తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

గూగుల్​ సీక్రెట్ సెట్టింగ్స్.. ఓ లుక్కేయండి! - google settings Passwords

గూగుల్​.. ప్రతిఒక్కరి జీవితంలోనూ ఇది భాగస్వామ్యమైపోయింది. మనం చేసే ప్రతిపని దీనితో అనుసంధానమైపోయింది. అయితే చాలా మందికి గూగుల్​ సెట్టింగ్స్​లో ఉన్న ఫీచర్స్​​ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. అలాంటి వారి గురించే ఈ కథనం.

google
గూగుల్​

By

Published : Aug 11, 2021, 10:14 AM IST

ఇప్పుడందరివీ గూగుల్‌ జీవితాలే! మన రోజువారీ వ్యవహారాలతో గూగుల్‌ అంతలా మమేకమైపోయింది మరి. మెయిల్‌ పంపించుకోవాలన్నా, షాపింగ్‌ చేయాలనుకున్నా, డాక్యుమెంట్‌లో రాసుకోవాలనుకున్నా అన్నింటికీ ఇదే శరణ్యం. గూగుల్‌ వాడేవారికిది అనుభవైక వేద్యమే. దీని లోతులు ఎంతగా అవగతమైనా సెటింగ్స్‌లో చాలామందికి తెలియనివి చాలానే ఉన్నాయి. ఆన్‌లైన్‌ జీవన ప్రస్థానంలో ఇవి బాగా ఉపయోగపడతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. వాటి గురించి మనం తెలుసుకుందాం..

ఆఫ్‌లైన్‌లోనూ పని

కలిసి పనిచేయటానికి గూగుల్‌ డాక్స్‌, షీట్స్‌, స్లైడ్స్‌ మంచి మార్గాలు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా వీటితో పనులు చేసుకోవచ్చు. కాకపోతే చేసిన మార్పులను, పనులను సేవ్‌ చేసుకోవాలంటే తిరిగి ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ కావాలి. ఆఫ్‌లైన్‌లో వీటితో పనిచేసుకోవటానికి ముందుగా యాక్సెస్‌ ఫీచర్‌ను ఆన్‌ చేసుకోవాలి. ఇందుకోసం నెట్‌తో అనుసంధానం కావాలి.

క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి, గూగుల్‌ అకౌంట్‌తో సైన్‌ ఇన్‌ కావాలి. ఫైళ్లను సేవ్‌ చేయటానికి పీసీ, మొబైల్‌ ఫోన్లలో తగినంత స్పేస్‌ ఉండేలా చూసుకోవటం మరవద్దు.

గూగుల్‌ డ్రైవ్‌లోకి వెళ్లి సెటింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. ఆఫ్‌లైన్‌ బాక్స్‌లో టిక్‌ గుర్తును పెట్టుకోవాలి. ఆఫ్‌లైన్‌లో పని చేయాలని అనుకుంటున్న డాక్యుమెంట్లను సేవ్‌ చేసుకోవాలి.

గూగుల్‌ డ్రైవ్‌లోకి వెళ్లి ఆయా ఫైళ్ల మీద రైట్‌ క్లిక్‌ చేసి 'అవలేబుల్‌ ఆఫ్‌లైన్‌' ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోవాలి. అంతే ఇంటర్నెట్‌ లేకపోయినా వీటిల్లో ఆయా పనులు చేసుకోవటానికి సాధ్యమవుతుంది.

పని పూర్తయ్యాక ఇంటర్నెట్‌తో అనుసంధానమై సవరించిన డాక్యుమెట్లను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకేసారి వివిధ పరికరాలతో ఫైళ్లలో మార్పులు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. ఆయా పనులు ఓవర్‌రైడ్‌ కావచ్చు మరి.

