒక వస్తువు కోసం పోటీపడుతుంటారు. వాళ్లని కంట్రోల్‌ చేయడం చాలా పెద్ద పనే.

కరోనా పరిణామాలపై మీకెలాంటి ఆలోచనలు వస్తున్నాయి?

లోకమంతా ఇలా ఒకే విషయంపై ఆగిపోయే రోజులొస్తాయని అనుకోలేదు. ప్రపంచానికి ఇదొక సంకేతంలా అనిపిస్తోంది. కొంచెం ఆగండి, మీరేం చేస్తున్నారో ఆలోచించండి అని చెప్పినట్టు ఉంది. కొన్నాళ్లల్లోనే ప్రకృతిలో చాలా మార్పులు చూశా. యాభై శాతం కాలుష్యం తగ్గిపోయింది. పక్షులు, జంతువుల స్థానాన్ని మనం ఇంతగా ఆక్రమించేశామా అనిపించింది. మా ఇంటి పక్కన పార్క్‌లో పక్షులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటి స్వేచ్ఛ వాటికి వచ్చినట్టు అనిపిస్తోంది. కరోనా వల్ల మనలో మార్పు వస్తుంది. ఇకపై మన జీవితాలు మరోలా ఉండబోతున్నాయి. ఇప్పుడు డబ్బున్నోడు, లేనోడు ఒక్కటే. ఒకరికొకరు సాయం చేసుకోవాలి, పక్కవాడు బాగుంటే మనం బాగుంటామనే ధోరణిలో మనం ఆలోచిస్తున్నాం.

లాక్‌డౌన్‌ వల్ల బాగా మిస్‌ అవుతున్న విషయమేదైనా ఉందా?

నాకైతే మళ్లీ ఎప్పుడు షూటింగ్‌కి వెళతానా అనిపిస్తోంది. పరిస్థితి చూస్తే అది అంత త్వరగా జరగదనిపిస్తోంది. జులై తర్వాతే చిత్రీకరణలు ఉంటాయేమో. షూటింగ్‌ అంటే వందల మంది ఉండాలి. అందుకు ప్రభుత్వాలు అనుమతులిస్తాయా? ఇస్తే ఎలాంటి షరతులుంటాయి? ఇలా చాలా ప్రశ్నలున్నాయి.

ఓటీటీ వేదికల్లో సినిమాల విడుదల గురించి చర్చ మొదలైంది. దీని గురించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి?

ఎవరేం మాట్లాడుకున్నా ఒకటే. మనకు వేరే దారుల్లేవనే విషయం అందరికీ అర్థమైపోతోంది. ఓటీటీ వేదికలనేవి పెద్ద మార్కెట్‌. ఈ కొన్నాళ్లుగా ప్రేక్షకులు వాటికి బాగా అలవాటు పడ్డారు. వెబ్‌సిరీస్‌లు, ఇతర భాషల చిత్రాలూ చూస్తున్నారు. వాటిలో నాణ్యత, ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి వెబ్‌ కంటెంట్‌ని ఆస్వాదిస్తున్నారు. భవిష్యత్తు దానిదే అనిపిస్తోంది. అయితే ఎప్పుడైనా థియేటర్‌ అనుభూతి వేరు. ఇక నిర్మాణ వ్యయం అంటారా? అది అదుపులో ఉండాలంటే అన్ని విభాగాలు పకడ్బందీగా ఉండాలి. సెట్‌లో ప్రతి ఒక్కరి దగ్గర బౌండెడ్‌ స్క్రిప్టు ఉండాలి. ప్రతి షాట్‌ ఎంత నిడివి ఉండాలో పక్కాగా అంతే తీసేలా ప్రణాళికలు ఉండాలి. పెద్ద సినిమాకు రోజుకి రూ.10 లక్షలు ఖర్చవుతుంది. ఒక ఫైట్‌ తీస్తున్నారంటే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు వ్యయం అవుతుంది. సెట్లో సమయం, డబ్బు వృథా కాకుండా ప్రీ విజువలైజేషన్‌తో ముందే సిద్ధమైతే చాలా వరకు వ్యయం తగ్గుతుంది. హాలీవుడ్‌లో ఎంత పెద్ద సినిమా అయినా మూడు నెలలే చిత్రీకరిస్తారు. అక్షయ్‌ కుమార్‌ సినిమా పూర్తవడానికి 60 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు. అలా చేస్తే నిర్మాత దగ్గర్నుంచి, హీరోలకీ, దర్శకులకీ, కొనుక్కునే బయర్లకీ అందరికీ బాగుంటుంది.

ఇంటి పనులు మీరూ పంచుకుంటున్నారా?

