తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇఫి' స్వర్ణోత్సవ సంబరాలు.. అంబరాన్నంటేలా - అమితాబ్​ బచ్చన్ వార్తలు

నేటి(బుధవారం) నుంచి 9 రోజుల పాటు గోవాలో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) జరగనుంది. ఈ సందర్భంగా ప్రముఖులను సత్కరించడం సహా, అద్భుత చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా

By

Published : Nov 20, 2019, 7:59 AM IST

Updated : Nov 20, 2019, 10:54 AM IST

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలకు సమయం ఆసన్నమైంది. గోవాలో నేడు మొదలుకానున్న ఈ చిత్రోత్సవం.. ఈ నెల 28 వరకూ అంగరంగ వైభవంగా కొనసాగనుంది. అభిమాన తారలు, దేశదేశాల నుంచి రాబోతున్న ప్రతినిధులు, సినీ ప్రేమికులతో ఈ వేడుక సందడిగా మారనుంది.

ప్రపంచం నలుమూలల నుంచి ఎంపిక చేసిన ఆణిముత్యాల్లాంటి సినిమాలను, అలనాటి క్లాసిక్‌ చిత్రాలను వీక్షించి ఆనందించే సువర్ణ అవకాశాన్ని 'ఇఫి' అందిస్తోంది. సినీరంగంలోని లబ్ధప్రతిష్ఠులను సత్కరించుకుంటూ వారి సేవలను స్మరించుకోబోతోంది. ఈ ప్రత్యేక సందర్భంలో 'ఇఫి' విశేషాలు మీకోసం.

ఆసియాలోని ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న 'ఇఫి'కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1952 నుంచి ఈ వేడుకను నిర్వహిస్తోంది. అయితే ఆరంభంలో ఏటా జరిపేవారు కాదు. 1975 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. 2004 నుంచి గోవాను శాశ్వత వేదికగా మార్చారు. ఈ ఏడాదితో 'ఇఫి'కి 50 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు.

ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలు

76 దేశాలు.. 250 చిత్రాలు

ఈ చిత్రోత్సవంలో ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌, వరల్డ్‌ పనోరమ, ఇండియన్‌ పనోరమ, ఇండియన్‌ న్యూ వేవ్‌ సినిమా, సోల్‌ ఆఫ్‌ ఆసియా, ఆస్కార్‌ రెట్రోస్పెక్టివ్‌ లాంటి 20కి పైగా విభాగాల్లో చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈసారి 76 దేశాల నుంచి 250కి పైగా చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఇందులో డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు ఉంటాయి. ఇండియన్‌ పనోరమకు 'గల్లీబాయ్‌', 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌', 'సూపర్‌ 30', 'బదాయి హో' లాంటి బాలీవుడ్‌ చిత్రాలతో పాటు తెలుగు చిత్రం 'ఎఫ్‌2' ఎంపికైంది.

ద గోల్డెన్‌ లైనింగ్‌ విభాగంలో ప్రదర్శించే చిత్రాల్లో ఎన్టీఆర్‌ నటించిన 'వరకట్నం' ఉంది. ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌ విభాగంలో మలయాళ చిత్రం 'జల్లికట్టు', మరాఠీ చిత్రం 'మాయ్‌ ఘాట్‌' పోటీపడుతున్నాయి. ఓపెన్‌ ఎయిర్‌ స్క్రీనింగ్‌లో సాధారణ సందర్శకులకు 'అందాజ్‌ అప్నా అప్నా', 'చల్తీ కా నామ్‌ గాడీ' లాంటి చిత్రాలను వీక్షించే అవకాశం కల్పించారు. ఏటా ఒక దేశాన్ని ప్రాధాన్య దేశంగా ఎంపిక చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది రష్యాను ఎంపిక చేశారు. భారత్‌, రష్యాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ వేడుకలో ఆ దేశ చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు.

12 వేలు

ఈ వేడుకకు దేశదేశాల నుంచి వచ్చే ప్రతినిధుల సంఖ్య (సుమారు).

రూ.18 కోట్లు

గోవా ప్రభుత్వం ఈ వేడుకల కోసం పెడుతున్న ఖర్చు (అంచనా).

13 వేదికలు

చిత్రాలను ప్రదర్శించే వేదికలు. మిరమర్‌ బీచ్‌, అల్టిన్హో పార్కుల్లో ఓపెన్‌ ఎయిర్‌ స్క్రీనింగ్‌.

నివాళులు.. పురస్కారాలు

ఈ ఏడాది దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్‌ బచ్చన్‌కు గౌరవ సూచకంగా ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. వాటిలో 'షోలే','పీకూ', 'పా', 'బ్లాక్‌', 'బద్లా', 'దీవార్‌' ఉన్నాయి. భారతీయ సినీ పరిశ్రమకు రజనీకాంత్‌ చేసిన సేవలకుగానూ ఆయన్ను ఐకాన్‌ ఆఫ్‌ ది గోల్డెన్‌ జూబ్లీ ఆఫ్‌ ఇఫి 2019 పురస్కారంతో సత్కరించనున్నారు. అలాగే ఫ్రెంచ్‌ నటి ఇసాబెల్లె హుపర్ట్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని అందిస్తారు. జపాన్‌ దర్శకుడు తకషి మైకేకు నివాళిగా ఆయన తెరకెక్కించిన '13 అస్సాసిన్స్‌', 'ఆడిషన్‌' తదితర చిత్రాలను ప్రదర్శించనున్నారు.

చర్చలు.. వర్క్‌ షాప్‌లు

ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అందివస్తున్న సాంకేతికత లాంటి విషయాలపై ప్రముఖులతో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. వారిలో కరణ్‌ జోహార్‌, మధుర్‌ భండార్కర్‌, సుభాష్‌ ఘయ్‌, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, ప్రియ దర్శన్‌, శోభు యార్లగడ్డ, ఇళయరాజా, వి.శ్రీనివాస మోహన్‌, సాబు సిరిల్‌ లాంటి దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీఆర్‌ ఫిలింమేకింగ్‌పై ఔత్సాహికులకు వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు.

Last Updated : Nov 20, 2019, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details