తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ గయ్యాళి అత్తగా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసింది సూర్యకాంతం. 'సంసారం' (1950) చిత్రంలో శేషమ్మగా ఆమె నటనకు ఎంతో గుర్తింపు వచ్చింది. అయితే సూర్యకాంతం మొదట హీరోయిన్ కావాల్సిందట. కాని కొన్ని అనుకోని పరిస్థితుల కారణగా ఆ ఛాన్స్ పోయిందట.
అవకాశం కోల్పోయిందిలా...
1951లో శ్రీ రాజ రాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు కె.బి.నాగభూషణం దర్శకత్వంలో నిర్మించిన 'సౌదామిని' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు సరసన హేమవతి పాత్రకోసం సూర్యకాంతానికి కబురెళ్లింది. ఆ సమయంలో ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్న సూర్యకాంతానికి ముఖం నిండా గాయాలయ్యాయి. అలా హీరోయిన్ అవకాశం తలుపు తట్టినట్లే తట్టి వెళ్ళిపోయింది.
అలా సహాయ పాత్రలకే పరిమితం
'సంసారం' చిత్రం చూసిన ఒక బొంబాయి నిర్మాత హిందీ సినిమాలో సూర్యకాంతాన్ని హీరోయిన్‌గా బుక్ చేశారు. గతంలో ఇదే నిర్మాత తన తరఫున మరొక నటీమణిని ఎంపిక చేసి తొలగించినట్లు సూర్యకాంతానికి తెలిసింది. విలువలు పాటించే సూర్యకాంతానికి ఆ నిర్మాత చేసిన పని నచ్చలేదు. వెంటనే మరో కారణం చూపి ఆ అవకాశాన్ని ఇష్టపూర్వకంగానే వదలుకుంది. ఒకరిని బాధపెట్టి సంతోషంగా వుండటం సూర్యకాంతానికి నచ్చని పని. ఆ తరువాత సూర్యకాంతం సహాయ పాత్రలకే.. ముఖ్యంగా గయ్యాళి పాత్రలకు పరిమితం కావలసివచ్చింది.
ఆ నిర్మాత అన్ని సినిమాల్లోనూ సూర్యకాంతం
1953లో వచ్చిన గజాననా వారి 'కోడరికం' చిత్రంతో అంతవరకూ గయ్యాళి పాత్రలకు పేరెన్నికగన్న శేషుమాంబను పక్కనబెట్టి గయ్యాళి పాత్రలకు ట్రేడ్ మార్క్‌గా నిలిచింది. తన హావభావాలతో వెటకారం రంగరించిన గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంది. ఆ తరువాత 'చిరంజీవులు', 'మాయాబజార్', 'దొంగరాముడు', 'తోడికోడళ్ళు', 'మాంగల్యబలం', 'వెలుగునీడలు', 'అత్తా ఒకింటి కోడలే', 'ఇల్లరికం', 'భార్యాభర్తలు' వంటి అనేక సినిమాలలో సూర్యకాంతం వైవిధ్యమైన సహజ నటనను ప్రదర్శించించి మెప్పించింది. భానుమతి నిర్మించిన అన్ని సినిమాలలోనూ సూర్యకాంతం నటించేది. నిర్మాత చక్రపాణి సూర్యకాంతాన్ని దృష్టిలో వుంచుకొనే 'గుండమ్మ కథ' నిర్మించాడు.