సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే అకాడమీ అవార్డు 'ఆస్కార్'. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా అలాంటి ప్రణాళికలే సిద్దం చేస్తోంది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్. అయితే 2019 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక ప్రముఖ నటుడిని హోస్ట్‌గా నియమించేవారు. కానీ 2019లో ఈ విధానానికి స్వస్తి పలికి మొదటిసారి అకాడమీ వేడుకలో హోస్ట్ లేకుండానే ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాదీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది అకాడమీ.
ఈ సారి జరిగే 92వ అకాడమీ వేడుకలో ప్రపంచ అగ్రశేణి తారలు, అందరిని ఆకట్టుకునే అద్భుతమైన ప్రదర్శనలు, చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని... కానీ హోస్ట్ మాత్రం ఉండడని తెలిపింది. ఈ సోమవారం 2020 ఆస్కార్ బరిలో ఉన్న పోటీదారుల జాబితాను విడుదల చేయనున్నారు నిర్వాహకులు. ఫిబ్రవరి 9న ఈ కార్యక్రమం అమెరికాలో జరగనుంది. ఈ వేడుకను వీక్షించటానికి ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2018లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యకమానికి 928 మందిని ఆహ్వానించింది. భారత్ నుంచి షారుఖ్ , మాధురీ దీక్షిత్, నషారుద్దీన్ షా వంటి ప్రముఖులు ఉన్నారు.