తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2019, 12:46 PM IST

ETV Bharat / sitara

2019: గ్యాప్ తీసుకున్నారా.. వచ్చిందా..?

కొంతమంది స్టార్​ హీరోలు నటించిన సినిమాలు ఈ ఏడాది ఒక్కటి కూడా రాలేదు. ఫలితంగా అభిమానుల్లో నిరాశ ఎదురైంది. వీరంతా 2020లో ముహూర్తం కుదుర్చుకుని థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఏంటా సినిమాలు?

2020 movies coming from big heros in tollywood
2020లో చిత్రాలతో అలరించనున్న హీరోలు

మరో వారంలో 2019 ముగిసిపోనుంది. కానీ కొందరు స్టార్స్‌ ఈ ఏడాది ఒక్క సినిమతో కూడా దర్శన భాగ్యం కల్పించలేదు. దీంతో వారి అభిమానులకు నిరాశే మిగిలింది. స్క్రిప్టు ఎంపికలో ఆలస్యమో, లేక సినిమా పట్టాలెక్కడంలో జాప్యమో తెలియదు. కారణమేదైనా కొందరు కథానాయకులు గ్యాప్‌ తీసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌, రవితేజ, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, అఖిల్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఈసారి ఆలస్యమైనప్పటికీ.. వచ్చే ఏడాది మాత్రం వీరాంతా ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. గట్టిగా హిట్టు కొట్టే దిశగా మంచి స్క్రిప్టుతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఈ ఏడాది ఒక్క చిత్రంతోనూ ప్రేక్షకుల ముందుకు రాని కథానాయకులవైపు ఓ లుక్కేద్దాం..

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​

పింక్​తో పవన్​ రాక

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. 'అజ్ఞాతవాసి' తర్వాత ఆయన రాజకీయాలతో బాగా బిజీగా గడుపుతున్నారు. దీంతో కెమెరా ముందుకు వచ్చే తీరిక లేకపోయింది. ఒకానొక సమయంలో ఇక పవన్‌ సినిమాల్లో నటించరని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆయన 'పింక్‌' తెలుగు రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. తను ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు నిర్మాత బోనీ కపూర్‌ వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు పవన్‌ ఈ చిత్రం గురించి నోరు విప్పి మాట్లాడలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. పవన్‌ మేకప్‌ వేసుకుంటే 2020లో చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

డిస్కో రాజాగా మారిన రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. 'అమర్ అక్బర్‌ ఆంటోనీ' తర్వాత 'డిస్కో రాజా'కు సంతకం చేశారు. దీన్ని 2019లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. వచ్చే ఏడాది జనవరి 24న 'డిస్కో రాజా' థియేటర్లలో సందడి చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలా అలరించబోతున్నారో చూడాలి. మరోపక్క ఆయన హీరోగా 'క్రాక్‌' రూపుదిద్దుకుంటోంది. ఇటీవల చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. 2020 చివర్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కొమరం భీంతో ఎన్టీఆర్​

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ భారీ ప్రాజెక్టు 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 'అరవింద సమేత' హిట్‌ తర్వాత ఈ చిత్రం కోసం ఆయన కసరత్తులు చేసి, ఇంకా ఫిట్‌గా తయారయ్యారు. జిమ్‌లో వ్యాయామం చేయడానికే నెలలు కేటాయించారు. చారిత్రాత్మక నేపథ్యంలో అధిక బడ్జెట్‌తో ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా ఇది. కాబట్టి విడుదలకు సిద్ధం కావడానికి రెండేళ్ల సమయం పడుతోంది. దీంతో ఈ ఏడాది ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్‌ దర్శనం లభించలేదు.

అల్లు అర్జున్​

సంక్రాంతి బరిలో అల్లు అర్జున్​

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ ఏడాది గ్యాప్‌ తీసుకోలేదు.. పరిస్థితుల వల్ల గ్యాప్‌ వచ్చిందట. 'అల వైకుంఠపురములో..' తొలి ప్రచార చిత్రంలో బన్నీ ఫ్యాన్స్‌కు చెప్పిన మాట ఇది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దీని తర్వాత సరైన స్క్రిప్టు ఎంచుకోవడానికి బన్నీకి కాస్త గ్యాప్‌ వచ్చింది. దీంతో 2019లో ఆయన సినిమా రాలేకపోయింది. కానీ 2020 సంక్రాంతికి మాత్రం బాక్సాఫీసు వద్ద బన్నీ సందడి నెలకొననుంది.

భీష్మ తో నితిన్​

యువ హీరో నితిన్‌ కూడా 2019లో వెండితెరపై కనిపించలేదు. 'శ్రీనివాస కల్యాణం' తర్వాత ఆయన 'గద్దలకొండ గణేష్‌'లో అతిథిగా మెరిశారు. కానీ కథానాయకుడిగా మాత్రం పూర్తిస్థాయి పాత్రలో అలరించలేదు. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న 'భీష్మ' వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆపై వరుసగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు నితిన్‌.

యష్​

కేజీఎఫ్​ చాప్టర్​ 2 తో యష్ సిద్ధం

ఒక్క సినిమాతో అందరి చూపులు తనవైపుకు తిప్పుకున్న కన్నడ స్టార్‌ యశ్‌. 'కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 1' కన్నడలో హిట్‌ అందుకోవడంతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆదరణ పొందింది. కేవలం భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ యశ్‌కు అభిమానులు ఏర్పడ్డారు. దీంతో 'కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు సినిమా తీయడానికి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కృషి చేస్తున్నారు. అలా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి సమయం పడుతోంది. ఈ రెండో భాగం వచ్చే ఏడాది జులైలో థియేటర్లకు రాబోతోంది. దీంతో యశ్‌ ఈ ఏడాది వెండితెరపై కనిపించలేదు.

ABOUT THE AUTHOR

...view details