ప్రేక్షకులు సినిమాని చూసే విధానం మారిపోయింది. అభిమాన హీరోలపై ప్రేమని ప్రదర్శిస్తూ వాళ్ల సినిమాల్ని చూడటమే కాకుండా, కథకి కూడా ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఫలితంగా హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు, విక్కీ కౌశల్ లాంటి యువ కథానాయకులు చేసే సినిమాలు కూడా అలవోకగా రూ.100 కోట్లు సాధిస్తున్నాయి. కథనే నమ్ముకొని సినిమాలు చేస్తున్న కథానాయకులు వీళ్లు. తెలుగులో యువతరం ఇంకా ఆ స్థాయి ప్రభావం చూపించడం లేదు కానీ.. స్టార్ కథానాయకులు మాత్రం బాక్సాఫీసుని హోరెత్తిస్తున్నారు.
చిరు జోరు
'మగధీర, 'అత్తారింటికి దారేది' చిత్రాల నుంచే తెలుగు సినీ పరిశ్రమలో రూ.100 కోట్ల వసూళ్ల మాటలు వినిపించడం మొదలైంది. గతేడాది 'రంగస్థలం'తో ఆ రికార్డుని మరోసారి అందుకున్న రామ్‌చరణ్ ఈసారి కూడా 'వినయ విధేయ రామ'తో అదే జోరు చూపిస్తారని అనుకున్నారు. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది. హీరోగా సాధ్యం కాకపోయినా, నిర్మాతగా ఆయన ఆ అంకెల్ని మరోసారి అందుకున్నారు. తండ్రి చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'సైరా నరసింహారెడ్డి' దాదాపు రూ.250 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి. రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమది. సురేందర్‌రెడ్డి తెరకెక్కించారు.
తన తండ్రి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ చిత్రం ఉండాలని, బడ్జెట్ పరిమితులు లేకుండా 'సైరా'ని నిర్మించారు చరణ్. అందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఒదిగిపోయిన విధానం, సురేందర్‌రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది. సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంది. చిరంజీవి మార్కెట్, ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని మరోసారి నిరూపిస్తూ మంచి ప్రారంభ వసూళ్లని సొంతం చేసుకుందీ చిత్రం. హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేశారు. అయితే తెలుగుతో పోలిస్తే ఇతర భాషల్లో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
రిషి.. మహర్షి
మహేష్‌బాబు ఈమధ్య సామాజికాంశాలతో కూడిన వాణిజ్య ప్రధాన చిత్రాలపై మక్కువ ప్రదర్శిస్తూ వస్తున్నారు. 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు అలా తెరకెక్కినవే. వాటిలో స్పృశించిన అంశాలు, మహేష్ కనిపించిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది. మరోసారి అదే తరహాలో ఒక బలమైన సామాజికాంశం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. రైతు సమస్యల్ని స్పృశిస్తూ, వారాంతాల వ్యవసాయం అనే ఒక కొత్త ఆలోచనని రేకెత్తించిందీ చిత్రం. వంశీ పైడిపల్లి దర్శకత్వం, మహేష్‌బాబు నటన ప్రేక్షకుల్ని అలరించింది. దిల్‌రాజు, సి.అశ్వనీదత్, ప్రసాద్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రూ.200 కోట్లు గ్రాస్ వసూళ్లు లభించాయి. ఈ ఏడాదిలో డబుల్ సెంచరీ కొట్టిన చిత్రాల్లో ఇదొకటి.
'సాహో'రే ప్రభాస్
'బాహుబలి'తో ఏర్పడిన మార్కెట్‌ని ప్రభాస్ నిలబెట్టుకోగలడా? రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడి పేరు పోస్టర్‌పై లేకపోయినా, 'బాహుబలి' తరహాలో ప్రభాస్ కోసం ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? ఇలాంటి ప్రశ్నల మధ్యే 'సాహో' సినిమా విడుదలైంది. కానీ ప్రేక్షకుల్లో ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ ముందు అప్పటిదాకా ఉన్న సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఆగస్టు 30న విడుదలైన 'సాహో'కి దేశవ్యాప్తంగా అదిరిపోయే ప్రారంభ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాదిలో అయితే ప్రభాస్‌పై ఉన్న అభిమానం మరింత స్పష్టంగా కనిపించింది. సుజీత్ దర్శకుడిగా, యువీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఆ చిత్రం దాదాపు రూ.400 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు, హిందీలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇతర భాషల్లో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
రెట్టింపు వినోదం
మల్టీస్టారర్ చిత్రాలంటే అందుకు తగ్గట్టే ఖర్చుఅవుతుంది, విజయం సాధించినా వాటికి వచ్చే వసూళ్లు ఇద్దరు కథానాయకుల మార్కెట్‌కి తగ్గట్టుగా ఏమీ ఉండవనే అభిప్రాయాలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంటాయి. కానీ ఆ అభిప్రాయాలు తప్పని 'ఎఫ్2' నిరూపించింది. వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల కెరీర్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిందీ చిత్రం. సంక్రాంతికి విడుదలై కుటుంబ ప్రేక్షకులందరినీ థియేటర్‌కి రప్పించింది. దాంతో దాదాపు రూ.140 కోట్లు గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి లభించాయి. 'అంతేగా అంతేగా..' అంటూ వెంకటేష్, వరుణ్‌తేజ్ చేసిన సందడి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించింది. సినిమాలో ఫన్ ఉందంటే విజయం తోడున్నట్టే అని నిరూపించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. మల్టీస్టారర్‌లపై కథానాయకులు మరోసారి మక్కువ చూపేలా చేసిందీ చిత్రం.
ఎప్పటిలాగే ఈసారీ బాక్సాఫీసు దగ్గర తారాబలం కనిపించింది. రికార్డు స్థాయి అంకెలతో, వసూళ్ల సెంచరీలు నమోదయ్యాయి. అయితే వీటిలో కొన్ని చిత్రాలు కాస్ట్ ఫెయిల్యూర్‌లుగా మిగిలిపోయాయి. నిర్మాణ వ్యయం అధికం కావడం ప్రతికూలంగా మారింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఒకే రకమైన ప్రభావం చూపించలేకపోయాయి. డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపేణా వచ్చిన సొమ్ములు నిర్మాతల్ని ఒకింత గట్టున పడేశాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.