తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇట్స్ ట్రూ: కుబేరులందు.. అక్షయ్​ కుమార్ వేరయా! - khiladi akshay kumar

ఫోర్బ్స్‌ జాబితాల్లోకి ఎక్కడం మన సినిమా స్టార్లకి కొత్తేమీ కాదుకానీ... బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఈసారి అందుకున్న స్థానం చాలా ప్రత్యేకమైంది. అత్యధిక ఆర్జన ఉన్న ప్రపంచ సెలబ్రిటీల్లో భారతదేశం నుంచి ఈసారి కూడా అతనొక్కడికే స్థానం దక్కింది! కేవలం సంపాదన గురించే కాదు ఎన్నడూలేనివిధంగా అతని దానగుణాన్నీ ఈ ఏడాది ప్రస్తుతించింది ఫోర్బ్స్‌! అక్షయ్‌ని మిగతా సంపన్నుల మధ్య విభిన్నంగా నిలుపుతున్న అంశం ఇదే. దాని వెనక అతని సినిమాలని మించిన సెంటిమెంటు కూడా ఉంది! అదేమిటో అతని మాటల్లోనే...

Bollywood star akshay kumar about his father and his place in Forbes list
కుబేరులందు.. అక్షయ్​ కుమార్ వేరయా!

By

Published : Jun 16, 2020, 5:42 PM IST

కరోనా వచ్చినప్పటి నుంచీ అందరిలాగే నేనూ ఇంటికే పరిమితమైపోయాను. సినిమాల్లోకి వచ్చాకే కాదు నాకు ఊహవచ్చినప్పటి నుంచీ ఇంత ఖాళీగా ఉన్నది లేదు. అందుకే, టెక్నాలజీని వాడుకుంటూ కొన్ని ప్రకటనల్లో నటించడం మొదలుపెట్టాను. ఇంట్లో ఉంటూనే కరోనా బాధితుల కోసం రూ.30 కోట్లు విరాళంగా ఇచ్చాను.

ఈ పనుల్లో ఉండగానే ఫోర్బ్స్‌ వాళ్లు ఫోన్‌ చేశారు... ‘అక్షయ్‌! కరోనాతో సినిమాలు లేకపోవడం, రూ.30 కోట్లు దానమివ్వడం... వీటితో మీ ఆర్జన తగ్గింది కదా... ఈసారి వందమంది సెలబ్స్‌ జాబితాలో మీరు ఉంటారా!’ అని అడిగారు. ‘లేకపోయినా ఫర్వాలేదులెండి!’ అని చెప్పాను.

కానీ, ఈసారి కూడా ఆ లిస్టులో నా పేరుంది. 2016 నుంచీ ఆ జాబితాలో నేనుంటున్నా... ఈసారి వాళ్లు నా సంపాదనతోపాటూ నా సేవాగుణాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరోనా కోసం భూరి విరాళమిచ్చిన ఏకైక భారతీయ స్టార్‌నంటూ ప్రశంసించారు. నిజానికి, నా ఆర్జన కంటే ఈ రకంగా వచ్చిన గుర్తింపే నాకు ఎక్కువ సంతృప్తినిస్తోంది. ఎందుకంటే... ఆ సేవాగుణానికి ప్రేరణ మా నాన్న కాబట్టి... ఆయన మరణం కాబట్టి.

‘ఓం నమశ్శివాయ...’ - మా ఇంట్లో ప్రతి శనివారం ఈ మంత్రం వినిపిస్తూ ఉండాల్సిందే. ఆ వినిపించడం దేవుడి పటం ముందు నుంచి కాదు స్నానాల గదిలో నుంచి! నాన్న ప్రతి శనివారం నన్ను స్నానాల గదిలో కింద కూర్చోబెట్టి నీళ్ల బకెట్‌ని తన చేతుల్లోకి తీసుకుని ధారగా నా తలపైన పోస్తుండేవారు! అలా పోస్తూ ‘ఓం నమశ్శివాయ...’ అని నిష్ఠగా చెబుతుండేవారు. ‘ఎందుకు నాన్నా ఇలా చేస్తున్నావ్‌...!’ అని అడిగితే ‘నువ్వు నాకు ఆ శివయ్యలాంటివాడివి. అందుకే వారంవారం నీకిలా అభిషేకం చేస్తున్నా!’ అంటూ నవ్వేవారు. పదమూడేళ్లు వచ్చేదాకా ఆయన నన్నిలా అభిషేకించడం కొనసాగుతూనే ఉండేది.

