షియోమీ కంపెనీ స్మార్ట్ వేరబుల్స్ శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. ఇప్పటికే ఫిట్‌నెస్ బ్యాండ్, స్మార్ట్‌వాచ్‌లతోపాటు గృహోపకరణాలను విడుదల చేసిన షియోమీ.. ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్‌ను (Xiaomi Glasses) తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌గ్లాసెస్ మోడల్స్‌కు భిన్నంగా సరికొత్త ఫీచర్స్ ఇందులో పరిచయం చేసినట్లు తెలిపింది. షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌లో మైక్రో ఎల్‌ఈడీ ఆప్టికల్ వేవ్‌గైడ్ సాంకేతికతను ఉపయోగించారు. దీంతో స్మార్ట్‌గ్లాసెస్ మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, నేవిగేషన్, కాలింగ్, ఫొటో, ట్రాన్స్‌లేషన్ వంటి సర్వీసులను యూజర్‌కు అందిస్తుంది. షియోమీ స్మార్ట్‌గ్లాసెస్‌లో క్వాడ్‌కోర్ ఏఆర్‌ఎమ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ ఓఎస్ సాయంతో ఈ స్మార్ట్‌గ్లాసెస్ పనిచేస్తాయి.
ఈ గ్లాసెస్‌కు ఎడమవైపు ఫ్రేమ్‌లో 5 ఎంపీ కెమెరా అమర్చారు. దీని సాయంతో యూజర్ ఫొటోలు తీయడం సహా, ఫొటోలోని టెక్ట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అలానే కుడివైపు గ్లాస్‌లో 0.13 అంగుళాల మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది ఫోన్ కాల్స్, నావిగేషన్, నోటిఫికేషన్స్, ఫొటో వంటి వాటిని స్క్రీన్‌పై చూపిస్తుంది. షియోమీ ఏఐ అసిస్టెంట్ సాయంతో యూజర్ ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ను ఉపయోగించవచ్చు. ఫోన్‌కాల్, నోటిఫికేషన్, ఫొటో ట్రాన్స్‌లేషన్ వంటి కమాండ్స్‌తో స్మార్ట్‌గ్లాసెస్ సేవలను యూజర్ పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను గ్లాసెస్‌కు అనుసంధానించుకుంటే ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్ స్మార్ట్‌గ్లాసెస్‌లో చూడొచ్చు. కాల్స్ మాట్లాడుకునేందుకు ఇందులో మైక్రోఫోన్, స్పీకర్ ఇస్తున్నారు. ఇందులో మొత్తం 497 కాంపోనెంట్స్ ఉపయోగించారు.