వేసవి.. దసరా.. సంక్రాంతి అంటూ సినిమాల విడుదలలపై మొన్నటిదాకా పక్కా ప్రణాళికలతోనే కనిపించింది తెలుగు చిత్రసీమ. 2020లో వచ్చిన విరామం ప్రభావం కనిపించకుండా.. 2021లో పక్కాగా సినిమాల్ని విడుదల చేసి గట్టెక్కే ప్రయత్నం చేసింది. కానీ కరోనా రెండో దశ ఉద్ధృతితో ఆ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. వరుసగా రెండోసారి వేసవి సీజన్ చేజారింది. దసరా సీజన్‌పైనా క్రమంగా నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. మళ్లీ థియేటర్లు తెరుచుకునేది ఎప్పుడో.. చిత్రీకరణలు పునఃప్రారంభయ్యేదెప్పుడో తెలియని అనిశ్చితి. ఇక ఈ ఏడాదిలాగే.. వచ్చే సంక్రాంతి నుంచే కొత్త సినిమాల జోరు చూడొచ్చని లెక్కలేస్తున్నాయి సినీ వర్గాలు. వ్యాక్సినేషన్ ఊపందుకుంది కాబట్టి దసరా నుంచే థియేటర్లు మళ్లీ గాడిన పడొచ్చనే అభిప్రాయాలు మరోపక్క వినిపిస్తున్నాయి. ఏం జరిగినా విడుదల తేదీలు మరోసారి గజిబిజి అయ్యాయి.
చిత్రీకరణను పూర్తి చేసుకున్న సినిమాలకే విడుదల తేదీలపై ఇప్పుడు స్పష్టత లేదు. థియేటర్లు తెరచుకున్నా.. వంద శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు సాగుతాయా? యాభై శాతం ప్రేక్షకులకే అనుమతి అంటే విడుదల చేయాలా వద్దా? ఇలా ఎన్నో సందేహాలు. అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ.. నిర్మాతలు ఓటీటీవైపు మొగ్గు చూపడం లేదు. పరిమిత వ్యయంతో తెరకెక్కిన ఒకట్రెండు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి తప్ప.. సింహభాగం థియేటర్లపై భరోసాతోనే ఉన్నాయి.
రేసులో బోలెడన్ని
'టక్ జగదీష్', 'లవ్‌స్టోరి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'ఖిలాడి', 'రిపబ్లిక్', 'మేజర్'.. ఇలా విడుదలకు ముస్తాబైన సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో చాలా వరకు గతేడాది వేసవికే విడుదల కావల్సినవి. అయితే ఈ వేసవికీ రాలేకపోయాయి.