తెలంగాణ

telangana

'ముంబయి మాఫియా.. వాళ్ల ముందు సరిపోదు'

By

Published : Mar 10, 2021, 2:49 PM IST

Updated : Mar 10, 2021, 4:57 PM IST

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు ఈ వారం అతిథిగా హాజరయ్యారు నటీమణులు జయలలిత, వరలక్ష్మి. వీరి సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

jayalalitha
జయలలిత

బాల్యంలోనే ఒకరి నటన మొదలైంది.. నాట్యంతో మరొకరిది మొదలైంది.. వెండితెరకు వీరు కొత్తేం కాదు. ఎన్నో చిత్రాల్లో వారి నటన మనల్ని నవ్వించింది.. ఏడిపించింది.. మెప్పించింది.. ఒకరు చెల్లిగా నటిస్తే, మరొకరు చెలిగా నటించారు. బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం అలరిస్తున్న వీరు మనందరికీ సుపరిచితులే. తమ సమయాన్ని మనతో సరదాగా గడిపేందుకు ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేశారు. వారే నటీమణులు వరలక్ష్మీ, జయలలిత. మరి వారు చెబుతున్న సంగతులేంటో చూద్దామా!

అక్కా.. మీ సొంతూరు ఏది?

జయలలిత: అమ్మగారిది గుడివాడ, నాన్నది గుంటూరు జిల్లా పొన్నూరు. బాల్యమంతా గుంటూరులోనే గడిచింది. బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్‌ కాలేజ్‌లో ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా.

అప్పట్లో ప్రేమలేఖలు బాగా వచ్చేవట కదా?

జయలలిత: అవును! మా కాలేజీ ముందు కుర్రాళ్లు చక్కర్లు కొడుతూ ఉండేవారు. లవ్‌ లెటర్లు కుప్పలు తెప్పలుగా వచ్చేవి. అవి చూసి నాన్న ఎవరంటూ ప్రశ్నించేవారు. నీకు తెలియకుండా ఉత్తరాలు ఎవరు రాస్తారంటూ దెబ్బలు కూడా పడేవి. నన్ను ప్రత్యేకంగా ఒక రిక్షాలో కాలేజీకి పంపేవారు. మేం తిరిగి బయటకొచ్చేదాకా ఆ రిక్షా అతను అక్కడే కాపాలా ఉండేవాడు. నేను ఫ్రెండ్స్‌తో వెనుక గేటు నుంచి సినిమాలకు వెళ్లేదాన్ని.

మీ కుటుంబం గురించి?
జయలలిత: మేం మొత్తం ఐదుగురు సంతానం. ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. నాన్నగారు చాలా కఠినంగా ఉండేవారు. ఎప్పుడైనా సినిమాకు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే, వాళ్లను కొట్టి మమ్మల్ని సినిమా పూర్తిగా చూడనీయకుండా తీసుకెళ్లిపోయేవారు. ఆయన ‘నాదేశం’ అనే పత్రికను నడిపేవారు. మేం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది ‘అదిగో నా దేశం కూతుళ్లురోయ్‌’అని అంటుండేవారు. ‘నా దేశం’ టైటిల్‌ను సినిమా కోసం స్వర్గీయ రామారావుగారికి ఇచ్చింది మా నాన్నే. ఆయనతో మా నాన్నగారు చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు.

ఇండస్ట్రీలో ప్రవేశం ఎలా జరిగింది?