ఆ అలవాటు వల్లే అనుకుంటా నటుడిగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా... ఇంట్లో అత్యాధునిక షవర్‌ వసతులున్నా... బకెట్‌తో నీళ్లు పెట్టుకునే స్నానం చేస్తుంటా. ఓ రకంగా ప్రతిరోజూ ఉదయం నాన్నని స్మరించుకునే సందర్భం అది. చదువు సరిగ్గా బుర్రకెక్కనివాణ్ణి, ఆటలు తప్ప ఇంకేమీ తెలియనివాణ్ణి... ఇప్పుడిలా ఓ పెద్ద స్టార్‌నయ్యానంటే, సేవాగుణం ఉన్న మనిషిగా పేరు తెచ్చుకున్నానంటే... అంతా నాన్న చలవే!

నాన్న మాటలే...

నాన్న హరి ఓం భాటియా ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. మొదట్లో దిల్లీలో ఉన్న మేము ఆయనకి యునిసెఫ్‌లో అకౌంటెంట్‌గా ఉద్యోగం రావడంతో ముంబయి వెళ్లాం. మా ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ క్రమశిక్షణ ఉండేది. ఆరునూరైనా అందరం ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచి వ్యాయామం చేయడం తప్పనిసరి! వ్యాయామంతోపాటూ తప్పకుండా సూర్యోదయాన్ని చూసితీరాలనేవారు నాన్న. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కరోజూ నేను ఆ అలవాటు మానలేదు.

ముంబయి డాన్‌బాస్కో స్కూల్లో చదివాన్నేను. అన్ని సబ్జెక్టుల్లోనూ సగటు కంటే తక్కువ మార్కులే వచ్చేవి. నాన్న దగ్గరకి దిగాలుగా ప్రోగ్రెస్‌ కార్డు తీసుకెళితే ‘పాస్‌ అవుతున్నావు కదా... అది చాలు బేటా!’ అనేవారు. ఫుట్‌బాల్‌, వాలీబాల్‌-లో నా చిన్నచిన్న విజయాలనే పెద్దగా సెలబ్రేట్‌ చేసేవాడు. నేను వాలీబాల్‌ పోటీలకి వెళ్లిన ప్రతిసారీ పెద్ద టిన్నులో పాలు తీసుకొచ్చేవారు. ఆ పాలని నాకూ మా జట్టుకే కాదు, మా ప్రత్యర్థి జట్టుకీ ఇచ్చేవారు. అదేమిటీ ‘వాళ్లు బలం తెచ్చుకుంటే మనకే కదా నష్టం’ అంటే ‘ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు కాదు... బలంగా ఉన్నప్పుడు ఓడిస్తేనే అసలైన విజయం’ అనేవారు. నేను వ్యక్తిత్వ వికాస పుస్తకాలేవీ చదవకున్నా ఇలా నాన్నని చూస్తూ పెరగడమే నా వ్యక్తిత్వాన్ని నిర్మించిందని చెప్పాలి.

వెయిటర్‌గా పనిచేశాను...