ఫీచర్లతో ప్రయోగాలు

ప్రాథమిక, ప్రయోగాత్మక సాఫ్ట్‌వేర్‌ వర్షన్లు కొన్నిసార్లు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అస్తవ్యస్తం చేయొచ్చు. వీటి విషయంలో అప్రమత్తత అవసరం. అయితే కొందరు వినూత్న ఫీచర్లను పరీక్షించాలని ఉబలాట పడుతుంటారు. ఇలాంటివారు జీమెయిల్‌ కోసం గూగుల్‌ రూపొందించే ప్రయోగాత్మక ఫీచర్లను ప్రయత్నించొచ్చు. అందరికీ అందుబాటులోకి తీసుకురాకముందే వీటిని పరీక్షించొచ్చు. కావాలనుకుంటే ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి కొత్త ప్రయోగాత్మక ఫీచర్లేవీ లేవు గానీ వీటి గురించి ముందే తెలుసుకోవటానికి సెట్‌ చేసుకొని ఉండటం మేలు. కొత్త ప్రయోగాత్మక ఫీచర్లు విడుదల కాగానే యాక్సెస్‌ చేయటానికి వీలుంటుంది. జీమెయిల్‌ అన్‌డూ ఆప్షన్‌ మొదట్లో ఇలాంటి ప్రయోగాత్మక ఫీచర్‌గానే ముందుకొచ్చింది. మరి ఎక్స్‌పెరిమెంటల్‌ యాక్సెస్‌ను ఆన్‌ చేసుకోవటమెలా?

ముందుగా జీమెయిల్‌ను ఓపెన్‌ చేయాలి. కుడివైపున పైన ఉండే సెటింగ్స్‌ గేర్‌ను నొక్కితే అన్ని సెటింగ్స్‌ కనిపిస్తాయి. జనరల్‌ సెటింగ్స్‌ కింద ఎక్స్‌పెరిమెంటల్‌ యాక్సెస్‌ను ఎంచుకోవాలి. పేజీ కిందికి వచ్చి మార్పులను సేవ్‌ చేసుకోవాలి.

మన సమాచారమంతా డౌన్‌లోడ్‌

గూగుల్‌ ఖాతాతో ఎన్నెన్నో అనుసంధానం చేస్తుంటాం. వీటి సాయంతో గూగుల్‌ మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. మన ఫోన్‌ కాంటాక్టులు, ఆసక్తుల దగ్గర్నుంచి.. ఏమేం వెదుకుతున్నాం? ఏయే వస్తువులు కొంటున్నాం? వంటివన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. ఇలా గూగుల్‌తో అనుసంధానమైన అన్నింటి వివరాలను గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా కాపీ చేసి, ఎక్స్‌పోర్టు చేసుకోవచ్చనే సంగతి తెలుసా? ఇది బుక్‌మార్క్స్‌, గూగుల్‌ మ్యాప్స్‌ లొకేషన్‌ హిస్టరీ, ఈమెయిల్‌ కాంటాక్టులు, చూసిన యూట్యూబ్‌ వీడియోలు, మొత్తం సెర్చ్‌ హిస్టరీ.. ఒక్కటేమింటి అన్నింటినీ ఒకేసారి తెలుసుకోవచ్చు.

ముందుగా గూగుల్‌ ఖాతాలోకి సైన్‌ఇన్‌ అవ్వాలి. తర్వాత takeout.google.comలోకి వెళ్లాలి.

ఎక్స్‌పోర్ట్‌ చేసుకోవాలనుకునే సమాచారాన్నంతా ఎంచుకోవాలి.

నెక్స్ట్‌ స్టెప్‌ను క్లిక్‌ చేసి, సమాచారాన్ని రిసీవ్‌ చేసుకోవాలని అనుకుంటున్న తీరును (ఈమెయిల్‌ ద్వారా లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటం లేదా గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌ వంటి వాటికి జోడించటం) పద్ధతిని ఎంపిక చేసుకోవాలి. అంతే మొత్తం సమాచారం డౌన్‌లోడ్‌ అవుతుంది.

ప్రతి వారం లేదా ఏడాదికి రెండు నెలలకు ఒకసారి.. ఇలా ఎంత కాలానికి సమాచారాన్ని రిసీవ్‌ చేసుకోవాలనేదీ ఎంచుకోవచ్చు. ఫైల్‌ రూపాన్ని కూడా నిర్ణయించుకోవచ్చు.

