వరుస సినిమాలతో సందడి చేయాల్సిన చిత్ర పరిశ్రమ కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అనే ఆశావహ దృక్పథంతో కొన్ని ఆసక్తికర ప్రాజెక్టులు ఈ ఏడాది సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఘన విజయం సాధించిన చిత్రాలకు కొనసాగింపుగా వస్తుండటం ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘బంగార్రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. మరి ఏయే చిత్రాలు సందడి చేసేందుకు వస్తున్నాయో చూసేద్దామా!
మరోసారి నవ్వించనున్న కో-బ్రదర్స్
వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడళ్లులుగా నటించి నవ్వులు కురిపించిన చిత్రం ‘ఎఫ్-2’. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్-3’ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో మరోసారి కో-బ్రదర్స్‌గా కడుపుబ్బా నవ్వించడానికి వెంకీ, వరుణ్ ఇద్దరూ సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 25న ‘ఎఫ్-3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఫుల్ టైమ్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత.
ఆ ప్రశ్నకు సమాధానం ‘కేజీఎఫ్2’లో...
టేకింగ్, ఎడిటింగ్, యాక్షన్, సెంటిమెంట్, మ్యూజిక్, రీ రికార్డింగ్ అన్నింటిలోనూ ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ నటుడు యశ్ నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ని ఊపేసింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘కేజీఎఫ్2’ విడుదలకు సిద్ధమవుతోంది. గరుడను చంపిన రాఖీ ‘కేజీఎఫ్’ను ఎలా కైవసం చేసుకున్నాడు? అధీరను ఎలా ఎదుర్కొన్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలకు ‘కేజీఎఫ్2’లో సమాధానం లభించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్ 14, 2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హిట్ 2
విశ్వక్‌సేన్ కీలక పాత్రలో నటించిన ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా ‘హిట్2’ రానుంది. అయితే, ఈ సినిమాలో అడవి శేష్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై నాని నిర్మిస్తున్నారు. ఇందులో అడవి శేష్ కృష్ణదేవ్ పాత్రలో కనిపించనున్నారు.