2022 Summer movie: ఓ వైపు కొవిడ్ ఉద్ధృతి తగ్గడం.. మరోవైపు టికెట్ ధరల సమస్యలు కొలిక్కి రావడం వలల్ చిత్రసీమకు సరికొత్త జోష్ వచ్చినట్లయింది. దీంతో ఇప్పుడు తెలుగు సినీ క్యాలెండర్ కొత్త కాంతులతో తళుకులీనుతోంది. బాక్సాఫీస్ ముందు వేసవి వినోదాల జాతర కొనసాగుతోంది. మార్చి నుంచి మే వరకు వేసవి బెర్తులన్నీ ఇప్పటికే ఖరారైపోయాయి. అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు సినిమాలు విడుదల తేదీల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మరి వాటిలో వేసవి బరిలో తెరపైకి వచ్చేవెన్ని? ఓటీటీ వేదికగా సందడి చేసేవి ఎన్ని? అన్నది ఆసక్తికరంగా మారింది.
తొలి దశ కరోనా తర్వాత 'అరణ్య'తో.. మూడో దశ ఉద్ధృతి తర్వాత 'భీమ్లానాయక్'తో ప్రేక్షకుల్ని పలకరించారు నటుడు రానా. వీటికన్నా ముందు పట్టాలెక్కి.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘విరాటపర్వం’ చిత్ర విడుదల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. వేణు ఊడుగుల తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సురేష్‌బాబు సమర్పిస్తున్నారు.నక్సలిజం నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమ కథాంశంతో రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు ఇటీవలే రానా ప్రకటించారు. విడుదల ఎప్పుడనే విషయంలో ఏ స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమా ఓటీటీ బాట పట్టనున్నట్లు కొన్నాళ్లుగా చిత్ర వర్గాల్లో ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడు దీనిపై చిత్ర బృందం స్పందన కోసం సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో బాక్సాఫీస్ ముందు సందడి చేశారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన నుంచి రానున్న మరో కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీకార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమాని.. ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించారు. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని, ప్రియదర్శి, నాజర్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీన్ని వేసవి బరిలోనే బాక్సాఫీస్ ముందుకు తీసుకురానున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. సైన్స్ ఫిక్షన్ అంశాలతో ముడిపడిన కుటుంబ కథా చిత్రమిది.
‘మనం’ వంటి హిట్ తర్వాత నాగచైతన్య - విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్ యూ’. రాశి ఖన్నా కథానాయిక. అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటించారు. విభిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. దీన్ని ఈ వేసవిలోనే విడుదల చేయనున్నట్లు దిల్‌రాజు ఇటీవల ప్రకటించారు. తేదీ విషయంలో ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో నాగచైతన్య మూడు భిన్నమైన గెటప్పుల్లో కనువిందు చేయనున్నారు.