రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం - రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
10:07 April 01
రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
51వ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతను ప్రకటించింది కేంద్రం. తమిళ స్టార్ హీరో రజనీకాంత్‌ను 2019 ఏడాదికిగానూ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం రావడం పట్ల రజనీ కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
"నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రచయితగా సినీరంగానికి రజనీకాంత్ చేసిన విశిష్ఠ సేవలకుగానూ ఈ అవార్డ్‌కు ఎంపిక చేశాం. ఆశా భోంస్లే, మోహన్‌లాల్, విశ్వజీత్ ఛటర్జీ, శంకర్ మహదేవన్, సుభాష్ ఘాయ్‌తో కూడిన జ్యూరీ రజనీ పేరును ఏకాభిప్రాయంతో సిఫారసు చేసింది. 50ఏళ్లుగా చిత్రరంగంలో రజనీకాంత్ నిర్విరామంగా బాద్‌షాగా కొనసాగుతున్నారు. సూర్యుని మాదిరిగానే చిత్రపరిశ్రమలో వెలుగుతూనే ఉన్నారు. నటనా కౌశలం, అంకితభావం, కఠోరశ్రమ ద్వారా ప్రజల గుండెల్లో స్థానం పదిలం చేసుకున్నారు. జాతీయ చలనచిత్రం అవార్డులు ప్రదానం చేసే మే 3న ఫాల్కే పురస్కారం కూడా అందజేయటం జరుగుతుంది" అని తెలిపారు ప్రకాశ్ జావడేకర్.
రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేసి.. నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లారు. మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా చేశారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగల్'లో తొలి అవకాశం అందుకొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి భారతీయ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు.