కొత్తదనమే కాదు.. కొత్త తరాన్ని ఆహ్వానించడంలోనూ ముందుంటుంది తెలుగు చిత్రసీమ. కాస్త ప్రతిభ ఉందని తెలిస్తే చాలు.. అవకాశాలతో వాళ్లకి పట్టం కడుతుంది. అలా రాత్రికి రాత్రే స్టార్లుగా అవతరించిన వాళ్లు ఎంతోమంది. ఇక కథానాయికలకైతే మరిన్ని వెసులుబాట్లు ఉంటాయి. తెలుగులో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య బాగా ఎక్కువ. ఏటా 150కి పైగా సినిమాలు పట్టాలెక్కుతుంటాయి. ప్రతి సినిమాకీ హీరోయిన్ కావాల్సిందే. మన దగ్గరేమో నాయికల కొరత. దాంతో ఏటా పదుల సంఖ్యలో కొత్త తారలు తెలుగు తెరపై మెరుస్తుంటారు. సరికొత్తగా మురిపిస్తుంటారు. ఈసారి కూడా ఆ సంఖ్య ఎక్కువే. అగ్ర హీరోల చిత్రాల కోసం పొరుగు భాషల నుంచి కూడా వచ్చారు.
భాషల పరంగా హద్దులు చెరిగి పోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా సాగుతోంది. అందుకే భాషతో సంబంధం లేకుండా కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ తారలు ఒకప్పుడు ప్రాంతీయ భాషల్లో నటించేందుకు అంతగా ఆసక్తి చూపేవాళ్లు కాదు. హిందీలో కాకుండా, వేరే భాషలో నటిస్తే తమ స్థాయి తగ్గినట్టుగా భావిస్తారేమో అని భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంచి కథ, తగిన పారితోషికం లభిస్తే చాలు... పచ్చజెండా ఊపేస్తున్నారు. అలా ఈ ఏడాది బాలీవుడ్ నాయికలు విద్యాబాలన్, శ్రద్ధాకపూర్ తెలుగు తెరపైన తొలిసారి మెరిశారు. ఆలియాభట్ 'ఆర్.ఆర్.ఆర్' కోసం సంతకం చేసింది. ఇక కియారా అడ్వాణీ అయితే గతేడాదే తెలుగులో అడుగుపెట్టింది. ఈసారి 'వినయ విధేయ రామ'లో నటించి ఆకట్టుకుంది. అగ్ర కథానాయకులకి జోడీగా ఓ కొత్త తార కావాలి అనిపించిన ప్రతిసారీ తెలుగు దర్శకనిర్మాతలు బాలీవుడ్‌వైపే చూస్తుంటారు. దాంతో ఎప్పుడు ఎవరైనా మన తెరపై మెరవొచ్చన్నమాట.
'ఎన్టీఆర్' చిత్రాల కోసం
విద్యాబాలన్ తెలుగు సినిమా చేయడం గురించి తరచూ ప్రచారం సాగేది. అగ్ర కథా నాయకుల చిత్రాల కోసం ఆమెని తరచూ సంప్రదించే వారు. కానీ అక్కడి సినిమాలతో బిజీగా ఉండటం, కథ నచ్చకపోవడం లాంటి కారణాలతో ఆమె తెలుగులో చేయడం సాధ్యం కాలేదు. ప్రతిష్ఠాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ కోసం కెమెరా ముందుకొచ్చారు. ఎన్టీఆర్ అర్ధాంగి బసవరామ తారకం పాత్రలో విద్యా నటించింది. ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ చిత్రం తర్వాత విద్యాబాలన్ తెలుగు సినిమాలపై ప్రేమని పెంచుకుంది. తగిన పాత్ర ఎప్పుడొచ్చినా ఇక తెలుగులో చేస్తానని చెప్పిందామె. మరో నాయిక శ్రద్దా కపూర్ 'సాహో'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది.