తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రేమ, పెళ్లి, కుటుంబం.. ఓ మజిలీ - naga chaitanya

'నిన్ను కోరి'తో మెప్పించిన శివ నిర్వాణ.. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మజిలీ. ఈ రోజు విడుదలైన సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. కథ, కథనం, నటన, దర్శకత్వంపై ఈటీవీ భారత్ ఇస్తున్న రివ్యూ.

మజిలీ చిత్రంలో నాగ చైతన్య, సమంత

By

Published : Apr 5, 2019, 5:21 PM IST

Updated : Apr 5, 2019, 5:49 PM IST

టాలీవుడ్ హిట్ పెయిర్ నాగచైతన్య, సమంత మరోసారి జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. "ఎక్కడ ప్రేముంటుందో అక్కడే బాధ కూడా ఉంటుందనే" కథాంశంతో తెరకెక్కింది. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నిజజీవితంలో భార్యాభర్తలైన సమంత- చైతూ జోడి.. తెరపై ఎలా నటించారు, దర్శకుడు శివ ద్వితీయ విఘ్నాన్ని దాటాడో.. లేదో.. తెలుసుకుందాం.

కథేంటి ?

విశాఖ రైల్వే క్వార్టర్స్​లో ఉంటూ ఐటీఐ చదివే పూర్ణ (నాగచైతన్య) కు.. రైల్వే జట్టు నుంచి భారత్ క్రికెట‌ర్‌గా ఎద‌గాల‌నేది క‌ల‌. ఆ ప్రయత్నంలో ఉండ‌గానే అతని జీవితంలోకి అన్షు (దివ్యాంశ కౌశిక్) వ‌స్తుంది. ఇద్దరి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ అన్షు ఇంట్లోవారు పెళ్లికి అంగీకరించరు. ఆమెకి మ‌రో అబ్బాయితో పెళ్లి చేస్తారు. కొన్నాళ్ల త‌ర్వాత పూర్ణకి కూడా ఎదురింటి అమ్మాయి శ్రావ‌ణి (సమంత) తో పెళ్లి జ‌రుగుతుంది. అన్షు ప్రేమను మరిచిపోలేని పూర్ణ.. శ్రావ‌ణిని కూడా దూరం పెడతాడు. తను కూడా భర్త ప్రేమను అర్థం చేసుకుని కాలం వెళ్లదీస్తుంటుంది. కొన్నేళ్లు గడిచాక.. వీరిద్దరి జీవితాల్లోకి మీరా అనే పాప వస్తుంది. ఆ పాప ఎవరు? తన వల్ల పూర్ణ, శ్రావణిలు భార్యాభర్తలుగా ఎలా ఒక్కటయ్యారనేదే మజిలీ కథ.

దర్శకుడి పనితీరు

'నిన్ను కోరి' చిత్రంతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న శివ.. రెండోసారి కూడా ప్రేమలు, బంధాలు, భావోద్వేగాల చుట్టే మజిలీ కథను అల్లుకున్నాడు. పెళ్లికి ముందు, పెళ్లి త‌ర్వాత ఒక జంట జీవితం ఎలాంటి మజిలీకి చేరిందనేది చెప్పాడు. తొలి స‌గ‌భాగం కుటుంబం, స్నేహం, ప్రేమ‌, జీవితంలో అనుకున్నది సాధించాల‌నే త‌ప‌న త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో సాగుతుంది. రెండో భాగం మాత్రం ప్రేమలోనూ, కెరీర్​లోనూ పరాజితుడైన భర్తను ఓ భార్య తన ప్రేమతో ఎలా మార్చుకోగలిగింది అనే అంశంతో సినిమా ముగిస్తుంది. ద్వితీయార్ధంలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల మధ్య నడిచే కథలోనూ హాస్యాన్ని మేళవించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో చైతు, సమంతల మధ్య జరిగే సంభాషణలు మెప్పిస్తాయి. ప్రేమంటే తీసుకోవడమే కాదు.. ప్రేమంటే ఇవ్వడమే అన్న విష‌యాన్ని నాగ‌చైత‌న్యతో చెప్పించిన తీరు ఆక‌ట్టుకుంటుంది.

నటనతో మెప్పించారు
నాగ‌చైత‌న్య‌, స‌మంతల న‌ట‌న ఈ చిత్రానికి ప్రధాన బలం. చైతన్య యువ ప్రేమికుడిగా, భర్తగా రెండు కోణాల్లో కనిపిస్తూ అలరించాడు. సమంత నటన మజిలీని మరోస్థాయికి చేర్చిందనే చెప్పొచ్చు. చై, సామ్ మ‌ధ్య టీనేజ్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు యువతరం గుండెల్లో ప్రేమ బాణాలై గుచ్చుకుంటాయి.

కొత్త అమ్మాయి దివ్యాంశ కౌశిక్ కూడా పాత్ర ప‌రిధి మేర‌కు చక్కగా నటించింది. నాగ‌చైత‌న్య తండ్రిగా రావు ర‌మేశ్‌, స‌మంత తండ్రిగా పోసాని కృష్ణముర‌ళి చక్కటి వినోదాన్ని పండించారు. గోపీసుందర్ పాటలు, తమన్ నేపథ్య సంగీతం మజిలీకి ప్రత్యేక ఆకర్షణ. ద‌ర్శకుడిగా శివ నిర్వాణ ర‌చ‌న ప‌రంగా, ద‌ర్శక‌త్వం ప‌రంగానూ త‌న మార్కును చూపించుకోగలిగారు. ద్వితీయ యజ్ఞాన్ని విజయవంతంగా దాటి 'మజిలీ'ని హిట్ ట్రాక్ ఎక్కించాడు.

ఇవీ చూడండి.. కోటి మంది సాక్షిగా 'బ్రహ్మస్త' లోగో మేకింగ్​

Last Updated : Apr 5, 2019, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details