హీరోయిన్ శ్రుతి హాసన్.. 12 ఏళ్ల తన సినీ కెరీర్ గురించి మాట్లాడింది. తండ్రి కమల్ హాసన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2009లో బాలీవుడ్ చిత్రం 'లక్' మూవీ ద్వారా కథానాయికగా పరిచయమైంది. అనంతరం తెలుగు, తమిళ సినిమాల్లోనూ తనను తాను నిరూపించుకుంది.
సినీ ప్రయాణం ఎలా ఉంది?
సినిమాల్లోకి తన ప్రవేశం అనుకోకుండా జరిగిందని శ్రుతి తెలిపింది. హీరోయిన్గా రాకముందు తన దృష్టంతా రాక్ బ్యాండ్‌పైనే ఉండేదని వెల్లడించింది. అయితే ఇందుకు కావాల్సిన డబ్బులు 'లక్' సినిమా ద్వారా సమకూర్చుకున్నానని పేర్కొంది.
తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని శ్రుతి గుర్తు చేసుకుంది. 'జానె తూ.. యా జానె నా' సినిమా కోసం ఇమ్రాన్ ఖాన్ తనను సంప్రదించాడని తెలిపింది. ఇమ్రాన్ ఆ సినిమా స్క్రిప్ట్ చెప్తుండగా తాను విన్నట్లు నటించానని.. నిజానికి తన దృష్టంతా వేరే విషయంపై ఉందని (నవ్వుతూ) పేర్కొంది.
సినిమాలపై అప్పటివరకు అంతగా ఆసక్తి లేదని వెల్లడించింది. అనుకోకుండా హీరోయిన్గా ప్రయాణం మొదలైందని ఈ భామ చెప్పుకొచ్చింది. నటిగా నా ప్రయాణం ఓ అరేంజ్డ్ మ్యారేజ్ లాంటిది. చాలా చిన్నచిన్నగా మొదలైంది. రాను రానూ ఈ బంధం దృఢంగా మారింది. అసలు తన కెరీర్ సంగీతంతో ముడిపడి ఉందని తెలిపింది. ఈ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇంతవరకు సరైన అవకాశం రాలేదని శ్రుతి పేర్కొంది.