ఏడో తరగతిలో ఉండగా కరాటే శిక్షణలో చేర్పించారు. అప్పటి నుంచి అదే నా ప్రపంచమైంది. ఇంటర్‌లో చేరాక కూడా నా మనసు అటువైపే లాగుతుండేది. ఆ విషయం నాకన్నా ముందే తెలుసుకున్నారేమో ఇంటర్‌ పూర్తికాగానే నేను బ్యాంకాక్‌ వెళ్లి మువో థాయ్‌(థాయ్‌ల్యాండ్‌ బాక్సింగ్‌) నేర్చుకుంటానని చెబితే అప్పటిదాకా తాను దాచుకున్న సొమ్ము మొత్తం నా చేతిలో పెట్టి ‘జాగ్రత్తగా వెళ్లిరా!’ అన్నారు.

ఆ డబ్బుతోనే బ్యాంకాక్‌ వెళ్లాను. అక్కడి ఇన్‌స్టిట్యూట్‌లో ఫీజుకట్టినా నా రోజువారీ భోజనం, బసకి ఇబ్బంది వచ్చింది. దాంతో అక్కడే ఓ రెస్టరెంట్‌లో వెయిటర్‌గా పనిచేశాను. నాలుగేళ్ల తర్వాత థాయ్‌ బాక్సింగ్‌ నేర్చుకుని ముంబయి వచ్చి మార్షల్‌ ఆర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టాలనుకున్నాను. కానీ అప్పటికే అక్కడ అద్దె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అద్దెకు సరిపడా డబ్బు సంపాదించడం కోసమే కోల్‌కతాలో ఓ ట్రావెల్‌ ఏజెన్సీలోనూ, బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఓ హోటల్‌లోనూ ఉద్యోగం చేశాను. దిల్లీలో కుందన్‌లు అమ్మే వ్యాపారిగానూ అవతారమెత్తాను! రెండేళ్లలో నాకు కావాల్సిన డబ్బు చేతికొచ్చింది. ముంబయిలో మార్షల్‌ ఆర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టాను.

స్టంట్‌ ఆర్టిస్టుగా...

మా ఇన్‌స్టిట్యూట్‌కి వస్తున్న ఓ విద్యార్థి తండ్రి మోడల్‌ కో-ఆర్డినేటర్‌గా ఉండేవాడు. అతనే ఓసారి మోడలింగ్‌ చేయమని పట్టుబట్టి మరీ ఓ యాడ్‌ ఏజెన్సీ దగ్గరకు తీసుకెళ్లాడు. తొలిసారి ఓ ఫర్నిచర్‌ యాడ్‌కి పనిచేశా. ఇన్‌స్టిట్యూట్‌లో నేను నెలంతా కష్టపడితే మూడువేల రూపాయలు వస్తే... మోడలింగ్‌లో ఓ మూడుగంటలు పనిచేసినా పదివేల రూపాయలొచ్చేది! దాంతో దానిపైనే ఎక్కువగా దృష్టిపెట్టడం మొదలుపెట్టాను. నా ఫొటోలతో పోర్ట్‌ఫోలియో తయారు చేసుకుని స్టూడియోలకెళితే స్టంట్‌ ఆర్టిస్టుగా, గ్రూపు డ్యాన్సర్‌గా చిన్న చిన్న అవకాశాలిచ్చారు. నెలతిరిగేసరికల్లా రూ.15 వేలు వచ్చేవి... ఆ కాస్త డబ్బు కోసమే వెళ్తుండేవాణ్ణి. అలా వెళ్తుండగానే ఓ సారి ప్రఖ్యాత దర్శకుడు మహేశ్‌భట్‌ సినిమా ‘ఆజ్‌’లో హీరోయిన్‌కి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించే వ్యక్తిగా నటించే అవకాశం వచ్చింది.