జయలలిత: నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ను. మా నాన్నకు తెలిసిన కొందరు నిర్మాతలు సినిమా తీయాలనుకున్నారు. అందులో హీరోయిన్‌ పాత్రకు భరతనాట్యం వచ్చుండాలి. ఆ క్రమంలోనే విజయా గార్డెన్స్‌లో ఒక సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడే సంయుక్త ఫిలిమ్స్‌ అధినేతల్లో ఒకరైన ధనుంజయ్‌ రెడ్డి నన్ను చూశారు. తన భాగస్వాములకు తెలియకుండా నన్ను వారు తీయబోయే చిత్రానికి హీరోయిన్‌గా బుక్‌ చేసి చెన్నైకి రప్పించారు. అయితే చివరికి ఆ పాత్ర సుమలతకి దక్కింది. అలా తొలి అవకాశం కోల్పోయాను. కుటుంబంతో సహా చెన్నై వచ్చేసిన నాకు అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. విజయ గార్డెన్స్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడే ‘నానా’ అనే మలయాళీ మ్యాగ్‌జైన్‌ వారు నా ఇంటర్వ్యూ తీసుకుని నా ఫొటోలను రకరకాల స్టిల్స్‌లో పబ్లిష్‌ చేశారు. అది చూసిన మాలీవుడ్‌ డైరెక్టర్‌ ఐ.వి శశి ‘వ్రదం’అనే సినిమాలో కమలహాసన్‌గారి పక్కన హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అలా ఇక్కడిదాకా వచ్చాను.

భీమవరం టు చెన్నై ప్రయాణం గురించి చెప్పండి?

వరలక్ష్మీ:మా సొంతూరు భీమవరమే అయినా, నా చిన్నప్పుడే కుటుంబంతో సహా చెన్నై వచ్చేశాం. మా కుటుంబంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదటిసారే నేనే ఒక హిందీ చిత్రంలో చేశా. అలాగే తెలుగులో కళాతపస్వి విశ్వనాథ్‌గారు తీసిన ‘జీవన జ్యోతి’లో నటించా. అందులో ‘పాత చింతకాయ పచ్చళ్లన్నీ ఇలా ఫ్లైట్‌లో తీసుకెళ్తే అందులో వాళ్లు వాసన వస్తున్నాయని విసిరి కొడతారు’ అనే డైలాగ్‌ సింగిల్‌ టేక్‌లో ఓకే అయ్యింది. విశ్వనాథ్‌గారు తెరకెక్కించిన దాదాపు ఆరేడు సినిమాల్లో నటించా.

జయలలిత: ‘శంకరాభరణం’లో వరలక్ష్మీ బిందె నడుంపై పెట్టుకుని డైలాగ్స్‌ చెబుతుంది ఆ సీన్‌లో ఎంతో క్యూట్‌గా ఉంటుంది. నదిలో గొంతు దాకా మునిగి సంగీతం సాధన చేస్తుంది. ఆ సీన్‌లో కూడా ఎంతో చక్కగా నటించింది.

ఎన్ని సినిమాల్లో నటించారు? ఎవరి కాంబినేషన్‌లో ఎక్కువగా చేశారు?

వరలక్ష్మీ:నేనెప్పుడూ లెక్కపెట్టలేదు కానీ, 200 పైనే ఉండొచ్చు. ఇక నటుల్లో ఎక్కువగా చిరంజీవిగారి చెల్లెలుగా నటించా. అలాగే కృష్ణగారి సినిమాల్లో ఎక్కువగా నటించేదాన్ని. ఇక లేడీ ఆర్టిస్టుల విషయానికొస్తే నటి శారద, అన్నపూర్ణమ్మ గార్లకు కూతురి పాత్రలో ఎక్కువగా నటించా. అలా అన్నపూర్ణమ్మతో రీల్‌ అనుబంధం రియల్‌లైఫ్‌లో మా అక్క వాళ్లింటి కోడలయ్యేలా చేసింది. ఆమె తమ్ముడికి మా అక్కను ఇచ్చి వివాహం చేశాం.

మిమ్మల్ని ‘బాగా నటిస్తున్నావ్‌’ అని మెచ్చుకున్న సహనటుడు ఎవరైనా ఉన్నారా?

వరలక్ష్మీ: ‘బ్రహ్మాస్త్రం’ అనే సినిమా చేస్తునప్పుడు కృష్ణగారు మెచ్చుకున్నారు. అందులో కృష్ణగారికి అంధురాలైన చెల్లెలి పాత్ర నాది. నాకు భర్తగా రాజేంద్రప్రసాద్‌ నటించారు. ఒక హత్యకేసులో ఆయనకు శిక్ష పడితే కృష్ణగారు అడ్వకేట్‌గా ఆ కేసును వాదించేందుకు సందిగ్ధంలో ఉంటారు. అప్పుడు నేను ‘అన్నా పెళ్లి చేసుకున్నానని ఆయన నిర్దోషి అని చెప్పట్లేదు, ఆయనపై నమ్మకం ఉంది ఎందుకంటే మనసులో పెట్టుకున్న వాళ్లకే తెలుస్తుంది అతను చేసేది నిజమా కాదా అన్నది’ అనే డైలాగ్‌ బాగా చెప్పానని మెచ్చుకున్నారు. చాలా సంతోషమేసింది. సాధారణంగా ఆయన అటువంటి కాంప్లిమెంట్స్‌ ఎవరికీ ఇవ్వరట.

మిమ్మల్ని కాదని మీ నాన్నకు క్యారెక్టరు ఇచ్చారట? ఎవరా దర్శకుడు?

జయలలిత: హా! అవును. డైరెక్టర్‌ వంశీగారు అప్పుడు ‘ఆలాపన’ చిత్రం తీసే పనిలో ఉన్నారు. నాన్నగారు ఆయన దగ్గరకు నన్ను తీసుకెళ్లి ‘క్లాసికల్‌ డ్యాన్స్‌ వచ్చు ఏవైనా వేషాలుంటే ఇవ్వండి’ అంటూ అడిగారు. దానికి వంశీగారు ‘మీ అమ్మాయికి క్యారెక్టరు తర్వాత ఇస్తాను, మీరు చూడ్డానికి గడ్డంతో బాగున్నారు. నా సినిమాలో భానుప్రియకు భరతనాట్యం నేర్పే గురువు పాత్రలో మీరు నటించండి. మీ అమ్మాయికి వచ్చే సినిమాలో చూద్దాం’అంటూ ఆయన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత ‘ఏప్రిల్‌1 విడుదల’ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చారు.

క్లాసికల్‌ డ్యాన్సర్‌ ఎందుకు ఐటమ్‌ సాంగ్స్‌ చేసింది?

జయలలిత: నిజంగా చెప్పాలంటే.. ఫ్యామిలీతో సహా చెన్నైకి వచ్చేశాం. ఎలాగైనా ఇదే ఇండస్ట్రీలో బతకాలి. మళ్లీ వెనక్కు వెళ్తే చులకన అయిపోతాననే భయం ఉండేది. దీంతో వచ్చిన పాత్రలన్నీ చేశా. ఏ డ్రైస్‌ వేసుకోమంటే అది వేసుకునేదాన్ని. చెప్పాలంటే సిగ్గు అనేది పడకుండా పాత్రల్లో నటించా. ఆకలిబాధ అటువంటింది. ఆ తర్వాత కొందరు క్లాసికల్‌ డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ ఇవ్వాలని ఆహ్వానించినా వెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే వ్యాంప్‌ పాత్రల్లో నన్ను జనం ఎక్కువగా చూసేవారు. అలాంటిది నేను క్లాసికల్‌ డ్యాన్స్‌ చేస్తే వాళ్లు దాన్ని ఒప్పుకోలేరు. అందుకే వెళ్లేదాన్ని కాదు. నాకు నటి శోభనను చూస్తే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. తను ఎన్ని సినిమాలు చేసినా చివరకు తన కళను మర్చిపోకుండా డ్యాన్స్‌ క్లాస్‌లు నడుపుతోంది. నాక్కూడా అలా డ్యాన్స్‌స్కూల్‌ పెట్టాలని చిరకాల కోరిక. ఎప్పటికైనా పెడతా. అంతా దైవేచ్ఛ.

ఎవరైనా ఒకటి లేదా రెండు సార్లు మోసపోతారు. మీరేంటి మోసపోతూనే ఉంటారు!

