తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమ్మాయి నో చెప్పిందని గుండు చేయించుకున్న ఆమిర్‌! - ఆమిర్ ఖాన్ ప్రేమ విఫలం

ప్రేమలో విఫలమైన బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ గుండుకొట్టించుకున్నారట. ఇప్పుడు తల్చుకుంటే తనది ఎంత మూర్ఖత్వమో అనిపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆమిర్.

Aamir Khan shaved head
అమ్మాయి నో చెప్పిందని గుండు చేయించుకున్న ఆమిర్‌!

By

Published : Feb 2, 2021, 10:27 AM IST

ప్రేమలో విఫలమైతే ఎవరికైనా బాధ ఉండటం సహజం. అయితే ఆ బాధను తట్టుకోలేక వారు పాల్పడే చర్యలు కొన్నిసార్లు అయ్యో పాపం అనిపిస్తే, మరి కొన్ని కాస్త విచిత్రంగా ఉంటూ నవ్వు తెప్పిస్తాయి. బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ చేసిన పని కూడా అలాగే అనిపిస్తుంది.

ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు ఓ అమ్మాయి నచ్చి తన ప్రేమ విషయాన్ని చెప్పారట. అయితే ఆమిర్‌ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. ఇలా ఒకసారి కాదు.. మూడు సార్లు ముగ్గురు అమ్మాయిలతో తిరస్కారానికి గురయ్యారు ఆమిర్‌. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా నాలుగోసారీ ప్రేమించారట. కానీ ఆ అమ్మాయి కూడా నో చెప్పడం వల్ల హతాశుడయ్యారు ఆమిర్‌. గుండెల నిండా దుఃఖం ఆవరించగా, ఏం చేయాలో పాలుపోని స్థితిలో సరాసరి సెలూన్‌కు వెళ్లి గుండు కొట్టించుకున్నారట.

అసలు ఆ పని ఎందుకు చేశానో తెలియదని, ఇప్పుడు తల్చుకుంటే తనది ఎంత మూర్ఖత్వమో అనిపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆమిర్‌. అయితే టీనేజ్‌ ప్రేమలు విఫలమైనా తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకోవడమే కాదు.. ప్రేమలోనూ విజయం సాధించి కిరణ్‌ రావ్‌ను పెళ్లి చేసుకున్నారు ఆమిర్‌.

ABOUT THE AUTHOR

...view details