ఓ చిత్రం విజయం సాధించాలంటే కథాబలం ఎంత అవసరమో.. ఆ కథను నడపించే సంభాషణలు, కథలో అనుగుణంగా వచ్చే గీతాలు అంతే అవసరం. అలా అన్నీ పొందికగా కుదిరాయి కాబట్టే.. 'నువ్వే కావాలి' అంతటి ఘన విజయాన్ని అందుకుంది. సుదీర్ఘ సంభాషణలే కానీ అప్పటివరకూ తెలుగు సినిమాకి పెద్దగా పరిచయం లేని పంచ్ డైలాగ్ లతో రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం కదం తొక్కితే.. సుస్వరాల మాంత్రికుడు కోటి అందించిన సంగీతం ఈ సినిమాకు ఎన్నటికీ వన్నెతరగని వర్ణాలను అద్దింది.
సంభాషణలే ప్రాణం
'ఇడ్లీనా.. డెడ్లీగా ఉంటుంది', 'పాలంటే ఎలర్జీ, కానీ పాలే ఎనర్జీ', 'నీకు ఉదయమే అయింది, నాకు జ్ఞానోదయం కూడా అయింది' క్లుప్తంగా ఇలాంటి పంచ్ ఉన్న డైలాగ్‌లు అంతకుముందు తెలుగు సినిమాల్లో వినపడింది లేదు. దీనికి ఆద్యుడు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతకు ముందు విజయ్ భాస్కర్‌తో కలిసి 'స్వయంవరం' సినిమాలో ఇదే తరహా డైలాగులు కొన్ని రాసిన త్రివిక్రమ్ రచనాశైలి.. తెలుగు ప్రేక్షకులను రంజింప చేసింది. కేవలం పంచ్ డైలాగ్‌లే కాదు, కామెడీ సీన్లూ ఈ సినిమాలో అద్భుతంగా పండాయి.
సునీల్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మెల్కొటే- కోవై సరళ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సునీల్‌కు కూడా ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. శరీరాలు వేరు ఆత్మ ఒక్కటే అన్నట్లుంటేలా తరుణ్, రిచాల పాత్రలను తీర్చిదిద్దిన వైనం.. యుక్తవయస్సులో కలిగే ప్రేమ, సున్నితమైన ఆ భావోద్వేగాలు ఇలా అన్ని సంభాషణలను త్రివిక్రమ్ - విజయ్ భాస్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారు.
నువ్వే కావాలి సినిమాలోని కొన్ని డైలాగులు
- "వెళ్లిపోవడం తప్పదని తెలిసినప్పుడు ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది. మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం కష్టం!"
- గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పగలం. కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్లతోనే చెప్పగలం
- మంట దూరంగా ఉంటే వేడి తెలీదు. మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలీదు.
- ఇష్టపడితే భయపడకు. భయపడితే ఇష్టపడకు. ఇష్టపడి, భయపడితే బాధపడకు