జయలలిత: నాతో ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న ఒక కుటుంబం సీరియల్స్‌ నిర్మిస్తూ ఉండేది. నోట్ల రద్దు టైంలో జీఎస్‌టీ కట్టడం ఇబ్బందిగా ఉందని, సీరియల్స్‌ నిర్మించడం కష్టమని ఆ ఫ్యామిలీ నా దగ్గర వాపోయింది. ఆ సీరియల్లో నాది ఒక ప్రధానపాత్ర. సీరియల్‌ ఆగిపోకూడదనే ఉద్దేశంతో తెలిసిన వాళ్లే కదాని డబ్బులు అప్పుగా ఇచ్చాను. షేర్ ఏమి ఆశించకుండా కేవలం వడ్డీ ఇవ్వమని వారికి చెప్పా. అలా తీసుకుంటూ, ఇస్తూ 2018నాటికి నా దగ్గర నుంచి సుమారు రూ. 4 కోట్ల రూపాయలు లాగేశారు. కొన్నాళ్లకు కట్టలేమంటూ చేతులెత్తేశారు. ఆ దెబ్బకు ఎన్నో లగ్జరీ కార్లలో తిరిగిన నేను క్యాబ్‌లలో తిరగాల్సిన పరిస్థితి(బాగా ఎమోషనల్‌ అయ్యారు) షూటింగ్‌కు కంపెనీ వాళ్లు కారు పంపాల్సిన పరిస్థితి. ఏం అనుకోవాలి ఈ దుస్థితిని. నేనేమైనా పాపం చేశానా. స్వయంకృతపారాధమా, గత జన్మలో వాళ్లకేమైనా రుణపడి ఉన్నానా? అసలు నాకేమీ అర్థం కాలేదు. వాళ్లిప్పుడు విజయనగరంలోనే ఉన్నారు. కనీసం అంత ఇవ్వలేమమ్మా.. ఇదే ఇవ్వగలం.. అని కూడా అనడం లేదు. అసలు స్పందనే లేదు. రోజూవారీ చెల్లింపుపై సీరియల్స్‌ చేస్తున్నా, అతిథి పాత్రలు చేస్తున్నా. నా సొంత డబ్బు పోగొట్టుకుని ఏమిటీ కర్మ నాకు. కేవలం నమ్మకం మీద అంత డబ్బు ఇచ్చా. ఏవేవో ప్రామిసరీనోట్లు ఉన్నాయి. కానీ ఏం లాభం? హైదరాబాదు సీసీఎస్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశా. వాళ్లు విజయనగరం వెళ్లి వాళ్లని కనుక్కున్నారు కానీ, లాభం లేదు. నేనెంత పేదరికంలో నైనా ఉండగలను. ఎలా జీవించాలో తల్లిదండ్రులు నాకు నేర్పారు. కానీ ఈ వయసులో సొంత డబ్బు పోగొట్టుకుని ఇన్ని బాధలు ఎందుకు పడాలి? క్యారెక్టర్ల కోసం అడుక్కుంటున్నాను. డబ్బు పోతే పోయిందని వదిలేసి బతుకుతున్నాను. కానీ చుట్టూ ఉండేవారు ‘అంతా డబ్బు పోగొట్టుకుని ఇంకా బతికున్నావా, ఏవైనా మింగి చనిపోతావ్‌ అనుకున్నామే’అంటూ మాటలతో పొడుస్తున్నారు. వాళ్లు కూడా నా డబ్బు తిన్నవాళ్లే. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. ఏనాడూ ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు రాలేదు. ఎందుకంటే ఏదైనా బతికి సాధించాలనే మొండి ధైర్యం. ఈ ఉద్దేశంతోనే జిడ్డు కృష్ణమూర్తిగారి కథను అనుసరించి తనికెళ్లభరణిగారు, నేను ‘కీ’అనే ఒక లఘుచిత్రం చేశాం. ‘వేయి చావులకంటే ఒక బ్రతుకు గొప్పది’అనేది దాని క్యాప్షన్‌. అది చూసిన దిలీప్‌ అనే ఒక రైటర్‌ అత్మహత్య చేసుకుందామనే తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఇప్పటికీ ‘నా ప్రాణభిక్షను పెట్టిన దాతలు’అంటూ మా ఇద్దరి ఫోన్లకు మేసేజ్‌లు పంపుతుంటాడు. అవి చూసినప్పుడల్లా ఒక జీవితాన్ని కాపాడామనే సంతృప్తి ఉంటుంది.

ఆ డబ్బు తీసుకున్నవాళ్లని నువ్వు గట్టిగా అడగలేదా అక్కా?

