తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో అయ్యుంటే ఇన్నేళ్లు కష్టమే: చంద్రమోహన్ - actor chandramohan career facts

"హీరోగా మాత్రమే చేయాలని అనుకుంటే ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉండేవాడిని కాదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ కాక తప్పదు" అని అన్నారు నటుడు చంద్రమోహన్​. దాదాపు 50 ఏళ్ల సినీ ప్రయాణంలో నిర్విరామంగా పని చేసిన ఆయన ఆదివారం ఆయన 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే...

chandra mohan
చంద్రమోహన్​

By

Published : May 23, 2021, 6:38 AM IST

Updated : May 23, 2021, 11:44 AM IST

కథానాయకుడిగా తెరపైకి అడుగుపెట్టి.. ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించారు చంద్రమోహన్‌. 55ఏళ్ల సినీ ప్రయాణంలో నాలుగు భాషల్లో తొమ్మిదొందలకు పైగా చిత్రాల్లో నటించి మురిపించారు. ఆదివారంతో ఆయన 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి శనివారం మీడియాతో మాట్లాడారు.

తన పేరుకు ముందు ఏ స్టార్‌ లేకపోయినా.. ఆయనతో చేసిన హీరోయిన్లు మాత్రం స్టార్‌ హీరోయిన్లు అయ్యేవారు.. ఆయనకు ఏ స్టార్‌ గుర్తింపు లేకపోయినా పెద్ద స్టార్‌ హీరోలతో ఢీ కొట్టారు. నటన మీద ఉన్న మక్కువ ఆయనను నాటకాల నుంచి సినిమా తెరపై మెరిపించింది. తెలుగు చిత్రసీమలో ఇప్పుడున్న విలక్షణ నటుల్లో అరుదైన నటులాయన. ఆయనే చంద్రమోహన్‌. అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. తన నటనకు ఎన్నో అవార్డులు.. మరెన్నో రివార్డులు ఆయనను వరించాయి. 1945లో జన్మించిన చంద్రమోహన్‌ మే 23తో 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగ్గజ నటుడు చంద్రమోహన్‌ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..

వాట్సాప్‌ వీడియో కాల్స్‌తోనే సరి..

కొన్నేళ్లుగా నా పుట్టినరోజు వేడుకలు దాదాపు సినిమా సెట్లోనే జరుగుతూ వస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు మా ఇంట్లో ఉండి ఉంటే భార్య, పిల్లలు, మనవలు, మనవరాళ్లు.. ఇలా అందరి మధ్య హాయిగా చేసుకునేవాడిని. సినిమాల్లోకి రాకముందు పెద్ద కుటుంబంలో ఉండటం వల్ల అసలు పుట్టినరోజు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. గత ఏడాది మా అక్కాచెల్లెళ్లు, వాళ్లకుటుంబ సభ్యులు వచ్చారు. ఈసారి లాక్‌డౌన్ కావడం వల్ల వాట్సాప్ వీడియో కాల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

నాకు కోపమెక్కువ.. ఆమెకు సహనం ఎక్కువ..

నా సతీమణి జలంధర. ఆమె తెలుగు వాళ్లందరికీ తెలుసు. చాలా మంచి రచయిత్రి. ఎన్నో మంచి కథలు, నవలలు రాసింది. మా పెళ్లి కాకముందు నుంచే రచనలు చేస్తోంది. నాకు కోపమెంత ఎక్కువో, ఆమెకు సహనం అంత ఎక్కువ.

నా కోపాన్ని తగ్గించడానికే దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇద్దరమ్మాయిలు. వివాహాలు అయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్టు. ఆమె భర్త బ్రహ్మ అశోక్‌ ఫార్మసిస్టు. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలోనే ఉంటున్నారు. ఈ పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, ఇంటి వ్యవహారాలు అన్నీ నా భార్యే చూసుకుంది. అందుకే నా కెరీర్‌ హ్యాపీగా సాగిపోయింది.

ఏ వేషమైనా ఫస్ట్ టేక్‌లో ఓకే చేయాలని ఛాలెంజింగ్‌గా తీసుకుంటా ఇదే నా మోటివేషనఅని చంద్రమోహన్​ అన్నారు. వినోదం సులభంగా కనిపించే అతి కష్టమైన ప్రక్రియ అని చెప్పారు.

