మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్-దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన 'మగధీర'.. అప్పట్లో బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. కెరీర్లో రెండో సినిమాతోనే చరణ్‌కు స్టార్ హోదాను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి నేటితో(జులై 31) 12 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సినిమా గురించి రాజమౌళి అప్పట్లో చెప్పిన విశేషాలను గుర్తుచేసుకుందాం.
యాక్షన్ సన్నివేశాలే కీలకం..
'మగధీర' సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రారంభంలో బైక్ స్టంట్, కాలభైరవుడిగా 100 మంది శత్రువులతో రామ్‌చరణ్ ఫైట్ ఇలా ప్రతి సీన్ ఒకదానిని మించి మరొకటి ఉంటుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ వీటికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. అయితే, బైక్ స్టంట్ సన్నివేశం తీసేటప్పుడు పీటర్ హెయిన్స్ తీవ్రంగా గాయపడ్డారట. ఓ సందర్భంలో రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు.
"మగధీర'లో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాం. ముఖ్యంగా కత్తి యుద్ధం జరిగే సన్నివేశాలు సహజంగా చేయాలనుకున్నాం. హీరోతో సహా, పోరాడే వారందరూ కత్తిని ప్రత్యేకంగా పట్టుకున్నట్లు కాకుండా, చేతిలో ఒక భాగంలా ఉండాలని స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్‌కు చెప్పా. దీంతో అతను అందరికీ కొన్ని రోజులు కత్తి యుద్ధంలో శిక్షణ ఇద్దామని అన్నాడు. అలాగే చేశాం. ప్రతి సన్నివేశం తీసేముందు పీటర్ తనే స్వయంగా రిహార్సల్స్ చేసి చూపిస్తాడు. ఒకటి రెండుసార్లు సరే అనుకున్న తర్వాతే హీరోతో చేయిస్తాడు. అన్నింటికన్నా బైక్ స్టంట్ క్లిష్టమైంది. ఎందుకంటే ఆ స్టంట్ చేసేటప్పుడు రామ్‌చరణ్ అక్కడ ఉన్న రాడ్‌పై నుంచి, బైక్ దాని కింద నుంచి వెళ్లాలి. దీంతో ఆ బైక్ స్టంట్ కూడా రెండు మూడు సార్లు చేశాడు పీటర్. ఆ తర్వాత చరణ్‌కు చెబితే తను కూడా పర్‌ఫెక్ట్‌గా చేశాడు. ఇంకా బాగా రావాలని మరోసారి కూడా చేశాడు. ఆ షాట్ అయిపోయింది. ఇక బైక్ ల్యాండ్ అయ్యే షాట్ మిగిలింది."
"దీంతో ఆ సీన్ కోసం పీటర్ కేబుల్స్ చెక్ చేశాడు. రెండు సార్లు రిహార్సల్స్ కూడా చేశాడు. అయితే, బైక్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం ఎగిరి ముందుకు వెళ్లాలని చెప్పా. ఆ షాట్ కావాలని ట్రై చేస్తున్న సమయంలో డీసీఎం నుంచి వైర్ జారిపోయి నిదానంగా దిగాల్సిన బైక్ 18-19 అడుగుల పైనుంచి పడింది. కింద పడగానే ముఖానికి దెబ్బలు తగలకుండా పీటర్ చేతులు అడ్డుపెట్టుకున్నాడు. అయినా కూడా రెండు మోచేతులతో పాటు, తలకు కూడా దెబ్బలు తగిలాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎక్స్‌రేలు తీసిన తర్వాత నాలుగు నెలలు కదలకూడదని డాక్టర్లు చెప్పారు. అయితే నేను వెళ్లిన తర్వాత పీటర్ చెప్పిన మొదటి మాట 'సర్ నాకు 10 రోజులు టైమ్ ఇవ్వండి. మీకు నచ్చినట్లు ఆ సీన్ చేస్తా' అన్నాడు. అప్పుడు నేను అతనికి ఒక్కటే చెప్పా. 'ఒక వేళ అవసరమైతే ఆ సీన్ సినిమా నుంచి తీసేస్తా కానీ, నువ్వు లేకుండా ఆ సీన్ వేరే వాళ్లతో తీయను. నీ ఆరోగ్యం జాగ్రత్త' అని చెప్పా. సరిగ్గా నెలరోజుల తర్వాత సెట్‌కు వచ్చాడు. అతని ఆధ్వర్యంలోనే ఆ సీన్ తీశాం" అని రాజమౌళి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.