తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ: '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'నో తెలిసిందా? - 30 రోజుల్లో ప్రేమించటం ఎలా వార్తలు

ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్​ మాచిరాజు హీరోగా పరిచయమైన చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. శుక్రవారం (జనవరి 29) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో ప్రదీప్​ నటుడిగా మెప్పించారా? అసలు సినిమా ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

30 rojullo preminchadam ela movie review
రివ్యూ: '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'నో తెలిసిందా?

By

Published : Jan 29, 2021, 4:37 PM IST

చిత్రం:30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?

న‌టీన‌టులు:ప్రదీప్‌ మాచిరాజు, అమృతా అయ్యర్‌‌, శివ‌న్నారాయ‌ణ‌, హేమ‌, పోసాని కృష్ణముర‌ళి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వైవా హ‌ర్ష‌, హైప‌ర్ ఆది, ఆటో రామ్‌ప్రసాద్‌, భ‌ద్రం, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేశ్​.

సంగీతం:అనూప్ రూబెన్స్

ఛాయాగ్రహణం:దాశరథి శివేంద్ర

కూర్పు:కార్తీక్ శ్రీనివాస్

క‌ళ:నరేష్ తిమ్మిరి

నిర్మాత:ఎస్వీ బాబు

ర‌చ‌న, దర్శకత్వం:మున్నా

సంస్థ‌:ఎస్వీ ప్రొడక్షన్స్‌

విడుద‌ల‌:29-01-2021

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా'

కొన్ని సినిమాలు పాట‌ల‌తో విశేషంగా ప్రేక్షకులను దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. అలా పాట‌తో ప్రచార‌మైన సినిమాల్లో '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?' ఒకటి. ఇందులోని 'నీలి నీలి ఆకాశం..' పాట శ్రోత‌ల్ని క‌ట్టిప‌డేసింది. పాటంత బాగా సినిమా ఉంటుంది అంటూ చిత్ర బృందం ప్రచారం చేసుకునే స్థాయిలో ఆ గీతం ప్రభావితం చేసింది. లాక్‌డౌన్‌కు ముందే పూర్తయిన ఈ సినిమా ఆల‌స్యంగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. 'నీలి నీలి..' పాట‌ యాంక‌ర్ ప్రదీప్‌ మాచిరాజు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తొలి సినిమా.. ఇలా ప‌లు ర‌కాలుగా ప్రేక్షకుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది? పాట బాగున్నంతగా సినిమా కూడా బాగుందా?

క‌థేంటంటే?

అర్జున్ (ప్రదీప్‌ మాచిరాజు), అక్షర (అమృత అయ్య‌ర్‌) ఒకే కాలేజీలో చ‌దువుకుంటుంటారు. ప‌క్క ప‌క్క ఇళ్లల్లోనే ఉంటారు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. అవ‌కాశం దొరికితే చాలు.. టామ్ అండ్ జెర్రీలా ఒక‌రినొక‌రు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. ఒక సంద‌ర్భంలో కాలేజీ స్నేహితులంతా క‌లిసి అర‌కు టూర్‌కు వెళ‌తారు. అక్కడికి వెళ్లాక కూడా ఇద్దరూ గొడ‌వ ప‌డ‌తారు. ఈ క్రమంలోనే అర్జున్‌, అక్షర ఇద్దరూ ఒక‌రి శ‌రీరంలోకి మ‌రొక‌రు ప్రవేశిస్తారు. అలా శ‌రీరాలు మారిపోవ‌డానికి గ‌త జ‌న్మ ప్రభావం ఉంటుంది. ఇంత‌కీ గ‌త జన్మలో ఏం జ‌రిగింది? అప్పట్లో అర్జున్‌, అక్షర ఎవ‌రు? మ‌రి వీళ్లిద్దరూ వాళ్ల వాళ్ల శ‌రీరాల్లోకి తిరిగి వ‌చ్చారా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

