చాట్‌జీపీటీ.. కొద్దిరోజుల నుంచి దాదాపు అందరికీ పరిచయమైన పదం. సాంకేతికత అభివృద్ధిలో భాగంగా ఇటీవలే ప్రారంభమయిన ఈ చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా ఆశాజనకమైన ఫలితాలనిస్తున్నా.. కొన్ని చోట్ల విఫలమవుతోంది. అయినప్పటికీ భవిష్యత్‌లో గూగుల్‌కు పోటీగా వచ్చే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మీడియా రంగంలోనూ ఈ తరహా టెక్నాలజీని తీసుకొచ్చింది న్యూస్‌జీపీటీ. దాని పేరే న్యూస్‌జీపీటీ(వార్తాజీపీటీ). పూర్తి కృత్రిమ మేధతో(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో రూపొందించిన ఈ వార్తాజీపీటీ మున్ముందు మీడియా రంగంలో పని చేసే వారు ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుందని సాక్షాత్తు దీని రూపకర్త సంస్థ సీఈఓ అలాన్ లెవీ పేర్కొన్నారు.
పూర్తిగా కృత్రిమ మేధతో రూపొందిన ఈ న్యూస్బాట్ ప్రపంచంలోనే మొట్టమొదటి వార్తాజీపీటీగా నిలవనుంది. దీని ఆవిష్కరణతో మీడియాలో పనిచేసే వారి ఉద్యోగ భద్రతకు కచ్చితంగా ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వార్తాజీపీటీ కృత్రిమ మేధస్సుతో ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా ఓ వార్తా ఛానెల్లా పనిచేస్తుందని సంస్థ తెలిపింది. మొత్తంగా మీడియా ప్రపంచంలో ఈ న్యూస్బాట్ ఓ గేమ్ ఛేంజర్‌గా మారనుందని లేవీ అన్నారు.
"ప్రస్తుతం ఉన్న వార్తా సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాత ధోరణితో ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ న్యూస్జీపీటీతో మేము అటువంటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతాము. ఎటువంటి పక్షపాత బుద్ధిని ప్రదర్శించకుండా, పూర్తి పారదర్శకతతో ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తాము."
- అలాన్ లెవీ, న్యూస్‌జీపీటీ సీఈఓ
విలేకరులు లేకుండా, అలాగే ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులు, వీక్షకులకు నిష్పాక్షికమైన, వాస్తవ ఆధారిత వార్తలను అందిస్తామని న్యూస్‌జీపీటీ పేర్కొంది. న్యూస్జీపీటీని newsGPT.ai అని టైప్ చేసి దీని సేవలను ఉచితంగా పొందొచ్చని సంస్థ తెలిపింది.
మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సహాయంతో వార్తాజీపీటీ ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని సంఘటనలను గుర్తించి పూర్తి వివరాలను సరైన సమయానికి ప్రజలకు అందించగలదు. దీని కృత్రిమ మేధ(ఏఐ) అల్గారిథమ్‌లు సోషల్ మీడియా, న్యూస్ వెబ్‌సైట్‌లు, ప్రభుత్వ ఏజెన్సీలతో సహా అనేక రకాల మార్గాల నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి పాఠకులకు వివరించగలవు. అంతేగాక కచ్చితమైన, తాజా, నిష్పాక్షికమైన వార్తలను రూపొందించే సామర్థ్యం దీనికి ఉందని సంస్థ వెల్లడించింది.