అల్లరి నరేశ్.. చూస్తుండగానే సినిమాల్లో హాఫ్ సెంచరీ కొట్టేశారు. అందుకే ఆయన్ని సడన్ స్టార్ అన్నారేమో! కామెడీకి కేరాఫ్‌గా నిలుస్తూ ప్రేక్షకులకి కితకితలు పెడుతుంటారు నరేశ్. 'గమ్యం', 'శంభో శివ శంభో', 'మహర్షి'లాంటి చిత్రాలతో తన అభినయంలో మరో కోణాన్నీ ప్రదర్శించారు. ఆయన తొలి చిత్రం 'అల్లరి' విడుదలై ఈ నెల 10తో 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నట ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ప్రత్యేకంగా ముచ్చటించారు.
అల్లరి అలా..
మా నాన్న పెద్ద దర్శకుడైనా, నాకు బయటి దర్శకుల సినిమాతోనే పరిచయం కావాలని ఉండేది. నాన్న, చలపతిరావు అంకుల్ స్నేహితులు. దాంతో నాకు రవిబాబుతో అనుబంధం ఉండేది. ఆయన అప్పుడు వాణిజ్య ప్రకటనలు చేసేవారు. ఒకరోజు నన్ను 'నువ్వెందుకు నటించడం లేదు' అని అడిగాడు. నాకు ఆసక్తి ఉంది, శిక్షణ కూడా తీసుకున్నా అని చెప్పా. నా సినిమాలో చేస్తావా అని అడిగాడు. నేను బాగా తెలుసు కాబట్టి, నన్ను ప్రోత్సహించడానికి అలా అంటున్నాడేమో అనుకున్నా. 2002 జనవరి 22న ఉదయాన్నే ఫోన్ చేసి "అర్జంటుగా నీ దగ్గరున్న మంచి దుస్తులు తీసుకుని రామానాయుడు స్టూడియోకు వచ్చేయ్" అన్నాడు. ఏమైనా ప్రకటన ప్లాన్ చేశారేమో అనుకున్నా. ఫొటో షూట్ అయ్యాక "నేను 'అల్లరి' అనే సినిమా చేస్తున్నా, నువ్వే అందులో హీరో' అన్నాడు.
వాళ్లకి నచ్చక పోతే ఉండలేం
19 ఏళ్ల వయసులో 'అల్లరి'తో నా ప్రయాణం మొదలైంది. ఆ సినిమా విడుదలై 18 ఏళ్లు అయింది. అప్పుడే అన్నేళ్లయిందా అనిపిస్తోంది. అదే సమయంలో సంతోషంగానూ ఉంది. పరిశ్రమలో ఆటుపోట్లు తట్టుకుని అన్నేళ్లు నిలవడమంటే ఓ గొప్ప లక్ష్యాన్ని చేరుకున్నట్లే. నటనంటే మొదట్నుంచీ ఆసక్తి. మనకిష్టమైన రంగంలో కొనసాగడం, విజయవంతం కావడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? ప్రేక్షకులకు నచ్చకపోతే ఇన్ని రోజులు ఉండలేం. ఎప్పటికప్పుడు వాళ్లని నవ్విస్తూ, మెప్పిస్తూ ఇంత దూరం ప్రయాణం చేయడం మంచి అనుభూతి.
క్యాషియర్‌గా వచ్చా
నాన్నతో సెట్‌కి వెళ్లినప్పుడు సరదాగా క్లాప్ కొట్టడం, సీన్ పేపర్లు చూడటం చేసేవాణ్ని. నాన్న నన్ను దర్శకుణ్ని చేయాలనుకున్నారు. 'చాలా బాగుంది' సమయంలో దర్శకత్వం, నిర్మాణం రెండూ చూసుకోవడం కష్టమవుతోందని, సాయంగా నన్ను పిలిచారు. పక్కాగా చెప్పాలంటే ఓ క్యాషియర్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టా. ఆ సినిమానే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమా వంద రోజుల వేడుకకి అతిథిగా అమితాబ్ బచ్చన్ వచ్చారు. ఆయన నన్ను చూసి హైట్ ఎంతని అడిగారు. 6 ప్లస్ అని చెప్పా. 'మా అభిషేక్ అంత హైట్ ఉన్నావు' అన్నారు. ఆ తర్వాత నా గురించి మా నాన్నతో 'హీరోగా ప్రయత్నిస్తే బాగుంటుంది' అని చెప్పారట. ఆ విషయం చెప్పగానే 'నాక్కూడా ఆసక్తి ఉంది నాన్నా' అన్నా. దర్శకుణ్ని చేద్దామనుకుంటే, నటన అంటున్నాడేంటి అనుకున్నారు. అలాగని వద్దు అని చెప్పలేదు.