చిన్నదని తక్కువ చేసి చూడకూడదు. అది సినిమా అయినా, ఐడియా అయినా. చిన్న చిన్న ఐడియాలతో తెరకెక్కిన చిత్రాలు ఈ ఏడాది ఘన విజయాలు సాధించాయి. కాన్సెప్ట్ కథల సత్తా తెలియడానికి అది చాలు. ప్రేమ, యాక్షన్, వినోదం.. కథ ఏదైనా - దానికి చిన్న కాన్సెప్టు జోడించి, సినిమాని మరింత రక్తికట్టించే ప్రయత్నాలు చేశారు మన దర్శకులు. ఈ ఏడాది విజయవంతమైన ఏ సినిమా తీసుకున్నా - ఏదో ఓ అంశం కొత్తగా చూపించాలన్న తపన కనిపించింది. అదే ప్రేక్షకులకు నచ్చింది.
'చిత్రలహరి'తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని చెప్పాడు సాయిధరమ్‌తేజ్. అన్నట్టు ఈ సినిమాతో తేజూ పేరు 'సాయితేజ్'గా కుదించారు. అది సెంటిమెంట్‌గా కలిసొచ్చింది. 'చిత్రలహరి' చక్కటి విజయాన్ని అందుకుంది. పరాజయాల ఊబిలో కూరుకుపోయిన ఓ దురదృష్టవంతుడి కథ ఇది. చిన్న అంశాన్ని వినోదాత్మకంగా చూపించడంలో దర్శకుడు కిషోర్ తిరుమల విజయం సాధించారు. పాటలూ తన వంతు పాత్ర పోషించాయి.
సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం 'మజిలి' ఓ మధ్యతరగతి కుర్రాడి కథ. ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్యని దూరంగా పెట్టి, ప్రియురాలి జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీసే ఓ వీర ప్రేమికుడి కథ. దానికి క్రికెట్ నేపథ్యం జోడించడం కొత్తగా అనిపించింది. భర్తని దారిలోకి తెచ్చుకోవడానికి భార్య చేసే ప్రయత్నాలు కుటుంబ ప్రేక్షకులకు నచ్చాయి. పైగా సమంత, నాగచైతన్య భార్యాభర్తలుగా నటించడం ఈ చిత్రానికి కలిసొచ్చింది. తెరపై కూడా నిజ జీవిత పాత్రలు పోషించడం మరింత బాగా నచ్చింది.
నాని చిత్రం 'జెర్సీ' కూడా క్రికెట్ నేపథ్యంలో సాగిందే. క్రికెట్ చుట్టూ తిరిగే సినిమా అంటే యువతరం సినిమా అయిపోతుంది. ఇక్కడ ఆట కంటే ఎమోషన్లు ఎక్కువ కట్టిపడేశాయి. ఓ వెటరన్ క్రికెటర్ మళ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాలనుకోవడం, అదీ తన తనయుడి కోసం కావడంతో ఫ్యామిలీ టచ్ ఇచ్చినట్టైంది. ఫలితం... నాని కెరీర్‌లో మరో హిట్టు.
సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం థ్రిల్లరూ... విన్నర్లూ!
తెలుగులో క్రైమ్ కామెడీలు చాలా వచ్చాయి. వెళ్లాయి. వాటిలో 'బ్రోచేవారెవరురా', 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రెండింటి జోనర్లు ఒక్కటే. కానీ ఎంచుకున్న కథాంశాలు, చూపించిన విధానాలు కొత్తగా ఉన్నాయి. ఒంగోలు జేమ్స్‌బాండ్ కథ 'ఏజెంట్ సాయిశ్రీనివాస.. 'చంటబ్బాయి'ని పోలిన పాత్ర చిత్రణ ప్రేక్షకుల్ని నవ్విస్తే.. కథలో ట్విస్టులు ఆసక్తిని పెంచాయి. చిన్న సినిమా దమ్ము చూపించేలా వసూళ్లు వచ్చాయి. 'బ్రోచేవారెవరురా' కూడా అంతే. ఓ మామూలు కిడ్నాప్ డ్రామా. అయితే ఆ కథని నడిపించిన విధానం కొత్తగా అనిపించింది. అడవిశేష్ - 'ఎవరు' ఓ సరికొత్త థ్రిల్లర్. ఓ హత్యోదంతం చుట్టూ తిరుగుతుంది. పతాక సన్నివేశాల్లో మలుపులు ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. పరిమిత వనరులతో తెరకెక్కించిన ఈ ముడు చిత్రాలూ విమర్శకుల ప్రశంసలు పొందాయి. స్టార్ హీరోలు, దర్శకులు సైతం సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రాల్ని ప్రోత్సహించారు.
సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'రాక్షసుడు' కూడా ఓ థ్రిల్లరే. 'రాచ్చసన్' చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం మనవాళ్లకూ నచ్చింది. ఓ సైకో కిల్లర్‌ని పట్టుకోవడానికి పోలీస్ అధికారి చేసే ప్రయత్నాలు ఉత్కంఠతని రేకెత్తించేలా సాగాయి. ఇదే ఏడాది విడుదలైన తాప్సి 'గేమ్ ఓవర్' కూడా ప్రేక్షకుల్ని మెప్పించింది. కల్యాణ్ రామ్ కథల ఎంపిక ఎప్పుడూ కొత్తగానే ఉంటుందన్న విషయం '118'తో మరోసారి రుజువైంది. ఓ అంకె చుట్టూ నడిచే కథని ఎక్కడా పట్టుసడలకుండా తెరకెక్కించారు దర్శకుడు కె.వి.గుహన్. కల్యాణ్ రామ్ ఇమేజ్‌కి తగ్గట్టు యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసుకుని, అవి కూడా కథలో భాగంగా వచ్చేలా జాగ్రత్త పడ్డారు. 'అర్జున్ సురవరం'ది మరోదారి. ఇది నిజాయతీగల పాత్రికేయుడి కథ. ఓ స్కామ్‌లో ఇరుక్కున్న కథానాయకుడు అందులోంచి ఎలా బయటపడ్డాడు? దోషుల్ని చట్టానికి ఎలా అప్పగించాడన్నది కథనం. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం మెరుగైన ఫలితం అందుకోవడం నిఖిల్ కెరీర్‌కి పెద్ద ఉపశమనం.
సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం కథానాయకుడు సందీప్ కిషన్ ఈ ఏడాది నిర్మాతగా అవతారం ఎత్తాడు. 'నిను వీడని నీడను నేనే'తో. హారర్‌కు, థ్రిల్ జోడించిన చిత్రమిది. ఈ సినిమాలో భయం కంటే ఉత్కంఠతకు చోటివ్వడం వల్ల మరింత మందికి చేరువైంది.
కథ ఎక్కడిదైతేనేం..?
కదిలితే కాలునొప్పి, మాట్లాడితే మెడ నొప్పి అని కాళ్లు చాపుకుని కూర్చునే బామ్మ ఒక్కసారిగా భామలా మారిపోయి, సీతాకోక చిలుకలా రెక్కలు విప్పుకుని ఎగురుతుంటే ఎంత విచిత్రం? ఆ విచిత్రమే 'ఓ బేబీ'లో కనిపించింది. లక్ష్మి.. సమంతలా మారిపోవడం ఈ సినిమాలో మ్యాజిక్. ఇది మన కథేం కాదు. ఓ విదేశీ చిత్రానికి రీమేక్. అయితే మన తెలుగు వాళ్లకు కావల్సిన దినుసులన్నీ చక్కగా వేసి, ఓ విందు భోజనం తయారు చేశారు దర్శకురాలు నందినిరెడ్డి. వరుణ్‌తేజ్ పూర్తిగా మాస్ బాట పట్టిన 'గద్దలకొండ గణేష్' కూడా రీమేక్ కథే. అయితే పరాయి కథల్ని తనదైన శైలిలో ఎలా పండించాలో తెలిసిన హరీష్ శంకర్ తన బాధ్యతని చక్కగా నిర్వహించాడు. 'ఎల్లువొచ్చె గోదారమ్మా' పాట ఓ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం విజయం బ్రహ్మపదార్థం ఏమీ కాదన్న విషయాన్ని ఈ చిత్రాలు నిరూపించాయి. సరైన ప్రణాళిక, కొత్త ఆలోచనలుంటే.. తప్పకుండా ‘హిట్టు’ అందుకోవొచ్చు. కాకపోతే ఆ చిత్రాల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నూటికి 80 చిత్రాలు చిన్న బడ్జెట్‌తోనే రూపొందుతున్నాయి. వాటిపైనే పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కథల ఎంపికలో కొత్తదనం చూపించడం, కొత్త తరహా ప్రయత్నాలు, ప్రయోగాలు చేయడం నేర్చుకుంటే చిన్న సినిమాలకు మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది.
సరికొత్త కథకే ప్రేక్షకుల నీరాజనం