బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. జునైద్ సోదరి ఇరా ఖాన్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
ఆమిర్ తనయుడి వెండితెర అరంగేట్రం.. సోదరి పోస్ట్ - జునైద్ ఖాన్ వెండితెర అరంగే ట్రం
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ అతడి సోదరి ఇరా ఖాన్ ఇన్‌స్టా పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
జునైద్‌కు పుష్ప గుచ్ఛం ఇస్తున్న ఓ ఫొటోను షేర్ చేసిన ఇరా ఖాన్.. 'ఇదే నీకు షూటింగ్లో మొదటి రోజు' అంటూ రాసుకొచ్చింది. "జున్నూ ఇది నీకు మొదటి నాటకం, మొదటి షో, లేదా మనిద్దరం కలిసి చేసిన మొదటి నాటకం కాదు. కానీ షూటింగ్లో ఇది నీకు మొదటి రోజు. ఈ ఫొటో నాకు చాలా ఇష్టం. చాలా ఏళ్లుగా నువ్వు నటిస్తున్నా.. ఇది నాకు కొత్తగానే ఉంది. నీ నటన పట్ల ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. సినిమా గురించి ఏ విషయం చెప్పకుండా నాకు చిరాకు తెప్పించావు. నేను సెట్‌కు వచ్చి నిన్ను ఇబ్బంది పెడతా" అంటూ గర్వంగా ఫీల్ అవుతున్నట్లు పేర్కొంటూ పోస్ట్ పెట్టింది ఇరా ఖాన్.
1862 కాలం నాటి ఓ రాజు కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సిద్దార్థ్ పీ మల్హోత్రా దర్శకత్వం వహిస్తుండగా.. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండే హీరోయిన్గా చేస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.