నేను తొలిసారి తెరపైన కాస్త ఎక్కువ సమయం కనిపించింది(ఏడు సెకన్లు!) అప్పుడే. ఆ సినిమాలో హీరో పేరు అక్షయ్‌. మహేశ్‌భట్‌ ఎప్పుడూ ‘అక్షయ్‌..’ అంటూ పిలుస్తూ ఉండటం వల్లేమో ఆ పేరు నాకు బాగా నచ్చింది. ఆ రెండేరోజే కోర్టుకి వెళ్లి ‘రాజీవ్‌’ అనే నా పేరుని అక్షయ్‌కుమార్‌గా రిజిస్టర్‌ చేసుకున్నాను! రెండేళ్ల తర్వాత నాకో పెద్ద కంపెనీకి మోడలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఆరుగంటలకి బెంగళూరుకి రమ్మని ఫ్లైట్‌ టిక్కెట్‌ కూడా పంపారు. కానీ ఏ ఆరుగంటలో చెప్పలేదు... నేను సాయంత్రం ఆరు అనుకుని ఇంట్లో వర్కవుట్స్‌ చేస్తూ ఉండిపోయాను. చూస్తే అది ఉదయం ఆరుగంటలట! ఓ మంచి అవకాశం పోయిందనే బాధతోనే ఆడిషన్‌కి వెళ్లాను. వాళ్లు ఆడిషన్స్‌ చేసి ‘యూ ఆర్‌ సెలెక్టెడ్‌’ అన్నారు. ఏ పాత్రకండీ అంటే ‘హీరోగానే’ అనేశారు. స్పృహతప్పి పడిపోయేంతగా ఆశ్చర్యపడిపోయాను. నన్ను అలా ఆడిషన్‌ చేసిన వ్యక్తి దర్శకుడు ప్రదీప్‌ చక్రవర్తి. ఒకటికాదు... ఒకేసారి మూడుచిత్రాలకి నన్ను బుక్‌ చేశాడాయన. మొదటి చిత్రానికి ఐదువేలూ, రెండో చిత్రానికి 50 వేలూ, మూడో చిత్రానికి రూ.1.5 లక్ష రూపాయల చెక్‌లు నా చేతికి ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా నేను సైన్‌ చేసిన సమయం సరిగ్గా సాయంత్రం ఆరుగంటలు!

‘మస్త్‌... మస్త్‌’ హీరోనైపోయా!

అలా ‘దీదర్‌’లో హీరోగా నటించాను. కానీ మొదటి సినిమా ఆలస్యమై, నేను నటించిన రెండో సినిమా 1991లో ‘సౌగంధ్‌’ మొదట విడుదలైంది. అది హిట్టయింది. ఆ తర్వాతి ఏడాది ‘ఖిలాడి’ రిలీజైంది. కెరీర్‌లో అదే నాకు పెద్ద మలుపు. ఆ తర్వాత ‘మై కిలాడీ తూ అనారీ’ సినిమాలోని ‘తూ చీజ్‌ బడీహై మస్త్‌ మస్త్‌’ పాట నన్ను అప్పట్లోనే భాషలకి అతీతంగా భారతదేశం మొత్తానికీ చేరువ చేసింది. అప్పటి నుంచి ఏడాదికి సగటున మూడు సినిమాలు ఉండేలా చూసుకుంటున్నాను.

ఇప్పటిదాకా 156 సినిమాల్లో నటించాను. వీటిల్లో తెలుగు/తమిళంలోచేసిన ‘2.ఓ’ సహా ఐదు సినిమాలు వందకోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి! హీరోగా మారిన కొత్తల్లో జీవితాంతం కష్టపడి ఓ పదికోట్లు సంపాదిస్తే చాలు అనుకునేవాణ్ణి. ఐదేళ్లలోనే ఆ మైలురాయి అందుకున్నాను. ఆశకి అంతెక్కడిది?! ఆ తర్వాత నా లక్ష్యం వందకోట్ల రూపాయలకు మారింది. వందకోట్లకు చేరువయ్యాక ఇక నేను మళ్లీ డబ్బు గురించి ఆలోచించిన సందర్భాలే లేవు. నేను ఇలా పనీ, డబ్బూ అంటూ తిరుగుతుండగానే నాన్న ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఆయనకి క్యాన్సర్‌ వచ్చింది.

అందుకే సేవ వైపు...