జయలలిత: ఎన్నోసార్లు అడిగాను. వాళ్లిప్పుడు విజయనగరంలో ఉంటే ఎవర్నో బ్రతిమాలాడి ఒక కారు తీసుకుని వెళ్లా. అక్కడా తప్పించుకున్నారు. ఎంతో కొంతైనా ఇవ్వండి అని అడుగుదామనుకున్నా. కాళ్లు పట్టుకుందామనుకున్నా. కానీ ఊర్లు తిరుగుతూ తప్పించుకుంటున్నారు. అతి సాధారణమైన ఆ కుటుంబం ముందు ముంబయి మాఫియా కూడా పనిచేయదు. అంత కరుడుగట్టిన మోసగాళ్లు. ఇప్పుడు వాళ్లు కాంప్లెక్స్‌లు కట్టుకుని హాయిగా ఉంటున్నారని ఎవరో చెప్పారు. ఈ స్టూడియోకి వచ్చేటప్పుడు అనిల్‌ కారులో వస్తుంటే ‘అబ్బా ఇలాంటి కారు మనకు ఉంటే బాగుంటుంది కదా’ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం(కంటతడి పెట్టుకున్నారు) ఈ షోలోనే శ్రీలక్ష్మీగారు చెప్పినట్టు నా కష్టాలన్నింటినీ గోడకు చెప్పి బాధపడుతుంటా రోజు. బాబా ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటా.

సాయిబాబా ఆలయం కూడా నిర్మించారనుకుంటా?

జయలలిత: అవును! అక్కడ కూడా నన్ను చెడు చేశారు. ఇప్పుడా ఆలయంలోకి నాకు ప్రవేశం లేకుండా చేశారు. అప్పట్లో లతాచౌదరీ అనే అమ్మాయి, నటుడు చిట్టిబాబు, నేను కలిసి ఆ గుడిని నిర్మించాం. అమెరికా నుంచి ఫండ్స్‌ కూడా తెచ్చాం. నాకు సాయిబాబాను పరిచయం చేసింది నటి రమాప్రభ అమ్మ. ఆ గుళ్లో విగ్రహం నల్లరాతితో చేసింది. ప్రత్యేకంగా ఉంటుంది. ఆ గుడి ద్వారా పేదలకు, భక్తులకు సహాయం చేస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలనుకునేదాన్ని. ఇప్పుడు కొందరు నన్ను రాకుండా చేసి వారు అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏది చేసినా దురదృష్టం వెంటాడుతోంది. ధైర్యంగా ఎదుర్కోగలను. కానీ ఆ దేవుడిని అందుకు తగిన ఆత్మస్థైర్యం ఇవ్వమని కోరుకుంటున్నా.

మీది ప్రేమ వివాహమా, పెద్దలు నిశ్చయించిందా?

వరలక్ష్మీ: పెద్దలు నిశ్చయించిన ప్రేమ వివాహం(నవ్వులు). నాకు ఒకే ఒక్క కూతురు. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో పెళ్లి చేశాం. ప్రస్తుతం వాళ్లు తమిళనాడులోని వేలూర్‌లో ఉంటున్నారు. వారికి కూడా ఒక పాప.

ఇండస్ట్రీని ఎప్పుడు వదిలేశారు?

వరలక్ష్మీ: నేనేమీ ఉద్దేశపూర్వకంగా ఇండస్ట్రీ నుంచి వెళ్లపోలేదు. ‘చిట్టెమ్మ మొగుడు’ సినిమా చేస్తునప్పుడు నేను గర్భిణిని. షూటింగ్‌లో భాగంగా కిందపడే షాట్స్‌లో నటించాలి. అది కొంచెం కష్టమైంది. బిడ్డను ప్రసవించాక కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నా. మళ్లీ ‘ఆమె’ ‘ఆడవాళ్లా మజాకా’ ‘మాతో పెట్టుకోవద్దు’ ఇలా కొన్ని సినిమాల్లో నటించా. తర్వాత సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టా. ఎక్కడా బ్రేక్‌ అయితే ఇవ్వలేదు.

