మగజాతి గర్భం దాలిస్తే... ప్రసవ వేదన అనుభవిస్తే... పేగు తెంచుకుని పిల్లల్ని కంటే...! ఇదంతా సృష్టి విరుద్ధం అనుకుంటున్నారా...? ముమ్మాటికి కాదు.. ఇది నీటి గుర్రం విషయంలో సాధ్యమే. మొత్తం జంతు ప్రపంచంలో ఒక్క మగ నీటి గుర్రం మాత్రమే గర్భం ధరిస్తుంది. ప్రసవ వేదన అనుభవిస్తుంది. శిశువుకి ప్రాణవాయువును, ఆహారాన్ని అందించి పిల్లల్ని కంటుంది. సృష్టిలో ఇది ఒక అద్భుతమైన వింత.
ETV Bharat / science-and-technology
అద్భుతమైన వింత... మగ జాతి పిల్లల్ని కంటోంది...! - మగ నీటి గుర్రాలు
స్త్రీ జాతి గర్భం ధరించి, జన్మనివ్వడం సహజ సిద్ధమైన ప్రక్రియ. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఇదే జరుగుతుంది. ఈ రకం జంతువుల్ని శిశుత్పాదక జంతువులంటారు. దీనికి విరుద్ధంగా మగ జాతి సంతానాన్ని కంటే.. ఎలా సాధ్యం అంటారా? ఈ స్టోరీ చదివేయండి... మీకే అర్థమవుతుంది...!
వీటిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. ఆడ, మగ నీటి గుర్రాలు తొలిసారి లైంగికంగా కలిసినప్పుడు అనేక గంటల పాటు రెండూ ఒకదానినొకటి కవ్వించుకుంటాయి. ఈ కవ్వింపుల వల్ల వాటిలో లైంగిక పరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. మగ గుర్రానికి శరీరం వెలుపలి భాగంలో గుడ్లను పొదిగే సంచి లాంటి అవయవం ఉంటుంది. ఆడ నీటి గుర్రం లైంగిక ప్రక్రియ పతాక స్థాయికి వచ్చినప్పుడు అది విడుదల చేసిన ఫలదీకరణ చెందిన గుడ్డును మగ నీటి గుర్రం సంచిలో జారవిడుస్తుంది. అప్పుడు మగ నీటి గుర్రం వీర్యాన్ని విడుదల చేసి ఆ గుడ్డుపైన పడేటట్లు చేస్తుంది. ఇవి రెండూ కలిసి ఆ సంచిలో శిశు జననానికి శ్రీకారం చుడతాయి.
ఆడ-మగ నీటి గుర్రాల లైంగిక క్రీడల్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు 1870లోనే ఈ వింతను కనుగొన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మగ నీటి గుర్రం పిల్లల్ని కనే వరకూ మళ్లీ లైంగిక ప్రక్రియ జోలికి వెళ్లదు. అంతేకాదు.. మగనీటి గుర్రం తన మొదటి భాగస్వామి దొరకకపోతే ఇంకొక దాన్ని అంగీకరించదట. ఈ నీటి గుర్రాలతో పాటు.. అదే జాతికి చెందిన మగ పైప్ ఫిష్, సీ డ్రాగన్ కూడా ఇదే విధంగా పిల్లల్ని కంటాయి.