క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా నాన్నకి కీమో థెరపీ ఇప్పించడం కోసం నేనే ఆసుపత్రికి తీసుకెళుతూ ఉండేవాణ్ణి. అలా తీసుకెళుతున్నప్పుడే నా చేతుల్లోనే కన్నుమూశారు! ఆయన జ్ఞాపకాలు పదిలం చేయాలనే... సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. నాన్నకి కీమో థెరపీ కోసం వెళ్లినప్పుడు మారుమూల గ్రామాల నుంచి వచ్చే సైనికులు రెండురోజులపాటు ముంబయిలో తలదాచుకునే స్థలం లేక ఇబ్బందులు పడుతుండేవారు. అలాంటివాళ్ల కోసం నాన్న పేరుతో ‘హరి ఓం’ ఏసీ షెల్టర్‌లు నిర్మించి ఇచ్చాను.

పారా మిలటరీ వీరుల కుటుంబాలని ఆదుకోవడం కోసం ‘భారత్‌ కా వీర్‌’ యాప్‌, వెబ్‌సైట్‌ రూపొందించి ప్రభుత్వానికిచ్చాను. ఇప్పటిదాకా వాటి ద్వారా 59 కోట్ల రూపాయలు వస్తే... ప్రతి కుటుంబానికీ 15 లక్షల రూపాయలదాకా ఇస్తున్నాను! కరోనా లాక్‌డౌన్‌ వేళ ప్రధాని మోదీ సహాయనిధి కోసం రూ.25 కోట్లూ, డాక్టర్లూ, ఇతర వైద్య సిబ్బంది సంరక్షణ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు అందించాను. రాఘవ లారెన్స్‌ కాంచన హిందీ వెర్షన్‌ ‘లక్ష్మీ బాంబు’ సినిమా చేస్తున్నాను! ఆ సినిమా చేస్తూ హిజ్రాల సంక్షేమం పట్టించుకోకపోతే ఎలా... అందుకే లారెన్స్‌ కోరిక మేరకు చెన్నైలో వాళ్ల కోసం ఓ షెల్టర్‌ కట్టించాను. ‘నాన్న బతికే ఉంటే... ఆయన చేతిలో ఇన్ని కోట్ల రూపాయలే ఉంటే... వీళ్ల కష్టాలు చూస్తే... ఏంచేస్తాడు?’ అని ఎప్పటికప్పుడూ ప్రశ్నించుకుంటూనే ప్రతిదీ చేస్తున్నాను!

అచ్చమైన ఫ్యామిలీ మ్యాన్‌ని!

ఉదయం నాలుగు గంటలకి మొదలవుతుంది నా దినచర్య... నా బాలీవుడ్‌ మిత్రులు కొందరు పార్టీలు ముగించి ఇంటికొచ్చే సమయం అది! లేచి రెండున్నర గంటలపాటు కసరత్తులు చేస్తాను. ఏడుగంటలకంతా పిల్లలతోపాటూ బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తవుతుంది. మావాడు ఆరవ్‌, కూతురు నితార ఇంట్లో ఉంటే ఆ ఇద్దరి మధ్య వచ్చే తగవు తీరుస్తూ ఉంటాను కచ్చితంగా తొమ్మిది గంటలకి షూటింగ్‌ స్పాట్‌లో ఉంటాను. ఏడున్నరకి బయటకొచ్చి తొమ్మిదిన్నర దాకా భార్యాపిల్లలతో గడుపుతాను. ముఖ్యంగా నా భార్య ట్వింకిల్‌ ఖన్నాతో పేకాడి ఓడిపోవడమంటే చాలా సరదా నాకు!

ఎట్టిపరిస్థితుల్లోనూ పది గంటల్లోపల పడుకుంటాను. ఇప్పుడే కాదు సినిమాలకి వచ్చినప్పటి నుంచీ ముప్ఫై ఏళ్లుగా ఇదే నా దినచర్య!

ABOUT THE AUTHOR

...view details