‘ఆడాళ్లా మజాకా’లో హీరో ఎవరో తెలుసా(నవ్వులు)?

వరలక్ష్మీ: కొంచెం మీలాగే ఉంటారేమో(ఆలీని ఉద్దేశిస్తూ). ఎప్పుడూ నిక్కరును లాక్కుంటూ ఉండేవాడు (నవ్వులు) నువ్వేననుకుంటా.

ఏ సినిమాలో నటిస్తున్నప్పుడు కష్టమనిపించింది?

వరలక్ష్మీ: ఒక హిందీ సినిమాలో నటించినప్పుడు చాలా కష్టమనిపించింది. అదొక డెన్‌ సెట్‌. లొకేషన్‌ అంతా నిప్పురవ్వలు వచ్చేలా డిజైన్‌ చేశారు. జితేంద్రగారు, శ్రీవిద్య అందులో లీడ్‌. ఒక చిన్న పాప పాత్ర నాది. దానికి ముందు వేరే అమ్మాయిని ఆ పాత్రకు తీసుకున్నారు. ఆమె భయపడడంతో వాళ్లమ్మ ‘మా కూతురు బాగుంటే చాలు..సినిమా వద్దు ఏం వద్దు’అంటూ తీసుకెళ్లిపోయింది. దీంతో చిత్రబృందం టెన్షన్‌ పడ్డారు. అసలే జితేంద్రగారి డేట్స్‌ తక్కువగా ఉన్నాయి. దీంతో నన్ను ఆ పాత్రకు ఎంచుకున్నారు. నేను ఆ డెన్‌ వాతావరణాన్ని చూసి అస్సలు భయపడలేదంటా..అసలు నన్ను చిత్రపరిశ్రమలోకి తీసుకొచ్చింది రమాప్రభగారు. మా నాన్న కూడా నటులే. కానీ, చిన్న చిన్న పాత్రలు వస్తుండేవి. దీంతో రమాప్రభగారు ‘ఇలా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఎన్నాళ్లు ఉంటావు. నీ కూతురుని ఆర్టిస్ట్‌ చెయ్‌. చక్కగా ఉంటుంది’ అని సలహా ఇచ్చారట. దీంతో నన్ను ‘అందాల రాముడు’చిత్రంలో నటింపజేశారు. అందులో ‘ఎదగడానికికెందుకురా తొందర’అనే పాటలో నాగేశ్వరావుగారు నన్ను ఎత్తుకుని పాట పాడతారు.

ఎందుకు హైదరాబాద్‌లో కాకుండా, చెన్నైలోనే సెటిల్‌ అయ్యారు?

వరలక్ష్మీ: కరెక్టుగా తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చేసినప్పుడు మా నాన్నగారు కాలం చేశారు. అప్పటికే నేను తెలుగు సినిమాల్లో చెల్లెలి పాత్రలో నటిస్తూ ఉన్నా. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నాన్నగారితో ‘నాన్న నేను సినిమాల్లో నటిస్తాను, మిగతా వాళ్లను చదివించండి’అని భరోసా ఇచ్చా. దీంతో వాళ్లు బాగా చదువుకుని డిగ్రీలు పూర్తి చేశారు. నేనేమో అస్సలు చదువుకోలేదు. దీంతో వచ్చిన సినిమాలు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత అక్కకు పెళ్లి చేసేశాం. ఆ తర్వాత అక్కలిద్దరూ ఆసక్తితో నటనలోకి వచ్చారు. ప్రస్తుతం రాణి మాత్రమే సీరియల్స్‌లో నటిస్తోంది.

ఇప్పుడున్న హీరోల్లో మీ అభిమాన నటుడెవరు?

వరలక్ష్మీ: ఇప్పటి హీరోల్లో మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ అంటే ఎంతో అభిమానం. అవకాశం వస్తే వాళ్లిద్దరితో నటించాలని ఉంది. మహేశ్‌కి అత్తగా కంటే అమ్మలా నటించాలని ఉంది. ఎందుకంటే మా ఇద్దరి ముక్కులు ఒకేలా ఉంటాయి కదా. అలాగే బన్నికి కూడా అమ్మ పాత్రలో నటించాలని ఉంది. ఆయన నా ముద్దుల కొడుకుగా నటిస్తారు(నవ్వులు)

రామానాయుడుగారి తర్వాత ఒక మెగాబ్రదర్‌ ఎప్పుడూ మీ యోగక్షేమాలు తెలుసుకుంటారట?

