జీమెయిల్, యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాల్లోని నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్ వర్క్‌స్పేస్‌లోకి లాగిన్ కాలేకపోతున్నామని వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్‌లోనూ వీడియోలు చూడడంలో ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయారు. యూట్యూబ్ సహా జీమెయిల్ పని చేయట్లేదని యూజర్లు స్క్రీన్ షాట్లు పెట్టారు. అలాగే ట్విట్టర్లో తమ జీమెయిల్‌ను సైన్ ఇన్ చేయగా ఓపెన్ కావట్లేదని ట్వీట్లు చేశారు.
జీమెయిల్.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగించే ఈమెయిల్ సర్వీస్. అనేక సంస్థలు, కోట్లాది మంది యూజర్లు జీమెయిల్‌ను, గూగుల్ వర్క్‌స్పేస్‌ను రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. యూట్యూబ్ కూడా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ఈ రెండింటి సేవల్లో అంతరాయం ఏర్పడడం వల్ల వారంతా ఇబ్బంది పడ్డారు. జీమెయిల్, యూట్యూబ్.. రెండూ గూగుల్‌లో భాగమే. సమస్యకు కారణం ఏంటనే విషయంపై గూగుల్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంతకుముందు 2022 అక్టోబరు 25న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రంగంలోకి దిగిన వాట్సాప్ మాతృ సంస్థ 'మెటా' సర్వీసులను పునరుద్ధరించింది. మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపడం, అందుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాట్సాప్ వెబ్‌కు కనెక్ట్ చేస్తున్నప్పుడు 'కనెక్టింగ్' అని వచ్చిందని, ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదని యూజర్లు వాపోయారు. ట్విట్టర్లో 'వాట్సాప్ డౌన్' హ్యాష్‌ట్యాగ్ సైతం ట్రెండ్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్చల్ చేశాయి.