మన పనులు మనం చేసుకోవడమే కదా? పిల్లలకి బ్రష్‌ చేయించడం దగ్గర నుంచి నా పనులు మొదలవుతాయి. ఇంట్లోవాళ్లు పిండి తయారు చేస్తే నేను దోసెలు వెయ్యడం, వాళ్లు వంట మొదలుపెడితే నేను కూరగాయలు కోయడం ఇలాంటివి చేస్తుంటా. అప్పుడప్పుడు నేను కూడా ఏదైనా పని చేయడానికి ప్రయత్నిస్తుంటా (నవ్వుతూ). నాకైతే పనులు అలవాటే. చదువుకునేటప్పుడు నా పనులు నేనే చేసుకునేవాణ్ని. అయితే పిల్లలకి కూడా అది అలవాటు చేయడం చాలా అవసరం.

కరోనా తర్వాత సినీ పరిశ్రమలో పరిస్థితులు ఇదివరకటిలా ఉండవేమో కదా?

కచ్చితంగా కొన్ని మార్పులైతే వస్తాయి. కరోనాకి మందు వచ్చాక గానీ అందరికీ పూర్తిగా ధైర్యం రాదు. అప్పటిదాకా భయంగా బతకాల్సిందే. సినిమా అంటే ఎక్కువమంది కలిసి పనిచేయాల్సి ఉంటుంది, చూసేది కూడా సమూహంగానే. మనం కష్టపడి చిత్రీకరణ పూర్తి చేసినా థియేటర్‌కి ప్రేక్షకులు రావాలి కదా, వాళ్లు రావాలంటే ముందు భయం పోవాలి. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. అసలు ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఏడాది వరకు విదేశీ చిత్రీకరణలు ఉండవేమో అనిపిస్తోంది.

సెలవుల్లో ఇంట్లో గడపడం కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి సెలవుల్ని మాత్రం ఎప్పుడూ చూసుండరు కదా?

అడుగు బయట పెట్టలేని సెలవులివి. తొలి నాలుగు రోజులు కష్టంగానే అనిపించింది. కొన్నాళ్లపాటు మన జీవితం ఇలాగే ఉంటుందనే విషయం అర్థమయ్యాక మెల్ల మెల్లగా అంతా అలవాటైపోయింది. కుటుంబం, పిల్లలతో గడపడం, సినిమాలు, పుస్తకాలు ఇలా మరో రకమైన జీవన శైలి అలవాటైంది.

''స్నేహితులతో కలిసి గడపడమంటే నాకు చాలా ఇష్టం. అదిప్పుడు బాగా మిస్‌ అవుతున్నా. ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నాం. ప్రభాస్‌, నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. కరోనా ప్రభావం మొదలైన సమయంలోనే తను జార్జియా వెళ్లాడు. నేను ‘అక్కడ ఇలా ఉందంట, ఇక్కడిలా ఉందంట.. జాగ్రత్త' అంటూ మెసేజెస్‌ పంపుతుండేవాణ్ని. 'ఏం పర్లేదురా, ఇప్పటివరకూ బాగానే ఉంది, మేం కూడా వచ్చేస్తున్నాం' అని బయల్దేరాడు. తను తిరిగొచ్చాక 14 రోజులు క్వారంటైన్‌లోనే ఉన్నాడు''.

''ప్రస్తుతం నేను చేస్తున్న 'సీటీమార్‌' సినిమా 50 శాతం పూర్తయింది. ద్వితీయార్ధం మొదలైన సమయంలోనే కరోనాతో బ్రేక్‌ పడింది. అది కుటుంబ అనుబంధాలతో కూడిన క్రీడా నేపథ్య చిత్రం. కబడ్డీ కోచ్‌గా కనిపిస్తా. ప్రొ కబడ్డీ చూసి నా పాత్ర కోసం సిద్ధమయ్యా. ఆట గురించి అన్ని విషయాలూ తెలుసుకున్నా''.

''తేజతో నేను ఎప్పుడో సినిమా చేయాలి. ఆయన ఈమధ్యే 'అలిమేలుమంగ వేంకటరమణ' కథ చెప్పారు. అది చాలా నచ్చింది. ఆమధ్య రజనీకాంత్‌ సినిమాలో నటిస్తున్నావట కదా అని కొంతమంది తమిళ స్నేహితులు ఫోన్‌ చేసి అడిగారు. నిజం కాదని చెప్పా. రజనీతో సినిమా చేస్తున్న దర్శకుడు శివ, నేను కలిసి రెండు సినిమాలు చేశాం. శివ, నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. మీరెప్పుడు చెబితే అప్పుడు సినిమా చేస్తాను సర్‌ అంటుంటాడు. 'నువ్వు తమిళంలో బాగా చేస్తున్నావు కదా, పెద్ద హీరోలతో చేయడం నీకు మంచిది. మనం తర్వాత చూసుకుందాం' అని చెబుతుంటా''.

ఇదీ చదవండి:మెగాస్టార్ 'ఆచార్య'లో కలెక్షన్ కింగ్ మోహన్​బాబు!

ABOUT THE AUTHOR

...view details