జయలలిత: అవును! నాగబాబుగారు నాకు కనిపించే ప్రత్యక్షదైవం. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నా యోగక్షేమాలు ఎప్పుడూ ఆరా తీసేవారు. నేను మోసపోయిన తర్వాత నన్ను ఇంటికి పిలిపించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత నా బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు తీసుకుని అవసరానికి డబ్బులు పంపేవారు. ఎన్నో సార్లు నన్ను ఆదుకున్నారు. ఆయనకు పాదాభివందనం చేస్తాను. అలాగే పరుచూరి గోపాలకృష్ణగారు నా గురువులాంటివారు. ఎప్పుడూ ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడుగుతుంటారు. మాట్లాడేటప్పుడు నా గొంతులో ఏదైనా తేడా కనిపిస్తే వెంటేనే వీడియో కాల్‌ చేస్తుంటారు. అలాగే చలపతిరావు బాబాయి, రామానాయుడుగారు నాకు ఆర్థికంగా ఎంతో సహాయం చేసేవారు. వారి తర్వాత ఇప్పుడు నాగబాబుగారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ‘బావా.. నాకేదైనా సినిమాల్లో పాత్రలు ఇప్పించండి’ అని స్వతంత్రగా అడిగేస్తా. నా ముందే ఎంతోమందికి ఫోన్‌ చేస్తారు. మేమిద్దరం కలిసి '420', 'శ్రావణమాసం' సినిమాలు చేశాం. అలాగే ‘అపరంజి’ సీరియల్‌ కూడా ఇద్దరం కలిసే చేశాం. అలాగే ‘శుభలేఖ’ సుధాకర్‌, ఎస్పీ శైలజ దంపతులు నన్ను వాళ్లింటి ఆడపడుచుగా గౌరవించేవారు. ఆర్థిక సహయం కూడా చేశారు. ఈ విషయాలన్నీ నేను సగర్వంగా చెప్పుకుంటా. సాయం చేసిన వాళ్ల గురించి చెప్పుకోవాలి కూడా.

వరలక్ష్మీ: 'శుభలేఖ' సుధాకర్‌గారు నాకు మర్చిపోకుండా నా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. మా తోబుట్టువులందరినీ కూడా ఆయన అక్కాచెల్లెళ్లుగా భావిస్తారు. ఎంతో ఆత్మీయంగా ఉంటారు.

ఇండస్ట్రీకి వచ్చి ఏం పోగొట్టుకున్నారు, ఏం సంపాదించారు?

వరలక్ష్మీ:ఈ రంగంలోకి వచ్చాక నేను చదువును కోల్పోయా. ఏం చేద్దాం..పరిస్థితులు సహకరించలేదు. ఇందులో సంపాదించిందేంటంటే ఒక నటిగా మంచి గౌరవం. మా నాన్నగారి దీవెన ఇది. మా కుటుంబంలో మొదట ఆర్టిస్ట్‌ని నేనేనని చెప్పుకోటానికి గర్వపడుతున్నా. ‘చెల్లెలు వరలక్ష్మీ’గా నా నటనను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారనే నమ్మకం ఉంది. నా జీవితంలో తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉంటా. నాకు ఎంతో చేశారు. ఇప్పుడు ఇద్దరూ ఈ భూమ్మీద లేరు. వాళ్లిద్దరూ నా ఒడిలోనే కళ్లు మూశారు. మా మామగారు కూడా. అదీను నా కళ్లల్లో చూస్తూ వాళ్లు తమ ప్రాణాలు విడిచారు. మా మామయ్య తన పుట్టినరోజు నాడే చనిపోవడం నన్ను ఎంతగానో బాధించింది.

ఇదీ చూడండి: వారిని నమ్మి మోసపోయా: జయలలిత

Last Updated : Mar 10, 2021, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details