Kriti Sanon New Movie: 'వన్ నేనొక్కిడినే' చిత్రంలో మహేష్‌బాబుతో కలిసి తొలిసారి తెలుగు తెరపై సందడి చేసిన భామ కృతిసనన్. ఇప్పుడు ఆమె తమిళ చిత్రసీమలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హిందీలో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ప్రస్తుతం విజయ్-66 వర్కింగ్ టైటిల్‌తో మొదలు కానున్న చిత్రంలో కథానాయిక పాత్రకు ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీన్ని తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో అటు తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఇప్పటికే 'బీస్ట్'ను పూర్తిచేసిన తమిళ కథానాయకుడు విజయ్ తర్వాత ఈ సినిమా కోసమే రంగంలోకి దిగనున్నారు. ప్రకాష్‌రాజ్, వివేక్ ఓబరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా తొలుత రష్మిక, తమన్నా పేర్లు వినిపించాయి. ఇప్పుడు కృతిసనన్ పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇటీవలే 'బచ్చన్‌పాండే'తో ప్రేక్షకులను అలరించిన కృతి.. ప్రస్తుతం 'అదిపురుష్'లో నటిస్తోంది.
Sudheer Babu New Movie: సుధీర్‌బాబు కథా నాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుధీర్‌బాబు ఇందులో ఓ శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రని పోషిస్తున్నారు.