అలనాటి అపురూప సీరియల్స్‌లో 'మహాభారతం' ఒకటి. దీనితోపాటే 'రామాయణం', 'శక్తిమాన్', 'చాణక్య' తదితర సీరియల్స్.. ప్రజల్లో ఎంతో ఆదరణ దక్కించుకున్నాయి. భారత్‌లో ప్రస్తుతం లాక్డౌన్ విధించిన సందర్భంగా, ప్రజల విజ్ఞప్తి మేరకు వాటిని మళ్లీ దూరదర్శన్‌లో ప్రసారం చేస్తున్నారు. అందులో భాగంగా మహాభారతాన్ని.. గత నెల 28 నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 12 , రాత్రి 7 గంటలకు ప్రదర్శిస్తున్నారు. రవి చోప్రా దర్శకత్వం వహించిన ఈ సీరియల్‌ను బీఆర్ చోప్రా నిర్మించారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..
1. 'మహాభారతం'.. దూరదర్శన్‌లో ప్రసారమై ఇప్పటికి 32 ఏళ్లయింది. 1988 అక్టోబరు 2న తొలిసారి ఈ సీరియల్ టీవీలో ప్రదర్శించారు. మొత్తంగా 94 ఎపిసోడ్లు ఉన్నాయి.
2. ఈ సీరియల్‌కు ఏకంగా 8.9 రేటింగ్ వచ్చింది. ఇలా దేశంలో ప్రముఖ టీవీ సీరియల్స్‌లో ఒకటిగా నిలిచింది.
3. వేదవ్యాసుడు రచించిన 'మహాభారతం' ఆధారంగా చేసుకుని ఈ సీరియల్‌ను తీశారు.
4. దీనిని తీసేందుకు పలు పరిశోధనలు చేసిన రచయిత సతీశ్ భట్నగర్, అతని బృందం.. మహాభారతం గురించి వివిధ భాషల్లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలపై అధ్యయనం చేసింది.
5. ఈ సీరియల్ తీసేందుకు రూ.9 కోట్లు ఖర్చయింది.
6. బీఆర్ చోప్రా మహాభారతం సీరియల్‌కు బలమైన కథ రాశారు. ముఖ్య పాత్రను పలు భాషల్లో దిలీప్ కుమార్, ఎన్టీరామారావు వంటి దిగ్గజ నటులు పోషించాలని భావించారు.
7. బీఆర్ చోప్రా బృందం 1986లో దూరదర్శన్‌కు మొత్తం 194 ఎపిసోడ్లు అందించారు. అయితే 1988లో 94 ఎపిసోడ్లు ప్రసారం చేశారు.
8. ప్రఖ్యాత ఉర్దూ కవి, దివంగత రాహి మసూమ్ రాజా ఈ ధారావాహికకు స్క్రిప్ట్ రాశారు. ఈయన 'మైన్ తులసి తేరే అంగన్ కీ', 'మిలీ అండ్ లామ్హే' వంటి బాలీవుడ్ హిట్ సినిమాలకు స్క్రిప్ట్ రాశారు.
9. ఈ ధారావాహికలో నటించేందుకు ఏకంగా 15 వేల మంది ఆసక్తి చూపించారు. చివరగా స్క్రీన్ టెస్టులు చేసి, 1500 మందికి అవకాశం ఇచ్చారు.
10. గుఫీ పెంటల్.. ఈ సీరియల్‌కు క్యాస్టింగ్ డైరెక్టర్. ఇందులోని శకుని పాత్రను ఈయనే పోషించాడు. వివిధ పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేసేందుకు ఏకంగా 8 నెలల సమయం తీసుకున్నాడు.
11. ద్రౌపది పాత్ర కోసం జూహి చావ్లాను ఎంపిక చేశారు. కానీ ఆమె 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాలో అవకాశం రావడం వల్ల ఈ పాత్ర చేసేందుకు నిరాకరించింది. తర్వాత ఆ పాత్రకు రూపా గంగూలీ ఎంపికైంది.