మంచు విష్ణు వెండితెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. ఈ విరామం తర్వాత 'మోసగాళ్లు' అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు విష్ణు. కరోనా దెబ్బ తగలకుంటే ఈ వేసవిలోనే బాక్సాఫీస్ ముందుకు వచ్చి ఉండేదీ సినిమా. కానీ, ఇప్పుడీ మహమ్మారి దెబ్బకు చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ చిత్రీకరణకు జరుగుతుండగానే లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేసినట్లు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటనలో తెలిపాడు.
"మోసగాళ్లు'కు సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ పూర్తయింది. ఇందులో కీలకమైన ఐటీ ఆఫీస్ సీన్ల కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో రూ.3.5కోట్ల వ్యయంతో ఓ భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ను నిర్మించాం. లాక్‌డౌన్ కారణంగా చిత్రీకరణను నిలిపివేశాం. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా విపత్కర పరిస్థితి మెరుగయ్యాక షూటింగ్‌ను కొనసాగిస్తాం."