అమెరికాలోని న్యూజెర్సీలో పుట్టింది ఆర్తి అగర్వాల్. తండ్రి శశాంక్ అగర్వాల్ వ్యాపారంలో స్థిరపడిన శ్రీమంతుడు. పద్నాలుగేళ్ల వయసు వచ్చే వరకు న్యూజెర్సీలోనే చెల్లెలు ఆదితి అగర్వాల్‌తో కలిసి చదువుకుంది ఆర్తి. మోడలింగ్ అంటే మక్కువ. నటుడు, నిర్మాత సునీల్‌శెట్టి ఓసారి అమెరికా వెళ్లినప్పుడు ఆర్తిని చూసి... ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా నగరాల్లో ఆమెతో నృత్య ప్రదర్శనలు ఇప్పించాడు. ఆ కార్యక్రమాలకు బిగ్-బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సునీల్‌శెట్టితో పాటు బిగ్-బి కూడా ఆర్తి ప్రదర్శనకు ముచ్చటపడి బాలీవుడ్‌కు ఆహ్వానించారు. అలా ఆర్తికి మంచి నటిగా ఎదగాలని కలలు మొదలయ్యాయి.
పదహారేళ్ల వయసులో భారతదేశానికి వచ్చింది ఆర్తి. 2001లో నిర్మాత రాజీవ్‌షా, జోయ్ అగస్టీన్ దర్శకత్వంలో నిర్మించిన బాలీవుడ్ సినిమా 'పాగల్‌పన్'లో అయిదుగురు అన్నదమ్ముల గారాల చెల్లెలు రోమాగా నటించింది.
తెలుగుతెరపై టాప్ హీరోయిన్...
2001లో స్రవంతి రవికిషోర్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘నువ్వు నాకు నచ్చావ్’ పేరుతో ఓ ప్రేమకథ రాశారు. విజయభాస్కర్ దర్శకత్వంలో ఆ కథతో సినిమా తీయాలని రవికిషోర్ కొత్త అమ్మాయి కోసం అన్వేషిస్తుంటే ఆర్తి కనిపించింది. అలా వెంకటేశ్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని కొట్టేసింది.
2001 సెప్టెంబరు 6న విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కోటి సంగీతం సమకూర్చిన వాన పాట 'ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని' యువతరాన్ని ఉర్రూతలూపింది. అంతే ఒక్కసారిగా ఆర్తి టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ఆర్తి హీరోయిన్‌గా 2002లో ‘నువ్వు లేక నేను లేను’ పేరుతో మరో ప్రేమకథను తెరకెక్కించింది. ఇందులో హీరోగా తరుణ్ నటించగా కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇది కూడా హిట్టే.
- 2002లో ఎన్టీఆర్ సరసన 'అల్లరి రాముడు'లో నటించింది. అది బాగా ఆడగా... హిందీలోకి 'మై హూ ఖుద్దార్' పేరుతో డబ్ చేశారు.
- చిరంజీవి సరసన 'ఇంద్ర' సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తే ఆ పాత్ర ఆర్తికి మరింత పేరు తెచ్చింది. ఈ సినిమా హిందీలో 'ఇంద్ర.. ద టైగర్' పేరుతో, తమిళంలో 'ఇంద్రన్' పేరుతో డబ్ చేసి విడుదల చేస్తే అక్కడా విజయాలే స్వాగతించాయి.
- 'నీ స్నేహం'లో ఉదయకిరణ్ సరసన ఆర్తి హీరోయిన్‌గా నటించింది. ఎమ్.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా బాగానే ఆడింది. దీన్ని బెంగాలీలో 'ప్రేమి' పేరుతో డబ్ చేశారు. అప్పటికే ఆర్తి పేరు టాలీవుడ్‌లో మారుమోగింది.
- మహేశ్ బాబు సరసన 'బాబీ' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీలో ఈ సినిమాని 'డాగ్.. ద బర్నింగ్ ఫైర్' పేరుతో అనువాదం చేశారు.
- 2003లో 'వసంతం' సినిమాలో వెంకటేశ్ సరసన ఆర్తి హీరోయిన్‌గా నటించింది. తమిళంలో ఇదే చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడం విశేషం. ఇది 71 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.
- బాలకృష్ణ సరసన 'పల్నాటి బ్రహ్మనాయుడు', రవితేజ సరసన 'వీడే' సినిమాలోనూ కనిపించింది. 2004లో వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో ‘నేనున్నాను’ చిత్రంలో నాగార్జున సరసన రెండో హీరోయిన్‌గా నటించింది. 'అడవి రాముడు' లో ప్రభాస్‌తో, 'సోగ్గాడు' సినిమాలో తరుణ్‌తో ఆర్తి నటించింది.
- మల్టీస్టారర్ చిత్రం సంక్రాంతిలో నటించిన ఆమె... ‘ఛత్రపతి’ సినిమాలో 'సుమ్మమ్మా సూరియా.. సూదంటూ రాయిలా..' పాటలోనూ, 'నరసింహుడు' సినిమాలో 'రాజమండ్రికే రంగసానివి రంభ జాంగిరీ' వంటి ప్రత్యేక గీతాల్లో ప్రభాస్, జూ.ఎన్టీఆర్ సరసన ఆర్తి నర్తించింది.
అవకాశాల లేమి... జీవితంలో కలిమి