మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో 80వ దశకం అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. 'ఖైదీ'తో మొదలుపెట్టి వరుస బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఆ విజయపరంపరలో వచ్చిన చిత్రం 'కొండవీటి రాజా'. దేవి ఫిలిం ప్రొడక్షన్ సంస్థ నిర్మాణంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించగా, పరుచూరి బ్రదర్స్ తమ రచనాశక్తిని చూపారు. ఎవర్‌గ్రీన్ హీరోయిన్స్ రాధ, విజయశాంతి చిరుతో ఆడిపాడారు. నేటితో ఆ చిత్రం విడుదలై 35 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆ సినిమా పోస్టర్లతో హల్‌చల్ చేస్తున్నారు.
'కొండవీటి రాజా' చిత్రానికి 35 ఏళ్లు! - చిరంజీవి వార్తలు
మెగాస్టార్ చిరంజీవి-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు రూపొందాయి. అందులో 'కొండవీటి రాజా' ఒకటి. 1986 జనవరి 31న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. నేటితో 35 ఏళ్లు గడిచిన సందర్భంగా 'కొండవీటి రాజా' సినిమాను గుర్తుచేసుకుందాం.
!['కొండవీటి రాజా' చిత్రానికి 35 ఏళ్లు! 35 years for Megastar Chiranjeevi's kondaveeti raja movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10450891-465-10450891-1612104060096.jpg)
ఇక మిగతా ఆర్టిస్టుల విషయానికొస్తే రావుగోపాలరావు నాయకత్వంలోని నూతన్ ప్రసాద్, రాళ్లపల్లిల విలనీ గ్యాంగ్ తమ విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా రావుగోపాలరావు పాత్ర ఒక సందర్భంలో 'దౌర్జన్యం మా నిత్యకృత్యాల్లో ఒకటి' అంటూ పలికే డైలాగు సినిమాలో ప్రతినాయక బలాన్ని చూపుతుంది. చిరు 'దెబ్బక్కాయ్ కొబ్బరికాయ్' అంటూ తనదైన శైలిలో హీరోయిజాన్ని ప్రదర్శించారు. సత్యనారాయణ కరుణారస పాత్రలో మెప్పించగా, బామ్మగా నిర్మలమ్మ ఆకట్టుకుంటుంది. ఒక కోట నేపథ్యంలో జరిగే ఈ చిత్రం షూటింగ్‌ను నెలరోజుల పాటు గద్వాల కోటలో చిత్రీకరించారు. చక్రవర్తి స్వరాలు సమకూర్చిన చిత్రంలోని ఆరుపాటలు ఇప్పటికే మారుమోగుతూనే ఉంటాయి. కొండవీడు ఊరిలోని అక్రమార్కుల ఆగడాలను తెలుసుకుంటూ వాటిని ఎదిరించే కుర్రాడిగా, చివర్లో పురావస్తుశాఖ అధికారిగా చిరు ఇరగదీశారు. ఈ స్టోరిలైన్‌కు కాస్త కుటుంబనేపధ్యాన్ని కలిపి స్క్రిప్ట్‌ను పరుచూరి బ్రదర్స్ అందిస్తే రాఘవేంద్రరావు మార్కు దర్శకత్వంతో సినిమా బంపర్‌హిట్ కొట్టింది. మరి ఆ సినిమాలోని కొన్ని పాటలు, సీన్లు మరోసారి చూసి ఆనందించండి!
ఇదీ చూడండి:'చావు కబురు..' రిలీజ్ డేట్.. కిచ్చా సుదీప్ @25