జన్మజన్మల ప్రేమ‌క‌థ ఇది. క‌థ ఎన్ని జన్మలతో ముడిపడినా.. ప్రేమ అన‌గానే అందులో ఫీల్ క‌నిపించాలి. ఒక జంట విడిపోయినా లేక కలిసినా దాని వెన‌క కార‌ణం బ‌లంగా ఉండాలి. చూస్తున్న ప్రేక్షకుడు అనుభూతికి గురయ్యేది అప్పుడే. ఈ క‌థ‌లో ఒక జన్మలో విడిపోయిన ప్రేమ జంట క‌నిపిస్తుంది. మ‌రో జన్మలో ప్రేమ‌ జంట క‌లుస్తుంది. 'అరే.. విడిపోకుండా ఉండాల్సింది' అని కానీ, 'భ‌లే క‌లిశారే' అనే అనుభూతి కానీ ఏ కోశానా క‌లిగించ‌కుండా ముగిసే క‌థ ఇది. ఓ శిష్యుడు అస‌లైన ప్రేమంటే ఏమిటి స్వామీ? అని అడ‌గ్గా 'దీపికా ప‌దుకొణె నిన్ను ప్రేమించిందనుకో అది ప్రేమ‌, అదే నువ్వు ప్రేమించావంటే అది కామం' అని గురువు చెప్పిన డైలాగ్​తో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. గురువు స‌మాధానంలాగే అస్పష్టంగా సాగే క‌థ ఇది.

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా'

ప్రథమార్ధం నీలి నీలి పాట‌తో కూడిన ఫ్లాష్‌బ్యాక్, కాసిన్ని స్పూఫ్ కామెడీ స‌న్నివేశాల‌తో సాగుతుంది. కాలేజీ నేప‌థ్యంలో స‌న్నివేశాలు అక్కడక్కడా న‌వ్వించినా.. చాలా వ‌ర‌కు బోర్ కొట్టిస్తాయి. కొన్ని స‌న్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి. ద్వితీయార్ధంలో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. దేహాలు మారడం వల్ల ఆ జంట ప‌‌డే ఇబ్బందులు, ఒక‌రి జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌లు మ‌రొక‌రిపై చూపించే ప్రభావం కాస్త ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. నాయ‌కానాయిక‌ల కుటుంబాల నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి. అయితే ఈ ప్రేమ‌క‌థ‌కు ఓ జంట మ‌ధ్య ప్రేమ చిగురించ‌డ‌‌మే కీల‌కం. ఆ ప్రేమ‌ను స‌హ‌జంగా పుట్టించ‌డంలో ద‌ర్శకుడు విఫ‌ల‌మ‌య్యాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో స‌న్నివేశాలున్నా అవి ప్రేక్షకుల‌పై ఏమాత్రం ప్రభావం చూపించ‌వు. శ‌రీరాలు మార‌డం వల్ల ఏర్పడే గంద‌ర‌గోళం, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని దర్శకుడు సమర్థంగా న‌డిపించాడు. 'నీలి నీలి ఆకాశం' పాట తీర్చిదిద్దిన విధానం బాగుంది. పెద్ద తెరపై అది మరింత అందంగా కనపడుతుంది.

ఎవ‌రెలా చేశారంటే?

ప్రదీప్‌ మాచిరాజు క‌థానాయ‌కుడిగా చేసిన తొలి చిత్రమిది. ఇలాంటి క‌థ‌ల్ని భుజాన మోయ‌డం కష్టమైన ప‌నే. హాస్యం, భావోద్వేగాల ప‌రంగా మంచి ప్రతిభ‌ను ప్రద‌ర్శించాడు ప్రదీప్‌‌. అమృత కూడా అందం, అభిన‌యం పరంగానూ ఆక‌ట్టుకుంది. దేహాలు మారాక అబ్బాయిగా హావ‌భావాలు ప్రద‌ర్శించాల్సి రావ‌డం, ఆ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లో అమృత‌కు మంచి మార్కులు ప‌డ‌తాయి. శివన్నారాయ‌ణ‌, హేమ‌, పోసాని త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. వైవా హ‌ర్ష‌, భ‌ద్రం త‌దిత‌రులు అక్కడక్కడా కామెడీ పండించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అనూప్ పాట‌ల‌తో పాటు, నేప‌థ్య సంగీతం చిత్రానికి బ‌లాన్నిచ్చాయి. శివేంద్ర కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. దర్శకుడు మున్నా ఈ సినిమా కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. అయితే, తన కలానికి ఇంకాస్త పదును పెడితే బాగుండేది.

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా'
బలాలు బ‌ల‌హీన‌త‌లు
+ సంగీతం - క‌థ‌, క‌థ‌నం
+ నాయ‌కానాయిక‌ల న‌ట‌న
+ కామెడీ

చివ‌రిగా:అనుభూతిని పంచే ప్రేమ‌క‌థ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'

గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details