ఆమిర్ ఖాన్.. నేడు దేశంలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న స్టార్. పాత్ర కోసం ఎంత కష్టాన్నైనే భరించేతత్వం ఆయనది. అందుకే అందరూ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అని పిలుస్తుంటారు. అయితే తన కెరీర్ ఆరంభంలో ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాలను ఇప్పుడు ఓ సారి నెమరువేసుకుందాం.
'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రంతో ఆమిర్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లు అవమానాలు ఎదుర్కొన్నట్లు ఆమిర్ చెప్పారు.
"ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమా తర్వాత దాదాపు ఎనిమిది సినిమాలకు సంతకం చేశా. కేవలం కథలను నమ్ముకుని ఒప్పుకున్నా. అంతా కొత్త దర్శకులు, అప్పట్లో నాకు ఆ విషయం తెలియదు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందాయి. అందరూ నన్ను 'వన్ ఫిల్మ్ వండర్' అని పిలవడం మొదలుపెట్టారు. నా కెరీర్ ఇక ముగిసిపోయిందని ఆవేదన చెందా. నేను ఊబిలో కూరుకుపోయిన భావన కలిగింది. ఎంతో బాధపడ్డా.. ఇంటికెళ్లి తెగ ఏడ్చేవాడిని" అని ఆమిర్ తెలిపారు.