X Video And Audio Calling Feature : అపరకుబేరుడు, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలో ఎక్స్ వేదికలో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సరికొత్త ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ, పీసీ సహా మ్యాక్ బుక్‌లోనూ పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఫోన్ నంబర్‌తో పనిలేదు!
ఎక్స్ (ట్విటర్) తేనున్న ఈ ఫీచర్ ఉపయోగించాలంటే.. ఫోన్ నంబర్ కూడా అవసరం లేదని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ఇదే గనుక సాకారమైతే.. ఫోన్ కాలింగ్ విషయంలో ఓ సరికొత్త శకం ప్రారంభమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గ్లోబల్ అడ్రస్‌బుక్
Elon Musk Latest Tweet :ఎలాన్ మస్క్ ఈ నయా ఎక్స్ వీడియో & ఆడియా కాలింగ్ అనేది ఓ ప్రత్యేకమైన (యూనిక్) ఫీచర్ అని చెబుతున్నారు. ఈ ఫీచర్‌తో ఎక్స్ వేదిక అనేది ఒక గ్లోబల్ అడ్రస్ బుక్‌గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
"త్వరలో 'ఎక్స్' వీడియో అండ్ ఆడియో కాలింగ్ ఫీచర్ రానుంది.
ఈ ఫీచర్ ఐవోఎస్, ఆండ్రాయిడ్, మ్యాక్ అండ్ పీసీలో పనిచేస్తుంది.
ఫోన్ నంబర్ లేకుండానే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఎక్స్ అనేది ఒక ప్రభావితమైన గ్లోబల్ అడ్రస్ బుక్‌గా మారుతుంది.
ఇవన్నీ ఈ నయా ఫీచర్‌లోని యూనిక్ అంశాలు."
- ఎలాన్ మస్క్ ట్వీట్
సూపర్ రెస్పాన్స్
ఎలాన్ మస్క్ ఈ ఎక్స్ వీడియో, ఆడియా కాలింగ్ ఫీచర్ గురించి ట్వీట్ చేయగానే.. దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది. ఇది చాలా మంచి అప్డేట్ అని.. యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
X Job Hiring Feature : ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విట్టర్) బీటా వెర్షన్లో జాబ్ హైరింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ ఇందులో ఉద్యోగ ప్రకటనలు చేసుకోవచ్చని పేర్కొంది. దీనితో ఇకపై ఎక్స్ యూజర్లు చాలా సులువుగా జాబ్ నోటిఫికేషన్లను తెలుసుకోవచ్చుని, అలాగే ఇదే వేదిక నుంచి ఆయా పోస్టులకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ మాత్రమే!
X Hiring Feature Eligibility Criteria : ఎక్స్ తీసుకొచ్చిన ఈ నయా జాబ్ హైరింగ్ ఫీచర్.. ప్రస్తుతం ధ్రువీకరణ పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించడానికి వీలవుతుంది. దీని ద్వారా ఆయా సంస్థలు తమ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్స్‌లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయవచ్చు. కానీ ఈ ఫీచర్ ఉపయోగించేందుకు నెలవారీగా 1000 డాలర్లు లేదా సుమారు రూ.82,000 చెల్లించాల్సి ఉంటుంది.