అవసరమైన ట్యాబ్‌ శోధన

కొందరు ఒకే సమయంలో బోలెడన్ని ట్యాబ్స్‌ను ఓపెన్‌ చేసి పనులు కానిచ్చేస్తుంటారు. వీటిల్లో అవసరమైన ట్యాబ్‌ను వెతకటం కొన్నిసార్లు కష్టంగా అనిపించొచ్చు. దీన్ని వెతకటానికి తేలికైన మార్గం లేకపోలేదు.

క్రోమ్‌ను తెరచి, ట్యాబ్‌ జాబితా పక్కన ఉండే చిన్న బాణం గుర్తును నొక్కాలి. అందులో వెబ్‌సైట్‌ పేరు, కీవర్డ్‌తో గానీ మరేదైనా పదంతో గానీ సెర్చ్‌ చేస్తే ట్యాబ్‌ ప్రత్యక్షమవుతుంది. దీన్ని క్లోజ్‌ చేయాలనుకుంటే ఎక్స్‌ మీటను నొక్కితే సరి.

హిస్టరీకీ పాస్‌వర్డ్‌

గూగుల్‌ సేవలు ఉపయోగించుకున్న ప్రతిసారీ మన పనులన్నీ మై అకౌంట్‌ పేజీలో నిక్షిప్తమవుతాయి. ఇది మనం ఏమేం వెతికాం? ఏమేం పొటోలు తీసుకున్నాం? ఏయే యూట్యూబ్‌ వీడియోలు చూశాం? గూగుల్‌ యాప్స్‌ను ఎప్పుడెలా వాడుకున్నాం? వంటి విషయాలన్నింటినీ చూపుతుంది. ఒక్క పీసీలోనే కాదు, గూగుల్‌ ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ ఫోన్లలోని హిస్టరీ అంతా ఇందులో నమోదవుతుంది. పరికరాలను మనమే వాడుకుంటే ఇబ్బందేమీ ఉండకపోవచ్చు గానీ ఇతరులెవరైనా దీన్ని చూస్తే? అంటే కంప్యూటర్‌ను ఇతరులకు షేర్‌ చేసినా, ఇంట్లో పీసీ పాస్‌వర్డ్‌ అందరికీ తెలిసినా గూగుల్‌ ఖాతా తెరచి ఉన్నట్టయితే ఒక్క క్లిక్‌తో గుట్టంతా రట్టవుతుంది. దీన్ని తప్పించుకోవటానికీ ఓ మార్గముంది. వీటన్నింటినీ పాస్‌వర్డ్‌తో సురక్షితం చేసుకుంటే సరి.

కంప్యూటర్‌లో myactivity.google.com లోకి వెళ్లాలి. సైన్‌ ఇన్‌ కాగానే ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ విభాగం వద్ద 'సేఫర్‌ విత్‌ గూగుల్‌' బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మేనేజ్‌ను క్లిక్‌ చేయాలి.

'రిక్వైర్‌ ఎక్స్‌ట్రా వెరిఫికేషన్‌' ఆప్షన్‌ను ఎంచుకొని సేవ్‌ చేసుకోవాలి.

దీంతో పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తేనే హిస్టరీని చూడటానికి, డిలీట్‌ చేయటానికి వీలవుతుంది. గూగుల్‌ పాస్‌వర్డ్‌ను బ్రౌజర్‌ లేదా కంప్యూటర్‌లో సేవ్‌ చేస్తే మాత్రం ఉద్దేశం నెరవేరదని గుర్తుంచుకోండి. జ్ఞాపకం ఉంచుకోదగిన సురక్షితమైన పాస్‌వర్డ్‌ను నిర్ణయించుకోవటం మంచిది.

ప్రయోగాత్మక ఫీచర్లలో కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో షేర్డ్‌ పియానో ఒకటి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి సంగీతాన్ని నేర్చుకోవటానికి, సహకరించు కోవటానికి దీన్ని రూపొందించారు. ఇందులో 10 మంది ఒకేసారి పియానోను వాయించొచ్చు. దీన్ని పరీక్షించటానికి లాగిన్‌ కావాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన పనీ లేదు.

ఇదీ చూడండి: టెలిగ్రామ్​లో ఈ చిట్కాలు పాటించండి!

ABOUT THE AUTHOR

...view details