"వినోదం చాలా సులభంగా కనిపించే అతి కష్టమైన ప్రక్రియ. ఇండస్ట్రీలో కమెడియన్ నిలదొక్కుకోవాలంటే.. అతనికి డైలాగ్ లో పంచ్, మోటివేషన్ ఉండాలి. ముఖ్యంగా జనం నాడి తెలుసుకోవాలి. సన్నివేశంలో ఇతర ఆర్టిస్టులను డామినేట్ చేయకూడదు. మన మూడ్, పరిస్థితితో సంబంధం లేకుండా నటించాలి. ప్రేక్షకులు ప్రతి కమెడియన్ నుంచి ప్రతిసారి కొత్తదనం కోరుకుంటారు. మంచి దర్శకుల దగ్గర శిక్షణ, అబ్జర్వేషన్, మా ఫ్యామిలీలో మేం నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉండటం.. ఇవన్నీ నా కమెడియన్ పాత్రలకు దోహదం చేశాయి. నన్ను సక్సెస్‌వైపు తీసుకెళ్లాయి. మా ఇంట్లో తమ్ముడు, అక్కయ్యలు, నాన్నగారు అందరూ నవ్వకుండా నవ్వించే అలవాటు ఉన్నవాళ్లే. ఆ కాలమైనా, ఈ కాలమైనా.. సందర్భానుసారం పుట్టే హాస్యం మంచిదని నా అభిప్రాయం."

మనకు దాదాపు హీరో, కమెడియన్‌గా మాత్రమే తెలిసిన చంద్రమోహన్‌ ప్రతినాయకుడిగానూ మెప్పించారు. 'గంగ మంగ'తో పాటు జయసుధ నటించిన 'లక్ష్మణరేఖ'లో ఆయనది నెగెటివ్ రోల్.

చంద్రమోహన్​

హీరోగా అయితే ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు..

"పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఆల్‌రౌండర్‌గా మారక తప్పదు. కచ్చితంగా అన్ని పాత్రలు పోషించగలగాలి. అలా ఉన్నా కాబట్టే 50ఏళ్లుగా చిత్రసీమలో ఉండగలిగా. హీరోగానే చేయాలనుకుని ఉంటే ఇన్నేళ్ల ప్రయాణం సాధ్యమయ్యేది కాద"న్నారు నటుడు చంద్రమోహన్‌.

"ఈ సినీ జీవితం చాలా పాఠాలు నేర్పించింది. ఇక్కడ పేరు, డబ్బు, బంధాలు.. ఏవీ శాశ్వతం కాదని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదమని నేర్పింది. చిత్రసీమ వేలాది మందికి ఉపాధి కల్పించినంత కాలం, నిర్మాతలు చల్లగా ఉన్నంత కాలం ఏ ట్రెండైనా పర్వాలేదు. కరోనా మాత్రం చిత్ర పరిశ్రమకు ఉపాధి లేకుండా చేసింది. 50ఏళ్లలో నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా. ఎవరైనా హెచ్చరించినా.. ఇనుముకు చెదలు పడుతుందా? అని వెటకారం చేసేవాడిని. కానీ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆ తర్వాత తెలిసింది. 'రాఖీ'లో ఎమోషనల్‌ సీన్‌ చేసి వచ్చి.. బైపాస్‌ సర్జరీ కోసం నేరుగా ఆస్పత్రిలో చేరా. 'దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రీకరణ సమయంలో అనారోగ్యం వల్ల షూట్‌ వాయిదా వేయాల్సి వచ్చింది. నా వల్ల నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకిష్టం లేదు. అందుకే రిటైర్మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. టీవీ, యూట్యూబ్‌ల ద్వారా నా చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంటున్నాయి. వాటిని చూసే అభిమానులు ఎక్కువయ్యారు. ఈ జన్మకి 'ఇది చాలు' అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: ఆయనతో గొడవపడి ఆకాశం రంగు మార్చా!

Last Updated : May 23, 2021, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details